
ఇవాళ మనం ఏ- 'కులతత్వం' వదలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నామో, ఆ ప్రయత్నం 8వందల ఏళ్ల క్రితమే ఆచరణలోకి తెచ్చిన ధీశాలి బసవేశ్వరుడు. క్రీ.శ. 1131లో కర్నాటక ప్రాంతంలో హింగుళేశ్వర భాగవాటి (బాగెవాడ)లో శివాచార పరాయణులైన దంపతులు మండెగ మాదిరాజు, మాదాంబ పుణ్య దంపతులకు జన్మించాడు బసవేశ్వరుడు. చిన్న వయసులో ఉపనయన సంస్కారం తిరస్కరించాడు. శివభక్తుడైనాడు. బసవన్న ఇల్లు విడిచి కూడల సంగం చేరుకున్నాడు.
ఆనాడు చాళుక్య చక్రవర్తి బిజ్జలుడు ఆ ప్రాంతపు రాజు. బసవణ్ణ సోదరి నాగలాంబిక, బావ శివస్వామి దంపతుల ఆదరణతో బసవణ్ణ చేస్తున్న సాధన, ప్రయత్నం, వీరశైవ మత ప్రచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. గంగాంబికతో ఆయన వివాహం జరిగింది. పెళ్లి అయ్యాక బసవణ్ణ మంగళవాడలో వీరశైవ మత ప్రచారం చేస్తున్నాడు. ఆ తర్వాత చాళుక్య చక్రవర్తి కొలువులో అనేక బాధ్యతలు
నిర్వర్తించిన బసవేశ్వరుడు సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి, మతాన్ని సామాజిక రుగ్మతలపై అస్త్రంగా ప్రయోగించాడు.
అగ్రగణ్యుడు
హిందూ సమాజంలో పుట్టిన సంస్కర్తల్లో బసవేశ్వరుడు అగ్రగణ్యుడు. బసవేశ్వరుడు చేసిన కులనిర్మూలనవల్ల అస్పృశ్యత నిర్మూలనకు పునాది పడింది. శారీరక శ్రమ లేకుండా భుజించే అర్హత లేదన్నాడు. ఆధునికులు ఈరోజు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఆయన డివినిటీ ఆఫ్ లేబర్ అన్నాడు. శ్రమకు దివ్యత్వాన్ని కల్పించాడు. నిరుద్యోగం, దారిద్య్రం, కాయకష్టం వల్ల తొలగిపోయి వృత్తిగౌరవం పెరుగుతుందన్నాడు. దోచుకున్నవాడు మాత్రమే కాదు దాచుకున్నవాడు కూడా దొంగనే అని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఓ దురాశ దుఃఖం కలిగిస్తుంది. ధనం, మోసం, సంసారం, ఆశ, ఇవన్నీ పాశాలని బసవేశ్వరుడు చెప్పాడు.
సామాజిక పోరాటం
సమాజంలో జరుగుతున్న అనేక హింసలను బసవేశ్వరుడు నిరసించాడు. మనుషులనే కాదు పశువుల బలికి కూడా ఆయన ఒప్పుకోలేదు. అరిషడ్వర్గాల ద్వారా కలిగే ప్రవృత్తులను వదలి అంతఃకరణశుద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆనాడు ప్రజల్లో వేళ్లూనుకున్న వర్గభేదాలు, అజ్ఞానం, అంధ విశ్వాసాలపై యుద్ధం ప్రకటించిన బసవేశ్వరుడు పూర్తిగా సఫలీకృతుడయ్యాడు.
స్త్రీల ఉద్ధరణ, కులతత్వ నిర్మూలన, నిమ్నకులాల్లో ఆత్మన్యూనత పోగొట్టి ఆత్మవికాసం కల్పించాడు. వారిని తన అనుయాయులుగా మార్చుకుని అందరినీ ఒకచోట చేర్చి వారిలో కొత్త అనుభవాలను నిలిపేందుకు, వారి అనుభవాలను పంచుకునేందుకు 'అనుభవమంటపం' స్థాపించిన అసమాన ధీరుడు బసవేశ్వరుడు. తాను బ్రాహ్మణ కులంలో జన్మించినా పూర్వాచారాలను కొన్నింటిని తిరస్కరించి సనాతన ధర్మంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు.
పుట్టుకతో కుల నిర్ణయం ఓ పాపం
పుట్టుకతో కులం నిర్ణయించడం పాపం. ప్రతి మనిషి వాళ్లు చేసే మంచి పనుల వల్ల, సక్రియల వల్ల యోగ్యత నిర్ణయించబడుతుంది. వాళ్ల వృత్తిని బట్టి అతని కులం నిర్ణయించటం దురదృష్టం అంటాడు బసవన్న. అస్పృశ్యుడని పిలువబడిన శివనాగుమయ్యతో కలిసి గుఱ్ఱం ఎక్కి తిరిగాడు. అంతేకాకుండా అగ్రకులస్తుడైన మధువరసు కుమార్తె లావణ్యవతిని, అంత్యకులస్తుడైన శీలవంతుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
ఈ సంఘటనే బసవేశ్వరుని ప్రాణం మీదికి తెచ్చిందంటారు. అస్పృశ్యత మహాపాపంగా భావించిన బసవేశ్వరుడు తన 'అనుభవమంటపం'లో అన్ని కులాల వారికి స్థానం కల్పించాడు. తాను విప్లవాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వీరశైవ మతం స్వీకరించిన వారికి కులం లేదని ప్రకటించాడు బసవేశ్వరుడు.
12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు కులం, అస్పృశ్యత నివారణకు వెతికిన పరిష్కారం నేటి ఆధునిక యుగంలో ఆచరించలేకపోవడం దురదృష్టం. ఆచరణకు ముందడుగు వేయడం లేదు. మతాన్ని సామాజిక దృక్పథంతో నడిపించిన ఈ మహనీయుడు తాను మాత్రమే కాకుండా తన అనుయాయులనెందరినో ఆ మార్గంలో నడిపించిన భక్తశిఖామణి.
- డా. పి. భాస్కరయోగి,
సోషల్ ఎనలిస్ట్