ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్లో తులం రేటు ఇది..

ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్లో తులం రేటు ఇది..

హైదరాబాద్: బంగారం ధరలు ఆల్ టైం రికార్డు ధరకు చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై బుధవారం 1040 రూపాయలు పెరిగింది. దీంతో.. రికార్డ్ స్థాయిలో బంగారం ధర 86,240 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా950 రూపాయలు పెరిగి 78,100 నుంచి 79,050 రూపాయలకు ఎగబాకింది. బంగారం ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే ఫిబ్రవరి నెలాఖరు నాటికే తులం బంగారం ధర 90 వేల మార్క్ను దాటిపోవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 గత పదిరోజుల్లో బంగారం ధర జనవరి 27, జనవరి 28, ఫిబ్రవరి 3న మాత్రమే తగ్గింది. మిగిలిన ఏడు రోజుల్లో ఫిబ్రవరి 2న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా కాకపోయినా బంగారం ధరలు ఆరు రోజులు అమాంతం పెరిగి ప్రస్తుతం పసిడిని అత్యంత ప్రియమైందిగా మార్చేశాయి.

జనవరి 27న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,250 రూపాయలు. ఫిబ్రవరి 5న 86,240 రూపాయలు. పది రోజుల్లో 3990 రూపాయలు పెరిగింది. ఈ లెక్కన ఫిబ్రవరి ముగిసే లోపు బంగారం ధర 90 వేల మార్క్ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో వెళుతుండటం గమనార్హం.

జనవరి 27న 22 క్యారెట్ల బంగారం ధర 75,400 రూపాయలు ఉండగా ఫిబ్రవరి 5న 79,050 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది రోజుల్లో 3650 రూపాయలు పెరిగింది. వెండి కూడా బంగారం పెరుతున్న తీరులో పెరుగుతుంది. ఫిబ్రవరి 4న కిలో వెండి ధర లక్షా 6వేలు ఉండగా, ఫిబ్రవరి 5న 1000 రూపాయలు పెరిగి లక్షా 7వేలు పలికింది.