అణగారిన వర్గాల గొంతుక బాబూ జగ్జీవన్ రామ్

అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్. ఆయన చేసిన పోరాటాలు ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. అందరితోనూ ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు.. చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ.. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ పుట్టారు. ఆయన తండ్రి శోబీరామ్, తల్లి వసంతిదేవి. బీహార్‌‌‌‌లోని షాహాబాద్(ఇప్పుడు భోజ్‌‌‌‌పూర్) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్ లాల్ తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. శోబీరామ్ మొదట బ్రిటీష్ సైన్యంలో ఉద్యోగం పొందినా వలస పాలకుల విధానాలు నచ్చక ఉద్యోగానికి స్వస్తి పలికి.. సొంత గ్రామమైన చాంద్వాలో తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ నమ్మిన సిద్ధాంతాల ప్రకారం తన కొడుకులను ఆయన తీర్చిదిద్దారు. మానవతావాదం, ఆదర్శవాదం మొదలైన విలువలను జగ్జీవన్ రామ్ తండ్రి నుంచే నేర్చుకున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన జగ్జీవన్​ రామ్​ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తల్లి వసంతి దేవి వాటన్నింటినీ ఎదుర్కొంటూ జగ్జీవన్ రామ్ చదువుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో జగ్జీవన్​రామ్​కు కుల వివక్ష, సామాజిక అసమానతలకు సంబంధించిన ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వాటికి వ్యతిరేకంగా చిన్నప్పటి నుంచి ఆయన పోరాటం చేయడం మొదలుపెట్టారు.
గాంధీ మార్గంలో..
జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. సామాజిక న్యాయం సాధించాలంటే ముందుగా కుల వివక్షకు అడ్డుకట్టవేయాలని ఆయన నమ్మేవారు. దళితులకు తగినంత రాజకీయ ప్రాతినిధ్యం సాధించినట్లయితే సమాజంలో అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కుతుందని ప్రగాఢంగా విశ్వసించారు. అలాగే దళితులకు ఓటు హక్కు కోసం కూడా గొంతెత్తారు. 
ఆదర్శప్రాయమైన ప్రజా జీవితం
బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనే వారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు. 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. బ్రిటిష్​ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్ట్​అయ్యారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్​లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అనుబంధ సభ్యునిగా, 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ప్రతినిధిగా కూడా పనిచేశాడు. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం సక్సెస్​ చేయడంలో జగ్జీవన్​ రామ్​ కీలకపాత్ర పోషించారు. అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్(ఇందిరా) పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకుపైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్​ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు  సృష్టించారు.

అంటరానితనానికి వ్యతిరేకంగా, సామాజిక సమనాత్వానికి మద్దతుగా ఆయన ఎంతో పోరాడారు. తాను చెప్పిన ఆదర్శాలను తు.చ.తప్పకుండా పాటించి.. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి కోసం శ్రమించారు. అతి పిన్న వయసులో మంత్రిగా, అతి ఎక్కువ కాలం చట్టసభ సభ్యునిగా, అతి ఎక్కువ శాఖల బాధ్యతలు చేపట్టిన మంత్రిగా అరుదైన రికార్డులు ఆయన సొంతం. బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతిని యావత్​దేశం ‘సమతా దివాస్’గా జరుపుకుంటోంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘనమైన నివాళి.

అంటరానితనంపై అలుపెరుగని పోరాటం


చిన్నతనం నుంచి తనకు ఎదురైన అంటరానితనం, కుల వివక్ష, సామాజిక అసమానతపై నిరసన గళాన్ని వినిపిస్తూ వచ్చారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటాలు చేశారు. అణగారిన వర్గాల్లో సమానత్వాన్ని ప్రోత్సహించాలనే తపనకు ఆజ్యం పోశాయి. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలను ఏకీకృతం చేయడానికి, కలకత్తా యూనివర్సిటీలో అసమానతలు, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. 1928లో మజ్దూర్ ర్యాలీలో జగ్జీవన్ రామ్‌‌‌‌ నేతాజీ సుభాష్​​ చంద్రబోస్ దృష్టిలో పడ్డారు. దళిత హక్కుల కోసమే కాదు.. మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనే వారు. తాను పాల్గొనడమే కాక అందరినీ చైతన్యపరిచే వారు. 1934లో భారీ భూకంపానికి బీహార్ అతలాకుతలమైతే సామాజికంగా సేవలందించి ఆర్తులను ఆదుకున్నారు. - వాణి సక్కుబాయి, సోషల్​ ఎనలిస్ట్​