24 గంటల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర ఇంత పెరిగిందంటే.. తొందర్లోనే లక్షకు పోతుందేమో..!

24 గంటల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర ఇంత పెరిగిందంటే.. తొందర్లోనే లక్షకు పోతుందేమో..!

హైదరాబాద్: పసిడి ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో గట్టిగానే పలుకుతోంది. అక్టోబర్ 29న(మంగళవారం) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,450 రూపాయలు ఉండగా ఈ ధర అక్టోబర్ 30(బుధవారం) నాడు 81,160 రూపాయలకు పెరిగింది. 24 గంటల్లోనే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 710 రూపాయలు పెరిగిందంటే బంగారం ధరలు రాకెట్లా ఎలా దూసుకెళుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

22 క్యారెట్ల బంగారం ధరలు కూడా ఇలానే పెరిగాయి. 10 గ్రాములపై 650 రూపాయలు పెరిగింది. నిన్న (అక్టోబర్ 29, 2024) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 73,750 రూపాయలు ఉంటే.. ఇవాళ (అక్టోబర్ 30, 2024) 74,400 రూపాయలకు చేరింది. ఒక్కరోజులో 650 రూపాయల ధర పెరిగింది. బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతే.. లక్ష రూపాయల ధరను వీలైనంత తొందర్లోనే చేరుకునే అవకాశం లేకపోలేదు. బంగారం ధరలు ఇలా విపరీతంగా పెరుగుతుండటంతో ఈ ప్రభావం ధన త్రయోదశి కొనుగోళ్లపై కూడా పడింది.

Also Read : ధన్‌‌‌‌తేరాస్ ధమాకా .. ఈసారి రూ. 30వేల కోట్ల విలువైన అమ్మకాలకు చాన్స్​

ధనత్రయోదశి రోజు బంగారం దుకాణాలకు పసిడి ప్రియులు క్యూ కడతారు. కానీ, ఈసారి ధనత్రయోదశిని లైట్ తీసుకున్నారు.  గోల్డ్ ధరలు ఆల్ టైం రికార్డుకు  చేరడంతో బంగారం దుకాణాలన్నీ బోసిపోయి కనిపించాయి. అంతేకాకుండా ఈసారి ధన త్రయోదశి మంగళవారం వచ్చింది. మంగళవారం రోజు బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది వెనుకడుగు వేస్తారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం వరకు ధనత్రయోదశి ఉంటుందని, అప్పటికి అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ నిరాశే ఎదురైంది. 

మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం నాడు బంగారం ధరలు మరింత పెరిగి కొనుగోలుదారుల ఆసక్తిపై నీళ్లు చల్లాయి. హైదరాబాద్  మార్కెట్లో ధనత్రయోదశి  అమ్మకాలు 30 శాతం కూడా జరగలేదని వ్యాపారులు తెలిపారు. నిరుటితో  పోలిస్తే  ఈసారి బంగారం ధర రూ.15 వేలు పెరగడంతో అమ్మకాలు తగ్గి ఉండవచ్చని పేర్కొంటున్నారు. వెండి ధరల విషయానికొస్తే.. బంగారం మాత్రమే కాదు వెండి కూడా బానే రేటు పలుకుతోంది. బుధవారం నాడు కిలో వెండిపై ఏకంగా రూ.2,100 పెరిగి కిలో వెండి ధర లక్షా తొమ్మిది వేల రూపాయలకు చేరుకుంది. అక్టోబర్ 24, 25 తేదీల్లో వరుసగా రెండు రోజులు 2000, 3000 రూపాయలు తగ్గిన వెండి ధర మళ్లీ ఇవాళ(అక్టోబర్ 30, బుధవారం) భారీగా పెరిగింది.