ఐపీఎల్ ప్రియులకు పండగే పండగ.. ఇవాళ (ఏప్రిల్ 27) రెండు బ్లాక్ బస్టర్ మ్యాచ్‎లు

ఐపీఎల్ ప్రియులకు పండగే పండగ.. ఇవాళ (ఏప్రిల్ 27) రెండు బ్లాక్ బస్టర్ మ్యాచ్‎లు

న్యూఢిల్లీ: ఈ సీజన్‌‌‌‌లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. చెరో ఆరు విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదివారం రాత్రి ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్‌‌‌‌లో జరిగే మ్యాచ్‌‌‌‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందంజ వేయనుంది. దాంతో ఈ సమ ఉజ్జీల సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పోరులో విరాట్ కోహ్లీ–కేఎల్ రాహుల్‌‌‌‌, మిచెల్ స్టార్క్– జోష్ హేజిల్‌‌‌‌వుడ్ మధ్య పోటీపై అందరి ఫోకస్ ఉండనుంది. 

తొమ్మిది మ్యాచ్‌‌‌‌ల్లో ఆరు విజయాలు సాధించిన ఆర్సీబీ అందులో ఐదు ప్రత్యర్థి వేదికల్లోనే అందుకుంది. సొంతగడ్డపై మూడు పరాజయాల తర్వాత గత పోరులో గెలిచి మరింత జోష్‌‌‌‌లోకి వచ్చింది. ఇక, ఐదు ఫిఫ్టీలు కొట్టిన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. పైగా, ఢిల్లీ తన స్వస్థలం. చిన్నప్పటి నుంచి ఆడిన కోట్లా గ్రౌండ్‌‌‌‌లో కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  

మరోవైపు డీసీ టీమ్‌‌‌‌ టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌ కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. ఢిల్లీ స్టార్ పేసర్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌, ఆర్సీబీ పేసర్ జోష్ హేజిల్‌‌‌‌వుడ్ పోరు కూడా ఆసక్తి రేపుతోంది. ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లు తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హేజిల్‌‌‌‌వుడ్ 16 వికెట్లతో టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్‌‌‌‌తో జరిగిన గత మ్యాచ్‌‌‌‌లో 19వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసి జట్టును గెలిపించాడు. 

మరోవైపు స్టార్క్‌‌‌‌ సైతం ఒకటి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఒంటి చేత్తో ఢిల్లీకి విజయం అందించాడు. స్పిన్‌‌‌‌ విభాగంలో ఇరు జట్లలో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఆర్సీబీలో  క్రునాల్ పాండ్యా, సుయాశ్‌‌‌‌ అద్భుతంగా రాణిస్తుండగా.. ఢిల్లీలో చైనామన్‌‌‌‌ కుల్దీప్ యాదవ్‌‌‌‌, కెప్టెన్ అక్షర్ పటేల్ ఆకట్టుకుంటున్నారు. మొత్తంగా అన్ని విభాగాల్లో సమతూకంలో ఉన్న ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగే అవకాశం కనిపిస్తోంది.

 ముంబై జోరు కొనసాగేనా..

ఆరంభంలో నిరాశ పరిచినా వరుసగా నాలుగు విజయాలతో స్పీడు పెంచిన ముంబై ఇండియన్స్‌‌‌‌ ఐదో విజయంపై కన్నేసింది. పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌తో ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో తలపడనున్న ఆ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వరుసగా రెండు ఫిఫ్టీలతో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్ శర్మ ఫామ్‌‌‌‌లోకి రావడంతో ముంబై బలం అమాంతం పెరిగింది. 

బ్యాటింగ్‌‌‌‌లో సూర్యకుమార్, విల్ జాక్స్‌‌‌‌ కూడా జోరు మీదుండగా.. బౌలింగ్‌‌‌‌లో బౌల్ట్‌‌‌‌, బుమ్రా, హార్దిక్, కర్ణ్‌‌‌‌ శర్మ, అశ్వనీ కుమార్ అదరగొడుతున్నారు. మరోవైపు లక్నో జట్టులో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌, మిచెల్ మార్ష్‌‌‌‌ బ్యాట్‌‌‌‌తో మెప్పిస్తుండగా.. బౌలింగ్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌, అవేశ్ ఖాన్‌‌‌‌, దిగ్వేష్ రాఠీ రాణిస్తున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌‌‌‌లో అయినా తన ఫామ్‌‌‌‌ అందుకుంటాడేమో చూడాలి..