సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో ఇటీవల జరిగిన పరువు హత్య కేసు మిస్టరీ వీడింది. తమ సోదరి కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకున్న సోదరులు.. నానమ్మ ప్రోత్సాహంతో హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని తమ నానమ్మకు చూపించడమే కాకుండా డెడ్‌బాడీతో కారులో కిలోమీటర్ల కొద్దీ తిరిగారు. తర్వాత పిల్లలమర్రి సమీపంలోని మూసీ కెనాల్ వద్ద పడేశారు.
ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం వెల్లడించారు. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (32) అలియాస్ బంటి, పిల్లలమర్రికి చెందిన కోట్ల భార్గవి ప్రేమించుకున్నారు. వీరి పెండ్లికి భార్గవి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆగస్టులో నకిరేకల్‌లో పెండ్లి చేసుకున్నారు. దీంతో భార్గవి సోదరులు కోట్ల నవీన్, వంశీ కలిసి కృష్ణను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా నవీన్ ఫ్రెండ్ అయిన బైరు మహేశ్ కృష్ణతో పరిచయం పెంచుకున్నాడు. కృష్ణను గతంలో మూడు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ నెల 26న కృష్ణను మహేశ్ తన వ్యవసాయ బావి వద్దకు పిలిచాడు. అక్కడికి వచ్చిన కృష్ణను నవీన్, వంశీ, మహేశ్ కలిసి హత్య చేశారు.
నానమ్మకు చూపించి... కారులో కిలోమీటర్ల కొద్దీ తిరిగి...
కృష్ణను హత్య చేసిన అనంతరం అతడి డెడ్‌బాడీని కారు డిక్కీలో వేసుకొని నవీన్, వంశీ, మహేశ్ కలిసి మొదట పాత సూర్యాపేట గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద ఉన్న నానమ్మ దగ్గరికి వెళ్లి చూపించారు. అక్కడి నుంచే వాళ్ల నాన్న సైదులుకు ఫోన్ చేసి కృష్ణను హత్య చేసినట్లు చెప్పారు. తర్వాత వంశీని అక్కడే వదిలి మహేశ్, నవీన్ ఇద్దరు కలిసి కారులో మృతదేహంతో తెల్లవారుజాము వరకు పాత సూర్యాపేట, నల్గొండ, నార్కట్‌పల్లి, నకిరేకల్ ప్రాంతాల్లో తిరిగారు. తర్వాత నల్గొండలో ఉంటున్న సాయిచరణ్ ఇంటికి వెళ్లి అతడిని బయటకు పిలిచి డెడ్‌బాడీని చూపించారు. భయపడిన సాయిచరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత డెడ్‌బాడీని నల్గొండ పరిసరాల్లో పడేయాలని నవీన్, మహేశ్ భావించినా సాధ్యం కాలేదు.
దీంతో తిరిగి సూర్యాపేటకు వచ్చి పిల్లలమర్రి సమీపంలోని మూసీ కెనాల్ వద్ద పడేశారు. విషయం తెలియడంతో కేసు నమోదు చేసిన పోలీసులు భార్గవి సోదరులైన కోట్ల వంశీ, నవీన్, తండ్రి సైదులు, నానమ్మ బుచ్చమ్మతో పాటు బైరు మహేశ్, నల్గొండకు చెందిన సాయిచరణ్‌ను అరెస్ట్ చేశారు. వీరిపై హత్యతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి ఎర్టీగా కారు, నాలుగు సెల్‌ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ రవి, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలునాయక్ ఉన్నారు.