
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పొగాకు, మద్యం ప్రమోషన్లను, ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నెల 22 నుంచి జరిగే లీగ్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పొగాకు, మద్యం బ్రాండ్ల ప్రకటనలను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌కు కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ లేఖ రాశారు. క్రికెటర్లు యువతకు రోల్ మోడల్స్ కావడంతో వాళ్లు ఇలాంటి ఉత్పత్తులకు ప్రమోషన్ చేయకూడదని తెలిపారు.
స్టేడియాల్లో, టెలివిజన్ ప్రసారాల్లో, లీగ్ సంబంధిత ఇతర ఈవెంట్లలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అలాగే, క్రికెటర్లతో పాటు కామెంటేటర్లు కూడా ఈ ఉత్పత్తులను ప్రచారం చేయకుండా చూడాలని తెలిపారు. ‘క్రికెటర్లు ప్రజా ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు బాధ్యత వహించాలి. ఐపీఎల్ దేశంలోని అతిపెద్ద క్రీడా వేదికగా ఉన్నందున ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలి’ అని గోయల్ లేఖలో పేర్కొన్నారు.