
అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అధికారులు తమ చేతివాటం చూపిస్తూ ఏసీబీ వలలో చిక్కుతూ ఉంటారు. అయితే, ఏసీబీకి దొరకకుండా ఉండేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది అతితెలివి గల అధికారులు లంచానికి కూడా ఈఎంఐ పద్దతి అవలంబిస్తున్నారు. బాధితుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈఎంఐ రూపంలో లంచం తీసుకోవడం మొదలు పెట్టారు. జీఎస్టీ బోగస్ బిల్లింగ్ స్కాం లో మొత్తం 21లక్షల సొమ్మును 2లక్షల చొప్పున ఈఎంఐ రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు.
సూరత్ లో ఓ డిప్యూటీ సర్పంచ్ ఒక రైతు దగ్గర 85వేల రూపాయల లంచం ఈఎంఐ పద్దతిలో వసూలు చేశాడు. రైతు తన భూమిని చదును చేయమని డిప్యూటీ సర్పంచ్ ను సంప్రదించగా 85వేలు లంచం డిమాండ్ చేశాడని, రైతుకు మొత్తం ఒకేసారి ఇచ్చే స్తొమత లేదని తెలిసి 35వేలు చొప్పున ఈఎంఐ రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు అధికారులు. మరో ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు 4లక్షల రూపాయల లంచాన్ని ఈఎంఐ రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు అధికారులు. మొత్తానికి, అవినీతి అధికారుల్లో కూడా మానవీయ కోణం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.