హనుమకొండ, వెలుగు: ఇండ్లు లేని పేదవాళ్లు ఎవరూ ఉండొద్దని సీఎం కేసీఆర్చెప్పి మూడు కాదు ఏడేండ్లు గడుస్తున్నాయి. నేటికీ గ్రేటర్ వరంగల్‌లో పేదలకు గుడిసెలే దిక్కయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం హోదాలో మొదటిసారి ఓరుగల్లు నగరానికి వచ్చిన సీఎం కేసీఆర్ నాలుగు రోజులు సిటీలో పర్యటించారు. 3,957 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని ఏరియాల వాళ్లు పట్టాలు డిమాండ్చేయగా.. వారిలో కొందరికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మిగతావారికి మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా హనుమకొండ జితేంద్రసింగ్నగర్, అంబేద్కర్‌నగర్‌వాసులు పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రెండు ఏరియాల్లో ఉండే దాదాపు 250 కుటుంబాల ప్రజలు ‘డబుల్’ ఇండ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌హామీ మేరకు గుడిసెలు ఖాళీ చేసి ఆ పక్కనే టెంపరరీ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ స్థలంలో 13 బ్లాకుల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. రెండేండ్ల కిందటే పనులు కంప్లీట్ అయ్యాయి. అయినా వాటిని లబ్ధిదారులకు కేటాయించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు.
ఇరుకు గుడిసెల్లోనే బతుకులు
గుడిసెలు ఖాళీ చేసిన తర్వాత అంబేద్కర్‌నగర్, జితేంద్రసింగ్నగర్కాలనీల ప్రజల్లో కొంతమంది వేరేచోట్ల కిరాయికి ఉంటుండగా.. చాలామంది పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో పూరి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అన్ని కుటుంబాలకు జాగా సరిపడా లేకపోవడంతో ఉన్నదాంట్లోనే ఇరుకిరుకుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సౌలత్లు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదురవుతుండగా.. వర్షాలు పడినప్పుడు వారి బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. గుడిసెల్లోని సామాన్లన్నీ తడిచిపోవడంతో పాటు కనీసం కూర్చోడానికి కూడా స్థలం లేక అవస్థలు పడాల్సి వస్తోంది. సంబంధిత ఓనర్ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఫోర్స్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తయిన ఇండ్లను కేటాయించాలని ఇక్కడి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే, చీఫ్విప్దాస్యం వినయ్‌భాస్కర్‌కు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. వర్షాలు పడినప్పుడల్లా అవస్థలు పడుతున్నామని తెలియజేశారు. ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పిన ఆయన పలుసార్లు వాయిదాలు పెట్టారు. ఇండ్లు కేటాయించడంలో జాప్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఎస్పీ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా నిర్వహించినా సర్కారుకు మాత్రం పట్టడం లేదు.
692 ఇండ్లు పూర్తయినా కేటాయిస్తలేరు
గ్రేటర్వరంగల్ పరిధిలోకి వచ్చే ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు విలీన గ్రామాలు ఎక్కువగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గానికిగానూ మొత్తంగా 4,517 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఇందులో ఈస్ట్ నియోజకవర్గంలో 2,200, వెస్ట్‌లో 1,505, వర్ధన్నపేటలో 795 ఇండ్లకు ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్శాంక్షన్ఇచ్చింది. కానీ వీటిలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఏనుమాముల ఎస్సార్‌నగర్‌లో 208 ఇండ్లు కంప్లీట్ అవగా.. వాటిని ఇటీవలే గ్రేటర్ ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక ఈస్ట్ నియోజకవర్గంలోని దూపకుంటలో 100 ఇండ్లు, వెస్ట్‌లో అంబేద్కర్‌నగర్, జితేంద్రసింగ్నగర్వాసుల కోసం కట్టిన 592 ఇండ్లు పూర్తయినా వాటిని లబ్ధిదారులకు కేటాయించడం లేదు. నిర్వహణ లేక ఇండ్ల ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి గోడలు బీటలు వారుతున్నాయి. ఇంకొద్దిరోజులు గడిస్తే తలుపులు, కిటికీలు కూడా శిథిలావస్థకు చేరి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది.
ఏ ముఖ్యమంత్రీ వరంగల్ లో నాలుగు రోజులు ఉండలే. ఇక్కడ రోడ్లన్నీ తిరిగిన. టౌన్‌కు మూడు దిక్కులా లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్, ప్రగతినగర్, దీనదయాళ్నగర్, అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఏనుమాముల ఎస్సార్‌నగర్, గరీబ్‌నగర్, గాంధీనగర్ ఇవన్నీ తిరిగిన. ఈ 9 కాలనీలకు రూ.400 కోట్లతో 3,957 ఇండ్లు మంజూరు చేసినం. ఇంకా 60, 70 బస్తీలు ఉన్నయ్.. వాటి దరిద్రం కూడా పోవాలే. రాబోయే రెండు, మూడేండ్లలో పట్టాలు, ఇండ్లు లేని పేదవాళ్లు ఎవరూ ఉండొద్దు. 2015 జనవరిలో సీఎం హోదాలో వరంగల్ నగరానికి తొలిసారి వచ్చినపుడు కేసీఆర్ చెప్పిన మాటలివి.