బంగారం రేటు తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధరపై 440 రూపాయలు తగ్గింది. దీంతో.. ఆదివారం 84,490 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం రూ.84,050కి తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరపై 400 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 77,450 రూపాయల నుంచి 77,050కి తగ్గడంతో పసిడి ప్రియులకు కాస్తంత ఊరట లభించినట్టయింది. బంగారం ధర ఇవాళ(ఫిబ్రవరి 3, 2025) 440 రూపాయలు తగ్గినప్పటికీ గత పది రోజుల నుంచి చూసుకుంటే భారీగానే పెరిగింది.
పది రోజుల క్రితం.. అంటే జనవరి 25న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,420 రూపాయలు. ఫిబ్రవరి 3న అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,050 రూపాయలు. పది రోజుల్లో బంగారం ధర 1630 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే ఉంది. జనవరి 25న 7,5500 ఉండగా ఫిబ్రవరి 3న 77,050 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరపై గడచిన 10 రోజుల్లో 1,550 రూపాయలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. వెండి ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది.
భారత్లో బంగారం, వెండి ధరలు డాలర్తో రూపాయి విలువతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన బంగారం, వెండి ధరలు నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, బంగారానికి డిమాండ్‌లో, సరఫరాలో మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉంది.
మన దేశంలో బంగారానికి డిమాండ్ చాలానే ఉంటుంది. బంగారానికి సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో గోల్డ్ను భారీగా కొంటారు. చాలా మందికి బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా చూస్తారు. 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఇదే పోకడ కొనసాగితే 2025 డిసెంబర్ నాటికి లక్షకు చేరుకోవడం ఖాయమని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.