బాబా సాహెబ్​ ఆశయ సాధనలో ముందున్న తెలంగాణ : గుండగాని కిరణ్ గౌడ్

అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి నేడు. ఈ సందర్భంగా భావి తరాలకు దిశా నిర్దేశం చేసేలా, ఆ మహనీయుడి ఆశయాలు అనునిత్యం స్ఫురించేలా అంబేడ్కర్125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నూతన సచివాలయానికి అత్యంత సమీపాన ఏర్పాటు చేయడం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం. అంబేద్కర్ చూపిన మార్గం అనుసరణీయం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో అమలు అవుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆయువు పోసింది అంబేద్కర్​ఆలోచనలే. తెలంగాణలో దళిత సాధికారత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి స్ఫూర్తి ఆ మహనీయుడి ఆశయాలే. అంబేద్కర్ అంటే అన్ని రాజకీయ పక్షాలకు ఎన్నిక వేళ అవసరమయ్యే నినాదం కావొచ్చు. కానీ ఆయన అందరివాడని, ఆయన మన భవిష్యత్తు అని గుర్తెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. అంబేద్కర్ ఆలోచన రూపానికి ప్రతిరూపంగా తెలంగాణలో దళిత, బహుజనుల అభివృద్ధి జరుగుతోంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రూపకల్పనకు కారకుడు అంబేద్కర్. దేశంలో అనేక సామాజిక 
రుగ్మతలకు మహిళల వెనుకబాటుతనమే కారణమని నమ్మిన అంబేద్కర్ రాజ్యాంగంలో వారికి సమున్నత స్థానాన్ని కల్పించాడు. ఆ మేరకు తెలంగాణలో మహిళలకు సముచిత స్థానం దక్కుతున్నది. 

ఆ మహనీయుడు ​అందరివాడు

అంబేద్కర్ ఆలోచన విధానం విశ్వజనీనం. ఆయన అందరివాడు. కేవలం ఒక వర్గానికే‌‌‌‌‌‌‌‌ ఆయన నాయకత్వాన్ని ఆపాదించి అవమానించడం క్షమించరాని నేరం. ఆయన నిఖార్సయిన జాతీయ నాయకుడు. వేదన, పీడన, దోపిడీ, నిరాదరణకు గురైన వారికే కాక సమసమాజాన్ని నిర్మిద్దామన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది అంబేద్కర్ జీవితం. ఆయనను విస్మరించడం అంటే దేశ భవిష్యత్తును విస్మరించడమే. ఆ మహనీయుడి ఆశయాలు సాధిస్తాం అనేది ఒక నినాదంగానే మిగలకుండా ఆచరణలో చేసి చూపిస్తున్న కార్యసాధకుడు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయడంలో ముందువరుసలో ఉంది. అంబేద్కర్ మహానీయుడి125 అడుగుల  విగ్రహ రూపం మన రాష్ట్రానికి బంగారు భవిష్యత్తును చూపుతుందని ఆకాంక్షిద్దాం. స్త్రీ విముక్తి ప్రదాతగా, తత్వబోధకుడిగా, సామాజిక విప్లవ మార్గాన్ని చూపిన అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి! 

- గుండగాని కిరణ్ గౌడ్,న్యాయ పరిశోధక విద్యార్థి