- 2022 సెమీస్ ఓటమికి ప్రతీకారంపై గురి
- ఆటకు వాన ముప్పు
జార్జ్‌టౌన్ (గయానా) : తొలి రెండు రౌండ్లలో అజేయంగా నిలిచిన టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో అసలైన పరీక్షకు సిద్ధమైంది. పుష్కర కాలంగా ఊరిస్తున్న వరల్డ్ కప్‌ను అందుకునేందుకు 2 అడుగుల దూరంలో నిలిచిన ఇండియా తమను వెంటాడుతున్న నాకౌట్ భయాన్ని వీడి టీ20 కప్ ఫైనల్లో అడుగు పెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఇందులో గెలిచి 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో తమను ఓడించిన ఇంగ్లిష్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. ఇంకోవైపు తమ మార్కు దూకుడును కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకునేందుకు చేరువ కావాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య థ్రిల్లింగ్ ఫైట్‌ను ఆశించొచ్చు. కానీ, మ్యాచ్‌కు వాన ముప్పు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
జోరు సాగాలె
సూపర్8 రౌండ్‌లో ఇండియా హ్యాట్రిక్ విక్టరీలతో సత్తా చాటింది. చివరి మ్యాచ్‌కు వచ్చే సరికి అన్ని విభాగాల్లో జట్టు బలంగా మారింది. అయితే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఉండే విపరీతమైన ఒత్తిడి అనవసర తప్పిదాలు చేసేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌సేన ఒత్తిడిని తట్టుకుంటూనే చిన్న తప్పిదానికి తావివ్వకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నీలో తన స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ చేయని ఓపెనర్ కోహ్లీ కీలక పోరులో అయినా బ్యాట్ ఝుళిపిస్తాడేమో చూడాలి. కంగారూలపై చేసిన పెర్ఫామెన్స్‌ను కెప్టెన్ రోహిత్ ఇంగ్లండ్‌పై రిపీట్ చేస్తే జట్టుకు తిరుగే ఉండదు.
ఈ ఫార్మాట్‌లో నిర్భయమైన ఆట ఎలా ఆడాలో హిట్‌మ్యాన్ ఓ బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. ఏజ్ దృష్ట్యా తమకిదే చివరి టీ20 వరల్డ్ కప్ కావడంతో కోహ్లీ, రోహిత్ తమ మార్కు చూపెట్టాలని ఆశిస్తున్నారు. హిట్‌మ్యాన్ చూపెడుతున్న దారిలో రిషబ్ పంత్, సూర్య కుమార్ తలో చేయి వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మిడిలార్డర్‌లో ఇప్పటి వరకు అంచనాలను అందుకోలేకపోయిన శివం దూబే.. ఇంగ్లండ్ టాప్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ మెరుపు ఈ టోర్నీలో ఇండియాకు అది పెద్ద బలం అవ్వగా..
పేస్ లీడర్ బుమ్రా బంతికి తిరుగేలేకుండా పోయింది. సూపర్8లో ఇండియా ట్రంప్ కార్డ్‌గా పని చేసిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. కాగా, ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్, బెయిర్‌స్టోను సమర్థవంతంగా నిలువరించగలడు. ఈ నేపథ్యంలో చహల్‌ను తుది జట్టులోకి తీసుకోస్తారేమో చూడాలి.
బట్లర్‌సేనతో అంత ఈజీ కాదు
ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రయాణం సాఫీగా సాగలేదు. పెద్ద జట్ల చేతిలో దెబ్బతిన్న బట్లర్ సేన పడుతూ లేస్తూ సెమీస్‌కు వచ్చింది. తొలి రౌండ్‌లో ఆసీస్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ నెట్ రన్ ఆధారంగా ముందుకొచ్చింది. సూపర్8లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆ జట్టు.. తమ చివరి మ్యాచ్‌లో అమెరికాపై ఘన విజయంతో నాకౌట్ చేరింది. ఆ పోరులో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి గాడిలో పడ్డాడు. అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ ఫిల్ సాల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో సాల్ట్ క్షణాల్లో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు. ఈనేపథ్యంలో ఓపెనర్లిద్దరినీ ఇండియా బౌలర్లు త్వరగా పెవిలియన్ చేర్చాల్సిన అవసరం ఉంది.
బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్ రూపంలో పవర్ హిట్టర్లు ఇంగ్లండ్ సొంతం. లివింగ్‌స్టోన్, అలీ, కరన్ బౌలింగ్‌లోనూ మెప్పించగలరు. అయితే, ప్రధాన స్పిన్నర్ ఆదిల్ రషీద్ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడిని మిడిల్ ఓవర్లలో జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అంతకంటే ముందు కొత్త బాల్‌తో జోఫ్రా ఆర్చర్, టాప్లీ సవాల్‌ను తిప్పికొట్టే బాధ్యతను ఓపెనర్లు రోహిత్, కోహ్లీ తీసుకోవాలి.
మ్యాచ్ రద్దయితే మనోళ్లే ఫైనల్‌కు
ఈ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. గురువారం వర్షం కురిసే అవకాశం 88 శాతం ఉంది. ఈ పోరుకు రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే సూపర్8లో ఎక్కువ పాయింట్లతో నిలిచిన ఇండియా ఫైనల్ చేరుతుంది.
జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్ (కీపర్), సూర్యకుమార్, శివం దూబే, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్‌దీప్, బుమ్రా.
ఇంగ్లండ్ : బట్లర్ (కెప్టెన్, కీపర్ ), ఫిల్ సాల్ట్, బెయిర్‌స్టో, బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, టాప్లీ, ఆదిల్.