టొబాకో స్ట్రీక్​ వైరస్ ఆశించినట్లు గుర్తించిన సైంటిస్టులు

  • విజృంభిస్తున్న గులాబీ, కాండం ముక్కు పురుగు 
  • ఆందోళన చెందుతున్న భద్రాద్రికొత్తగూడెం రైతులు

 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :భద్రాద్రి జిల్లా రైతాంగాన్ని టొబాకో స్ట్రీక్​ వైరస్​ ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్​ ప్రారంభంలో వరదలు రావడం, ఆ తరువాత వర్షాలు రాకపోవడంతో టెన్షన్​ పడిన రైతులు ఇటీవల వానలు పడడంతో ఊరట చెందారు. ఇప్పుడిప్పుడే పత్తి ఏపుగా పెరిగి పూతకు వచ్చిన దశలో వైరస్​లు, పురుగులు, తెగుళ్లు సోకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిని టొబాకో​ స్ట్రీక్​ వైరస్​తో పాటు గులాబీ పురుగు, కాండం ముక్కు పురుగు ఆశించిందని, ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుందని సైంటిస్టులు హెచ్చరించడంతో నష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు. 

పత్తికి కష్ట కాలమే..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ వానాకాలం సీజన్​ 1.58 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్,​భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో టొబాకో స్ట్రీక్​ వైరస్​ ఆశించినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో గులాబీ పురుగు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో 60 వేల ఎకరాల్లో కాండం ముక్కు పురుగు పత్తిని ఆశించింది. జిల్లాలోని చండ్రుగొండ, గుండాల, టేకులపల్లి, చర్ల, పాల్వంచ తదితర మండలాల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. స్ట్రీక్​ వైరస్​ దాడి ఇప్పుడిప్పుడే మొదలవుతోందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వైరస్​, పురుగుల దాడితో పూత రాలిపోవడం, కాండం విరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తామర పురుగు ద్వారా టొబాకో స్ట్రీక్​ వైరస్​ వ్యాపిస్తున్నట్లుగా సైంటిస్టులు గుర్తించారు. 

ఇష్టం వచ్చినట్లు మందులు కొట్టొద్దు..
టొబాకో స్ట్రీక్​ వైరస్​ సోకిన మొక్కల్లో కొమ్మల చివర లేత ఆకులు కొద్దిగా పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయని భద్రాద్రికొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్​ లక్ష్మీనారాయణమ్మ తెలిపారు. వ్యాధి సోకిన కొమ్మల్లో ఎదుగుదల ఆగి గడసబారుతాయని, మొగ్గలు ఎండి రాలిపోతాయని చెప్పారు. ఆకుల్లో కొంత భాగం రాలిపోయి వంకర తిరిగినట్లు కుంచించుకుపోతాయని తెలిపారు. ఈ వైరస్​ను అరికట్టేందుకు గట్ల వెంట పెరిగే వయ్యారి భామ, ఉత్తరేణి, గడ్డి చామంతి వంటి కలుపు మొక్కలను పూతకు రాకముందే పీకి కాల్చేయాలని సూచించారు. తామర పురుగు వ్యాప్తిని అరికడితే టొబాకో స్ట్రీక్​ వైరస్​ ఉధృతి కూడా తగ్గుతుందని తెలిపారు. వైరస్, తెగుళ్లను అరికట్టేందుకు రైతులు వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మందులు కొట్టి నష్టపోవద్దని సూచించారు.