ఇందిరమ్మ సాగర్, వేముల కత్వను కాపాడాలి..సీపీఎం నేతల డిమాండ్

ఇందిరమ్మ సాగర్, వేముల కత్వను కాపాడాలి..సీపీఎం నేతల డిమాండ్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: సిటీ శివారులో ఉన్న చెరువులను అధికారులు రక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య ఆరోపించారు. కబ్జాకు గురవుతున్న చెరువు, కాల్వలను కాపాడి హద్దులు నాటాలని డిమాండ్​చేశారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అనాజ్ పూర్ లోని వేముల కత్వ, ఇందిరమ్మ సాగర్ లను శుక్రవారం సీపీఎం జిల్లా నాయకులు పరిశీలించారు. 

ఈ రెండు చెరువుల్లోని ఎఫ్టీఎల్ పరిధిలో గుట్టలను పగలదీసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ రోడ్లు వేస్తున్నారన్నారు. ఇప్పటికే ఒక పక్క ఫిలిం సిటీ యాజమాన్యం ఎఫ్టీఎల్ నుంచి భారీ గోడ నిర్మించిందని, తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు 300 ఎకరాల భూమిని చదును చేస్తూ అందులో విల్లాస్ నిర్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కబ్జా బాగోతంపై మౌనంగా ఉంటున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.