- హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా
- రాష్ట్రంలో ఎన్డీయే పక్ష నేతగా బాబు ఏకగ్రీవ ఎన్నిక
- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
- టీడీపీకి 19, జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే చాన్స్
- జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి?
హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గరున్న ఐటీ పార్క్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలు రాష్ర్టాల సీఎంలు, సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ నటుడు చిరంజీవి తదితరులు హాజరుకానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు చంద్రబాబు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్, పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. విందు అనంతరం అమిత్ షా నోవాటెల్ హోటల్ లో బస చేశారు. మరోవైపు ప్రధాని మోదీ టూర్ కూడా ఖరారైంది. ఆయన బుధవారం ఉదయం 8:20 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 10:40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రమాణస్వీకార వేదిక వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటారు. అనంతరం తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని ఒడిశా సీఎం ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తారు. కాగా, చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వివిధ జిల్లాల నుంచి లక్ష మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో10వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జనసేన ఫ్లోర్ లీడర్‌గా పవన్..
రాష్ట్రంలో ఎన్డీయే పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మీటింగ్ జరిగింది. ఇందులో జనసేన చీఫ్, ఎమ్మెల్యే పవన్ కల్యాణ్, రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటు పురందేశ్వరి పాల్గొన్నారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును పార్టీ సీనియర్ నేత అచ్చెంనాయుడు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
అలాగే జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కాగా, ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్న కూటమి నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి లేఖ అందజేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అనుమతిస్తూ గవర్నర్ స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు.
కేబినెట్లో మూడు పార్టీలు..
ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబుతో పాటు మరో 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఇందులో టీడీపీకి 19, జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు హోం లేదా మరో కీలక శాఖ ఇవ్వనున్నట్టు సమాచారం. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణతో పాటు మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు లభించనుంది. ఇక టీడీపీలో మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, ఉమ్మడి జిల్లాల వారీగా బెర్తులు కేటాయించనున్నారు. స్పీకర్ పదవికి సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయన్నపాత్రుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది.
జగన్‌కు చంద్రబాబు ఫోన్..
ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయగా, ఆయన లిఫ్ట్ చేయలేదని సమాచారం. ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం: పవన్
ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. అందరం కలిసి రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబసభ్యులు ఎంతో బాధలో ఉన్నారు. ఫ్యామిలీని దూషించినపుడు భువనేశ్వరి బాధను చూశాను. మంచి రోజులు వస్తాయని, బాధపడొద్దని ధైర్యం చెప్పాను. మంచి పాలన అందించాలని చంద్రబాబును కోరుతున్నాను” అని అన్నారు.
అమరావతే రాజధాని: చంద్రబాబు
అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని ఎన్డీయే పక్ష నేత చంద్రబాబు తెలిపారు. విశాఖను ఫైనాన్సియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్డీయే కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ కూటమి ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు. రాష్ర్టాన్ని కాపాడుకోవాలని ప్రజలు నిర్ణయించి కూటమిని గెలిపించారు. ప్రజల తీర్పుతో రాష్ర్ట ప్రతిష్ట పెరిగింది. ఢిల్లీలో అందరూ గౌరవిస్తున్నారు.
పవన్ సమయస్ఫూర్తిని మనం గౌరవించాలి. నేను జైలులో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి పొత్తులో కీలక పాత్ర పోషించారు. రాష్ర్ట అభివృద్ధికి సహకారం అందిస్తామని కేంద్ర పెద్దలు మాటిచ్చారు” అని చంద్రబాబు చెప్పారు. ‘‘నా కుటుంబానికి అవమానం జరిగింది. ఇది కౌరవ సభ అని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాను. మళ్లీ గెలిచి వస్తానని ఆ రోజు చెప్పాను” అని గుర్తు చేశారు.