ఇవాళ గడ్డం వెంకటస్వామి వర్ధంతి

ఎంతోమంది పుడతారు, చనిపోతారు..  కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో తరతరాలుగా నిలిచిపోతారు. పేదల గుండెల్లో అలా చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన వ్యక్తి కాకా వెంకటస్వామి. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్ లో జన్మించిన ఆయన.. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ దేశ నేతగా ఎదిగి, ఎందరో బడుగుల జీవితాల్లో వెలుగులు నింపారు. 2014 డిసెంబర్ 22న ఆయన తుది శ్వాస విడిచే నాటికి కూడా పేదల కోసమే పరితపించారు. 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేత, హైదరాబాద్ కి షాన్, తెలంగాణకి జాన్, నల్ల నేల ఆప్త మిత్రుడు దివంగత కాకా గడ్డం వెంకటస్వామి పేద, బడుగు, పీడిత ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. ఆయనపేద ప్రజల గుండె చప్పుడు. దేశంలోని  ప్రముఖ  దళిత నేతల్లో కాకా ఒకరు. అంచెలంచెలుగా ఎదిగి దేశం గర్వించే నాయకుడిగా గుర్తింపు పొందారు. కాకా ఎన్నడూ నేల విడిచి సాము చేయలేదు. చివరి దాకా బడుగులతోనే ఉంటూ.. వారి కోసమే కొట్లాడారు. హైదరాబాద్ లో భూ పోరాటం చేసి వేలాది మంది పేదలకు ఇంటి స్థలం ఇప్పించిన ఘనత కాకాదే. అందుకే ఆయనను గుడిసెల వెంకటస్వామి అని కూడా పిలుస్తారు. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో..

తెలంగాణ ఆరు దశాబ్దాల కల. దాని కోసం ఎంతో మంది పోరాటం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం తొలి, మలి ఉద్యమాల్లో పోరాటం చేసిన వ్యక్తుల్లో కాకా ఒకరు. స్వరాష్ట్రం కోసం సొంత పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తోనే ఆయన గొడవకు దిగారు. ఒక సందర్భంలో సీడబ్ల్యూసీ లాంటి సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఉద్యమానికి ఎంతో చేయూత నిచ్చారు. స్థిరమైన రాజకీయాలకు, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దాటి ఎన్నడూ భిన్నంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. నిత్యం పేదోడి కోసం, వారి హక్కుల కోసం ఆరాట పడే వారు. ఆయనది విలక్షణమైన వ్యక్తిత్వం. కాకా ఏది మాట్లాడినా, ఏది చెప్పినా కుండబద్దలు కొట్టినట్లే ఉండేది. అతి సామాన్యుడు సైతం కాకాను ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా కలిసే అవకాశం ఉండేది.  ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, పోలీసులు నక్సలైట్ల పేరిట అమాయకులను తీసుకెళ్లి కాల్చి చంపిన సందర్భాల్లో బహిరంగంగానే ఖండించేవారు. కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలోనూ ఒకటి రెండు అలాంటి ఘటనలు జరిగితే, ఎలాంటి శశబిషలు లేకుండా బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి ఆయన నేరుగా పరామర్శించేవారు. ఎవరికి ఏ సాయం చేసినా చెప్పుకునే వారు కాదు. గుప్త దానాలు ఎక్కువగా చేసే వారు. కాకా తర్వాత ఆయన చిన్న కొడుకు గడ్డం వివేక్  వెంకటస్వామి తండ్రి అడుగుజాడల్లో నడిచారు. నడుస్తున్నారు.  కుల, మత, వర్గ, పార్టీలతో సంబంధం లేకుండా ఆయన మానవీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనేది లేకుండా ఆయన వద్దకు సాయం కోసం వచ్చే ప్రతీ ఒక్కరిని కాకా కలిసేవారు. వారికి సాయం చేసి ధైర్యం చెప్పేవారు. ఆయన లాంటి లక్షణం, అలవాటు, మానవ సంబంధాలు కలిగి ఉండటం కాకా చిన్నకొడుకు వివేక్ కు అబ్బాయి. తెలంగాణ సాధన ఉద్యమంలో ఎంపీగా వివేక్ అరెస్ట్ కూడా అయ్యారు. సొంతపార్టీలో అప్పటి ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి స్వరాష్ట్ర సాధన కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. పలు పోరాట కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

నల్ల నేలతో అనుబంధం..

కాకాకు నల్లబంగారు నేల అన్నా, అక్కడి మనుషులు అన్నా అమితమైన ఇష్టం. ఆయన ఎప్పుడూ కార్మికుల పక్షాన వారి హక్కుల కోసం కొట్లాడేవారు. ప్రభుత్వం తరఫున వారికి హక్కుగా రావాల్సిన వాటి కోసం కాకా కృషి చేశారు. 101 కార్మిక సంఘాలకు కాకా నాయకత్వం వహించారు. బీఐఎఫ్ఆర్ నుంచి సింగరేణిని కాపాడటంలో యాజమాన్యం, కార్మిక సంఘాలు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి పూర్తి మద్దతు ఇచ్చి కాకా కీలకంగా వ్యవహరించారు. ఆయన అన్ని సందర్భాల్లోనూ కార్మికుల వెంటే ఉన్నారు. ఆర్థికంగా కేంద్రం నుంచి 1100 కోట్ల రూపాయల అప్పు.. మారిటోరియం ఇప్పించారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో తాను ఉన్న ప్రభుత్వాన్ని కోరిన మొదటి ఎంపీగా కాకాది విశేష కృషి.  ఏ విషయాన్నైనా, కాకా మొహమాటం లేకుండా చెప్పేవారు. 

న్యాయం కోసం ఎంత వరకైనా..

కాకా ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ​సీఎం వైఎస్సార్ తో తలపడ్డారు. ఆయనది మడమ తిప్పని స్వభావం. న్యాయం కోసం ఎవరితోనైనా ఘర్షణ పడటానికి వెనకాడేవారు కాదు. ఆయన వేసిన బాటలో ఎన్నో ఆదర్శాలు, ఎన్నో జ్ఞాపకాలు, ప్రజల ప్రయోజనాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. కాకా నోట ఆయన జీవిత చరిత్రను ప్రముఖ రచయిత పి.చందు ‘ మేరా సఫర్’ గా రాశారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వం తెలియాలంటే దాన్ని తప్పక చదవాలి. కాకా ఎక్కడున్నా, ఆయన ఆత్మ తెలంగాణలోనే ఉంటుంది. కాకా అమర్ రహే.. హర్ ఏక్ కే దిల్ మే జిందా రహే.. కాకాతో నా అనుబంధం, ఆయన జ్ఞాపకాలు నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంటాయి. హీ వస్ గ్రేట్ లెజెండ్ పీపుల్ మ్యాన్! ఆ మనిషికి  సర్ జుకాకర్ సలాం కర్త హున్!

- ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్