కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి(Raj B Shetty) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ టోబి(Toby). విలక్షణ కథతో, సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్స్ లోకి వచ్చి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాసిల్ అచలక్కల్ తెరకెక్కించిన ఈ రియలిస్టిక్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హీరో(రాజ్ బి. శెట్టి) యుక్త వయసు నుండి మొదలవుతుంది ఈ సినిమా. అతను బాలనేరస్థుల జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల అతని ఓకల్ కార్డ్స్ దెబ్బతిని.. మాట్లాడటం వీలు కాదు. ఇక అతని పేరు, ఊరు వివరాలు ఎవరికీ తెలియదు. అతని మానసిక స్థితి సరిగ్గా లేదనే, పేరు, వివరాలు లేవని తెలిసిన చర్చి ఫాదర్ (యోగి).. . ఆ కుర్రాడికి టోబి అనే పేరు పెడతాడు. అప్పటి నుంచి టోబికి ఫాదర్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. కొంతకాలానికి జైలు నుండి విడుదలైన టోబి శవాల గదికి కాపలాగా ఉండే పనిలో చేరుతాడు.
ఆ సమయంలో అతనికి కాలువ పక్కన ఆడ శిశువు కనిపిస్తుంది. ఆ పాపకి జెన్నీ అనే పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే టోబికి సావిత్రి అనే వేశ్యతో పరిచయం అవుతుంది. తాము ముగ్గరు ఉండటానికి ఒక ఇల్లు కావాలని టోబికి చెప్తుంది సావిత్రి. అందుకోసం ఒక మర్డర్ చేయాల్సి వస్తుంది టోబి. మరి టోబి ఆ మర్డర్ చేశాడా? జెన్నీ కోసం ఇల్లు కట్టాడా? టోబి జీవితంలోకి సంతోష్ ఎలా వచ్చాడు? ఆ తరువాత టోబి, అతని ఫ్యామిలీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
కన్నడ ఇండస్ట్రీలో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అంటే రాజ్ బి. శెట్టి అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాల లిస్టు చూస్తే అది క్లియర్ గా అర్థంవుతింది. ఇప్పుడు టోబి కూడా అలాంటి సినిమానే. మూడు బలమైన పాత్రలతో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు బాసిల్ అచలక్కల్ చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇది ఒక సినిమా అనే కంటే మన ఇంటి పక్కన జరుగుతున్న కథలా అనిపిస్తుంది. సినిమాలో ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అందుకే ఆ పాత్రలకు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక టోబి పాత్రలో రాజ్ బి. శెట్టి నటన సినిమాకె హైలెట్. మానసిక స్థితి సరిగా లేకపోవడం, మాటలు రాకపోవడం, ఏ క్షణంలో ఎలా మారిపోతాడో తెలియనివ్వకుండా అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక టోబి కూతురుగా చేసిన చరిత్ర ఆచార్, వేశ్య పాత్రలో సంయుక్త, విలన్ పాత్రలో పాత్రలో దీపక్ శెట్టి పాత్ర మేరకు నటించారు.
టెక్నీషియన్స్:
టోబి సినిమాకు ప్రధాన బలం అంటే మిథున్ ముకుందన్ నేపథ్య సంగీతం అనే చెప్పాలి. సహజత్వానికి దగ్గరగా ఆయన ఆడించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ప్రవీణ్ శ్రియన్ అందించిన ఫొటోగ్రఫీ కూడా టాప్ నాచ్ అనే చెప్పాలి. ఆయన కెమెరా పనితనం కథకు మరింత సహజత్వాన్ని అందించింది. నితిన్ శెట్టి ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఇక టోబి సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఒక్కసారి ఈ కథకి కనెక్ట్ అయితే.. బయటికి రాయడం కష్టం. కథలోని సహజత్వం, డైరెక్టర్ టేకింగ్, హీరో మెస్మరైజిగ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కు కట్టిపడేస్తాయి.