భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ‘‘ఫారెస్టోళ్లను పోడు భూముల్లోకి రానీయకండి. వస్తే నిర్బంధించండి. తరిమికొట్టండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాక ప్రత్యక్ష యుద్ధమే’’ అంటూ పోడు రైతులను రెచ్చగొట్టేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లపై ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది మండిపడ్తున్నారు. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యతో ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సర్కారు ద్వంద్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పోడు రైతులపై ఫారెస్టోళ్లను ఎగదోస్తూ, మరోవైపు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేలతో పోడురైతులను ఫారెస్టోళ్లపైకి రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? అని గిరిజన సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పోడు విషయంలో అధికారులు చేస్తున్న సర్వేపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసే కుట్రకు సర్కారే తెరలేపిందేమోనని అంటున్నారు.
ప్రగతి భవన్ నుంచే రేగా పోస్టులు
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఇటీవలి వరకు ప్రగతిభవన్, ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ వెంటే ఉన్న రేగా కాంతారావు ఫారెస్ట్ ఆఫీసర్లకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. పోడు భూముల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తే తరిమికొట్టాలంటూ రెచ్చగొట్టారు. ‘‘ఫారెస్ట్ ఆఫీసర్లతో ఇక అమీతుమీ తేల్చుకుందాం. లేకపోతే మన బతుకులు రోడ్డుమీద పడ్తయి. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్ల తీరు మారడం లేదు. అందరూ యుద్ధానికి సిద్ధంకండి’’ అంటూ గతంలోనూ రేగా పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. అయితే, మంత్రి పువ్వాడ బుధవారం మాట్లాడుతూ.. ఫారెస్టోళ్లపై దాడులను సహించే ప్రసక్తే లేదన్నారు. దీంతో రూలింగ్పార్టీకి చెందిన ఇద్దరు లీడర్ల తీరుపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతోంది.