విశ్లేషణ: దేశ చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్న బీజేపీ

‘‘అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది’’ 42 ఏండ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహారీ వాజ్ పేయీ అన్న మాటలు. సరిగ్గా ఆయన మాటలను నిజం చేస్తూ వచ్చింది నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం. ఈ ఇద్దరి నాయకత్వంలో  బీజేపీ దూసుకుపోతూ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూడటమే కాకుండా.. ఇండియా ఒక విలువైన భాగస్వామి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపుగా ప్రతి ఎన్నికల్లో ఓటమి ఎరుగని పార్టీగా విజయకేతనం ఎగురవేస్తోంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో సొంతంగా మెజార్టీ సాధించడమే కమలం వికసిస్తుందన్న వాజ్ పేయీ మాటలకు నిదర్శనం.
భారతీయ జనతా పార్టీ1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి నేటికి 42 ఏండ్లు పూర్తి చేసుకుంది. బీజేపీ ఏర్పాటు అంతా సులభంగా ఏమి జరగలేదు. దేశంలోని ఆనాటి క్లిష్టమైన పరిస్థితుల్లోంచి ఎన్నో ఆటు పోట్లు, మరెన్నో ఇబ్బందుల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది. ప్రారంభంలోనే అప్పటి ప్రత్యర్థి నేతలు బురదలో పుట్టిన కమలం అంటూ హేళన చేశారు. రాజకీయాలు అనే బురదలోంచి  స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని బీజేపీ నేతలు దీటుగా సమాధానం ఇచ్చారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి, ప్రజల ముందుకు వచ్చిన బీజేపీ ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు.

జనసంఘ్ నుంచి జనతా పార్టీ వరకు..

దేశ విభజన, భారత స్వాతంత్ర్యం పొందిన నాటి కాలంలో ఆసియా-,యూరప్ ఖండాల్లో కమ్యూనిస్ట్ రాజకీయ ప్రయోగం జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఆలోచనల్లో మునిగిపోయి సెక్యులరిజం అనే ముసుగు తొడుక్కొని కుటుంబ పార్టీగా మారిపోయింది. దాని పునాదుల నుంచి అనేక కుల, కుటుంబ, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయ పార్టీ అవసరమని అప్పటి పరిస్థితుల ప్రభావంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భావించారు. 1952వ సంవత్సరంలో ముఖర్జీ సారథ్యంలో జనసంఘ్‌‌ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ద్వారా ప్రభావితులైన జాతీయ వాదులంతా జనసంఘ్ లో చేరారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జనసంఘ్ 3 సీట్లు సాధించింది. ఇక 1971 ఎన్నికల నాటికి 22 లోక్ సభ సీట్లతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయ పార్టీగా ఎదిగింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రతి పక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. జనతా పార్టీ 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. జనతా పార్టీ తరుఫున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే పార్టీలోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. జనతా పార్టీలోని ఇతర నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జన సంఘీయులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులందరూ కలిసి జనతా పార్టీని వీడి కొత్త పార్టీని ప్రారంభించారు. అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది. 

అటల్– అద్వానీ శకం

అప్పట్లో దేశమంతా ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే అంతగా భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ ముంచెత్తింది. ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన 1984 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయినా అధైర్య పడకుండా అటల్ బిహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ అద్వానీ పార్టీని ముందుకు నడిపించారు. అలాంటి కీలక సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రామ మందిరం నిర్మాణం యావత్ హిందూ ప్రజల సంకల్పంగా మార్చడంలో విజయం సాధించింది. ఆ తర్వాత రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా 85 సీట్లు సాధించింది. నేషనల్ ఫ్రంట్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు జరిగినా.. మళ్లీ జనతా ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వం పతనమైంది. ఇక1991లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని అంతా భావించారు. కానీ తొలి విడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణించడంతో ఆ తర్వాత జరిగిన పోలింగ్ లో సానుభూతి ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ120 సీట్లలో విజయం సాధించింది.

అయిదేండ్లు అధికారంలో..

1996 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లలో గెలుపొందినా కనీస మెజారిటీ రాలేదు. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రను తిరగరాసింది. బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న రోజులవి. లోక్ సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో అటల్ జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ అత్యంత ఘోరంగా విఫలమైంది.1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ.. జాతీయ ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఏన్డీఏలో భాగ స్వామిగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ అర్థంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయింది.1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. మళ్లీ అటల్ బిహారీ వాజ్ పేయీ నేతృత్వంలో ఐదేండ్లు విజయవంతంగా ఏన్డీఏ ప్రభుత్వం దేశంలో సంస్కరణలతో పలు విజయాలు సాధించింది. కానీ మితిమీరిన అంచనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. తర్వాత పదేండ్ల పాటు అధికారానికి దూరమైంది. 

మోడీ–షాల తంత్రం

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర దామోదర్ మోడీ.. వరుసగా మూడు సార్లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. 13 ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. దీంతో బీజేపీ ఫ్యూచర్ నేతగా ఎదుగుతూ వచ్చారు. 2013లో ప్రధాన మంత్రి క్యాండిడేట్ గా వెలుగులోకి వచ్చారు. 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారు. గుజరాత్ సీఎంగా మోడీ చరిష్మా జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. దాంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 281 స్థానాలతో బీజేపీ చరిత్ర సృష్టించింది. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొదటి దశలో అవినీతి రహిత, పారదర్శకవంతమైన పాలనను అందించడంతో ప్రజల్లో చరిష్మాను మోడీ అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అదే ఊపుతో 2019 ఎన్నికల్లోనూ బీజేపీ 303 సీట్లను సొంతంగా గెలుపొందింది. దాంతో రెండో సారి కూడా ప్రధాన మంత్రిగా మోడీ దూకుడును ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. బీజేపీ చిరకాల వాంఛ అయిన ఆర్టికల్ 370 రద్దును విజయవంతంగా పూర్తి చేశారు. కశ్మీర్‌‌ను రెండు భాగాలుగా విభజించి భారత్‌‌లో అంతర్భాగమని చాటారు. రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు ఆమోదం పొంది.. అయోధ్యలో మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చివరిది ఉమ్మడి పౌరస్మృతి పూర్తిగా తేలేకపోయినా.. ముస్లిం మహిళలకు శాపంగా మారి వారి జీవితాలను కష్టాలపాలు చేసిన ట్రిపుల్ తలాక్‌‌ను రద్దు చేసి వారి జీవి తాల్లో వెలుగులు నింపింది.

దక్షిణాదిపై దృష్టి...

1980 నుంచి 2004 వరకు బీజేపీ ప్రస్తానం అటల్, అద్వానీ ఆధ్వరంలో నడిచింది. తొలి 24 సంవత్సరాల పాటు బీజేపీ అంటే వాజ్ పేయీ.. అద్వానీ అన్నట్లు సాగింది. 2004 తర్వాత బీజేపీ కొంత నెమ్మదించినట్లు కనపడింది. 2009లో ఓటమి పాలైన తర్వాత పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంది. సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు తప్పుకోవడంతో పార్టీలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2009లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2013 వరకు కొనసాగారు. ఆ తర్వాత యూపీకి చెందిన రాజ్ నాథ్ సింగ్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. 2014లో రాజ్ నాథ్ సింగ్ సారథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వెళ్లడంతో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 272 మ్యాజిక్ ఫిగర్ కాగా బీజేపీ సొంతంగా 281 స్థానాలను కైవసం చేసుకుంది. మోడీ ప్రభుత్వంలో రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా నియమితులయ్యారు. షా ఆధ్వర్యంలోనే పార్టీ 2019 ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని తిరిగి సొంతం చేసుకుంది. రెండో సారి ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అప్పటి వరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జేపీ నడ్డాకు 2020లో ఆ బాధ్యతలు అప్పగించారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను నడ్డా ముందుండి నడిపించారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన యూపీలో మరో సారి పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం బీజేపీ దక్షిణాదిన కర్నాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయం దిశగా ముందుకు సాగుతోంది.
-  నూనె బాల్ రాజ్, 
తెలంగాణ కోఆర్డినేటర్, 
బీజేపీ సెంట్రల్ ఆఫీస్, ఢిల్లీ​