కొండగట్టులో ఇవాళ హనుమాన్​ పెద్దజయంతి

కొండగట్టులో ఇవాళ హనుమాన్​ పెద్దజయంతి
  •     తరలివస్తున్న హనుమాన్‌‌‌‌‌‌‌‌ భక్తులు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ పరిసరాలు హనుమాన్‌‌‌‌‌‌‌‌ భక్తుల జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలతో మారుమోగాయి. హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు శుక్రవారం కొండగట్టుకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని మాలవిరమణ చేశారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  

ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు తెల్లవారుజాము నుంచి ఆలయం ముందున్న యాగశాలలో ఉత్సవ మూర్తులకు మహా నైవేద్యము, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం నవగ్రహా ఆరాధన, సుందరకాండ పారాయణం కార్యక్రమాలు చేపట్టారు.  సాయంత్రం కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతరాలయంలో స్వామివారికి అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 

గుట్టకు చేరుకున్న హనుమాన్ దీక్ష పరులు ఇరుముడితో స్వామిని దర్శించుకుని మాల విరమణ చేస్తున్నారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్లు సునీల్, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆలయలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టులో ఏర్పాట్లను జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాష సాయంత్రం పరిశీలించారు. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 
 

అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ 
 

జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కొండగట్టు అంజన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.