- సన్ రైజ్ అయ్యేనా?
హైదరాబాద్: ఐపీఎల్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు రెడీ అయ్యింది. సొంత గడ్డపై శుక్రవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్ రైజర్స్.. తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై రికార్డు స్థాయి పెర్ఫామెన్స్ చూపెట్టింది. కానీ మూడో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో కంగుతిన్నది. దీంతో నిలకడలేమి ఆటతీరుకు మారుపేరుగా మారింది.
ముంబైతో జరిగిన మ్యాచ్ మయాంక్ అగర్వాల్‌ను మినహాయిస్తే మిగతా బ్యాటర్లలో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో మయాంక్ బ్యాట్ ఝుళిపించకపోతే తర్వాతి పోరుకు ఉండటం కష్టమే. క్లాసెన్, మార్‌క్రమ్, హెడ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే బౌలింగ్‌లో భువనేశ్వర్, కమిన్స్ గాడిలో పడాలి. ఇక వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఢిల్లీ చేతిలో ఓడిన సీఎస్కే కూడా విజయంతో మళ్లీ గాడిలో పడాలని చూస్తోంది. కాకపోతే పేసర్ ముస్తాఫిజుర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం ఒక్కటే వాళ్లకు ఆందోళన కలిగించే అంశం. మిగతా టీమ్ మొత్తం సూపర్ ఫామ్‌లో ఉంది. లాస్ట్ మ్యాచ్‌లో ఓడినా ధోనీ బ్యాటింగ్ ఫైర్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.