అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్

  • అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్. 

ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నది.1908 ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్ బీహార్​లోని షాబాద్ జిల్లాలోని చిన్న గ్రామమైన చంద్వాలో వసంతాదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించారు. దళిత కులంలో పుట్టిన ఆయన పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చురుకైన విద్యార్థిగా రాణించారు. జగ్జీవన్ రామ్1922లో ఆరా పట్టణంలోని స్కూలులో చదువుతున్నప్పుడు కుండలో నీరు తాగడానికి వెళ్తే.. ఆధిపత్య కులాల విద్యార్థులు అడ్డుకున్నారు. అలా మొట్టమొదటి సారిగా ఆయన అవమానాన్ని ఎదుర్కొన్నారు.  దళితులకు పాఠశాలల్లో ప్రత్యేక మంచి నీటి కుండను ఏర్పాటు చేయడాన్ని సహించలేక అక్కడున్న అన్ని కుండలను పగలగొట్టి నిరసన తెలిపారు. వివక్షను ఎదుర్కొంటూనే ఫస్ట్​క్లాసులో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య కొనసాగించారు.1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీలో పట్టా తీసుకున్నారు. జగ్జీవన్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌ కలకత్తాకు వెళ్లిన ఆరునెలల్లోనే విల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌ స్క్వేర్‌‌‌‌‌‌‌‌లో ముప్పై వేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ తీసే స్థాయికి చేరుకున్నారు. దాంతో ఆయన సుభాష్ ​చంద్రబోస్‌‌‌‌‌‌‌‌, చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ ఆజాద్‌‌‌‌‌‌‌‌ వంటి చాలామంది జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించగలిగారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడిదారీ గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశారు. కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌పై ఇవి ఎంతగానో ప్రభావం చూపాయి. బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ వలసవాద సంకెళ్లు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని ఆయన విద్యార్థి దశలోనే భావించేవారు.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం
1934లో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్‌‌‌‌‌‌‌‌ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు’ అయిన ‘గురు రవిదాస్‌‌‌‌‌‌‌‌’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్‌‌‌‌‌‌‌‌ సమ్మేళనాలు చేపట్టారు. సాంఘిక సంస్కరణ కోసం వ్యవసాయ కార్మిక మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ మొదలైన సంఘాలను నెలకొల్పారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణల కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించిన గొప్ప మేధావి జగ్జీవన్​రామ్. బీహార్​లో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. ఈ సందర్భంలో మొదటిసారిగా గాంధీజీతో పరిచయం ఏర్పడింది.1935లో కాన్పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన డిప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌కు జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షత వహించారు. ఆరు సంవత్సరాలు పాటు అధ్యక్షుడిగా వ్యవహరించి దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కులు, అభివృద్ధి కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు.

పార్టీని స్థాపించి..
1969లో అధికార కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడయ్యారు.1977లో ఇందిరాగాంధీ నియంతృత్వ విధానంతో విభేదించి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి బయటకు వచ్చిన ఆయన ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌’ (కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ) అనే పార్టీని స్థాపించారు. తర్వాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేశారు. మొరార్జీ దేశాయ్‌‌‌‌‌‌‌‌ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో(1977) జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 1979 జనవరి 24న డిప్యూటీ ప్రధానమంత్రిగా జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు స్వీకరించారు. దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రిగా చేయడంలో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ కీలక పాత్ర పోషించారు. 1950లో సికింద్రాబాద్​కర్బలా మైదానంలో జరిగిన గొప్ప బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.1976లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ హరిజన మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్జీవన్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌ గొప్ప దార్శనికత, అనుభవం ఉన్న రచయిత. ఆయన హిందీ, ఇంగ్లీష్​లో రచనలు చేశారు. భారతదేశంలో కులం సవాళ్లు, జీవన సరళి వ్యక్తిత్వ వికాసం అనే రెండు పుస్తకాలు రాశారు. ఆయన గొప్ప సేవలకు గాను ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాలయం 1967లో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌కి ‘డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌’ అనే గౌరవ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ప్రదానం చేసింది.1968లో కాన్పూర్‌‌‌‌‌‌‌‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌తో సత్కరించింది. మూఢనమ్మకాలు, సామాజిక వివక్ష, అసమానతలు లేని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ దార్శనికతలో రూపుదిద్దుకున్నదే. 1986 జులై 6వ తేదీన బాబూజీ భౌతికంగా మనల్ని వీడారు. యావత్తు భారత జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోగల నాయకుడు, సామాజిక, రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఇప్పటికీ స్ఫూర్తి దాత. 

స్వాతంత్య్ర పోరాటంలో..
1936లో బీహార్‌‌‌‌‌‌‌‌ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై 28 ఏండ్ల వయసులో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ తన రాజకీయ జీవితం ప్రారంభించారు.1937 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డిప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ నుంచి14 రిజర్వుడ్ స్థానాలకు జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులను పోటీకి నిలిపారు. ఆ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా14 మంది అభ్యర్థులు గెలవడంతో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ ఒక రాజకీయ నిర్ణయాత్మకశక్తిగా, కింగ్‌‌‌‌‌‌‌‌మేకర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగారు. ఈ సమయంలోనే తమతో చేతులు కలపాల్సిందిగా ‘‘కాంగ్రెస్ పార్టీ” నుంచి జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌కు ఆహ్వానం అందింది.1942లో ఆయన బొంబాయిలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో చేరారు. అప్పుడే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ క్విట్‌‌‌‌‌‌‌‌ ఇండియా తీర్మానం చేసింది. ‘స్వాతంత్య్రమో లేక మరణమో!’, ‘సాధించు లేదా మరణించు!’ నినాదాలు దేశమంతటా వ్యాపించాయి. ఆలిండియా ‘డిప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌’ను కూడా బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో క్విట్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని పాట్నాలోని స్వగృహంలో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ అరెస్టు అయ్యారు.1943 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో బ్రిటీష్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ అణచివేతల్ని ఖండిస్తూ దేశ స్వాతంత్య్ర సాధన కోసం అనేక సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు.1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటీష్‌‌‌‌‌‌‌‌ వైస్రాయి ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ ఒకరు.1946 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌2న ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా, అణగారిన సామాజికవర్గాలకు ఏకైక ప్రతినిధిగా ఆయన నిలిచారు. మంత్రిమండలిలో పిన్న వయస్కుడైన జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ను అందరూ ‘బేబి మినిస్టర్‌‌‌‌‌‌‌‌’ అని పిలిచేవారు. 33 ఏండ్లకు పైగా కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రి గానూ డాక్టర్‌‌‌‌‌‌‌‌ బాబూ జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా ఆయన దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలికారు.

- ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్. శ్యామల కన్వీనర్, సావిత్రి- రమాబాయి మహారాణుల సంఘం