- ఫేవరెట్‌గా రోహిత్‌సేన
- రా. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్
న్యూయార్క్: టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్ టీమ్ టీమిండియా కప్పు వేటను ప్రారంభించనుంది. రెండోసారి ట్రోఫీ నెగ్గడమే టార్గెట్‌గా బరిలో నిలిచిన ఇండియా బుధవారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో చిన్న జట్టే అయినా సంచలనాలకు మారుపేరైన ఐర్లాండ్‌తో పోటీ పడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు.. యశస్వి జైస్వాల్, పంత్, శివం దూబే లాంటి యంగ్‌స్టర్లతో సమతూకంలో ఉన్న ఇండియానే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కానీ, తొలి ఎడిషన్‌లో కప్పు నెగ్గిన తర్వాత ప్రతీ టోర్నీలో ఫేవరెట్ ట్యాగ్‌కు మన జట్టు న్యాయం చేయలేకపోతోంది.
మరోవైపు 2022 టోర్నీలో వెస్టిండీస్‌ను, గత వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఐరిష్ టీమ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానకి లేదు. పైగా డ్రాప్ ఇన్ వికెట్‌పై ఎలాంటి కాంబినేషన్‌తో వెళ్లాలనే దానిపై రోహిత్‌సేన కన్‌ఫ్యూజన్‌లో ఉంది. గత రెండు నెలల్లో ఐపీఎల్‌లో పరుగుల మోత మోతగా.. ఈ టోర్నీలో రన్స్ రావడం కష్టం అవుతోంది. ఇదే వేదికపై సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 77 రన్స్‌కే కుప్పకూలగా.. ఆ టార్గెట్ ఛేజ్ చేసేందుకు సఫారీ టీమ్ సైతం కష్టపడింది. ఈ నేపథ్యంలో వికెట్‌ను సరిగ్గా అంచనా వేస్తూ.. సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగడంపై టీమిండియా ఫోకస్ పెట్టనుంది. ఆదివారం పాకిస్తాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పర్ఫెక్ట్ కాంబినేషన్‌తో, పక్కా ఆటతో ఐర్లాండ్‌ను ఓడించి దాయాదితో సమరానికి సిద్ధం కావాలని చూస్తోంది.
ఓపెనర్‌గా విరాట్!
ఈ వరల్డ్ కప్ ఇండియా టీమ్‌తో పాటు వ్యక్తిగతగా స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీకి కీలకం కానుంది. పుష్కరకాలంగా అద్భుతంగా ఆడుతూ వరల్డ్ బెస్ట్ బ్యాటర్లు, కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్నప్పటికీ 2011 వరల్డ్ కప్ తర్వాత వీళ్లు మరో ఐసీసీ కప్పు నెగ్గలేదు. గతేడాది సొంతగడ్డపై వన్డే కప్పు గెలుస్తారని ఆశించినా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అభిమానులతో పాటు ఈ ఇద్దరినీ తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. వయసు దృష్ట్యా ఇద్దరికీ ఇదే టీ20 వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరే ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ ఓపెనర్‌గా అదరగొట్టిన కోహ్లీ ఫుల్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్ బెంచ్‌పై కూర్చోవచ్చు. కోహ్లీ ఓపెనర్‌గా వస్తే అదనపు బ్యాటర్‌గా హిట్టర్, ఆల్‌రౌండర్ దూబేకు తుది జట్టులో స్థానం ఇచ్చే సౌలభ్యం కలుగుతుంది.
ఓపెనర్లుగా విరాట్, రోహిత్ హిట్ అయితే జట్టుకు తిరుగుండదు. ఒకవేళ సరైన ఆరంభం లభించకపోతే పంత్, సూర్యకుమార్‌తో పాటు ఆల్‌రౌండర్లు దూబే, హార్దిక్, జడేజా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బంగ్లాతో వామప్ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన పంత్‌తో పాటు హార్దిక్ మెరుపులు మెరిపించి టచ్‌లోకి వచ్చాడు. పాండ్యా బౌలింగ్‌లోనూ రాణించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. పాండ్యాతో పాటు దూబే కూడా ఎక్స్‌ట్రా పేసర్‌గా పని కొస్తాడు కాబట్టి ఇండియా ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగొచ్చు. బుమ్రా పేస్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనుండగా.. రెండో పేసర్‌గా సిరాజ్ కంటే అర్ష్‌దీప్‌కే మొగ్గు కనిపిస్తోంది. మెయిన్ స్పిన్నర్ గా చైనామెన్ కుల్దీప్ యాదవ్‌కు తోడు స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటే ఎనిమిదో నంబర్ వరకూ
బ్యాటింగ్ బలంగా ఉండనుంది.
చిన్న జట్టే అయినా..
పేపర్‌పై చూస్తే ఐర్లాండ్ టీమ్ ఇండియాను వణికించేలా లేదు. ఇండియా ప్లేయర్ల ఎక్స్‌పీరియన్స్, టాలెంట్‌కు ఆ టీమ్ దరిదాపుల్లో కూడా లేదు. ఇండియాతో ఇదివరకు ఆడిన ఏడు టీ20ల్లోనూ ఓడింది. కానీ, అప్పడప్పుడు ఆ జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్‌ను ఓడించి ఔరా అనిపించింది. పైగా మ్యాచ్ జరిగే నసావు కౌంటీ క్రికెట్‌లో డ్రాప్ ఇన్ పిచ్‌లు అనూహ్యంగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ పోరు ఏకపక్షం అయ్యేలా లేదు. వికెట్, పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని పాల్ స్టిర్లింగ్ కెప్టెన్సీలోని ఐరిష్ టీమ్ ఆశిస్తోంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన జోష్ లిటిల్‌కు ఇండియా ప్లేయర్ల ఆటపై అవగాహన ఉంది. అతనితో పాటు బల్బిర్నే, స్టిర్లింగ్, టెక్టర్ ఐరిష్ టీమ్‌లో కీలకం కానున్నారు. వీళ్లను అడ్డుకుంటే ఇండియా విజయం పెద్ద కష్టమేం కాబోదు.
ఐర్లాండ్‌తో ఇప్పటిదాకా ఆడిన ఏడు టీ20 మ్యాచ్‌ల్లో ఇండియా విజయం సాధించింది. 2019 టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఐర్లాండ్: ఆండీ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, డెలానీ, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, క్రెయిగ్ యంగ్/బెన్ వైట్, జోష్ లిటిల్.