అవినీతి అంతం కావాలంటే పౌరులు ప్రశ్నించాలి!

‘‘అభివృద్ధి, శాంతి, భద్రత కోసం అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలి’’అనే నినాదంతో ఈ ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం జరుపుకుంటున్నాం.2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అవినీతి నిరోధక ఒప్పందాన్ని ఆమోదించింది. 2005 నుంచి ఏటా డిసెంబర్ 9న ప్రపంచ  దేశాలన్ని అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని పూర్తవ్వాలంటే ఆఫీసర్​ చేయి తడపడం నుంచి వేల కోట్ల కార్పొరేట్ కుంభకోణాల వరకు అవినీతి విష వలయంలో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అవినీతి మార్గాల్లో ఆర్జించిన నల్లధనం ఓట్ల కొనుగోలుకు ఇంధనంగా మారి ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తున్నది. రాజకీయ నాయకులు ఓటుకు రూ. 500 నుంచి 5 వేల దాకా ఇస్తూ, ప్రజల ప్రశ్నించే తత్వాన్ని అణచివేస్తున్నారు. సామాజిక రుగ్మతగా పరిణమించిన ఈ అవినీతి ప్రజల జీవన ప్రమాణాల్ని మరింత దిగజారుస్తున్నది. పేదోడు మరింత పేదరికంలో కూరుకుపోతే, ఉన్నవారు మరింత ధనవంతులవుతున్నారు.

ఎన్ని చట్టాలు చేసినా..

అవినీతిని అరికట్టడానికి పాలనలో పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. ఆశించిన మార్పు పూర్తి స్థాయిలో రాలేదు. సర్కారు కొలువంటేనే చేతనైనంత దోచుకోవడానికి జీవితకాల లైసెన్స్ గా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రకృతిలో ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ప్రభుత్వ కార్యాలయంలో ఎంత పదవికి అంత అవినీతి అన్నట్లుగా మారిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యం, న్యాయస్థానాల్లో ఎంతకీ తెగని కేసులు ఈ సమస్య కొనసాగడానికి కారణం అవుతున్నాయి. ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచీలో ప్రభుత్వ రంగ అవినీతిలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. సులభతర వ్యాపార అనుకూల దేశాల చిట్టాలో 63 దేశాల జాబితాలో భారత్ 37వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకుల ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడానికి దేశంలో కొన్ని చట్టాలు అమల్లో ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం-1988, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002, సమాచార హక్కు చట్టం 2005, ప్రజా వేగుల చట్టం- 2011, లోక్ పాల్ లోకాయుక్త చట్టం- 2013 వంటివి అక్రమార్కుల అవినీతికి ముకుతాడు వేసేందుకు ఉద్దేశించిన చట్టాలైనా, వాటి అమలు సరిగా లేదు. దేశంలో అవినీతి అంతానికి ఈ గవర్నెన్స్ పాలసీ, అలాగే సాధారణ పౌరులకు అవినీతి పీడ తగ్గించడానికి ఆన్​లైన్ పన్ను చెల్లింపు విధానం కొంత వరకు సత్ఫలితాలను ఇస్తున్నది. బొగ్గు గనుల వేలంపాటలో ఆన్​లైన్ విధానం తేవడం ద్వారా వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి సమకూరుతున్నది. అన్ని శాఖల టెండర్ల ప్రక్రియలో ఈ పద్ధతికి శ్రీకారం చుడితే అవినీతిని కొంతవరకైనా తగ్గించవచ్చు.

వ్యవస్థలను చక్కదిద్దుకుంటే..

ఏ దేశంలో అయినా చట్టానికి పౌరుడే మూలాధారం. అతడు అవినీతిపరుల బారిన పడకుండా కాపాడడానికి పలు చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. వాటితోనే అవినీతి పూర్తిగా అదుపులోకి వస్తుందనేది ఓ భ్రమ మాత్రమే. అవినీతి చీకట్లో కమ్ముకున్నప్పుడు పౌరుల దారి దీపం ప్రశ్నించే తత్వం ఒక్కటే. సామాన్య ప్రజలు నోరు మెదిపితేనే అక్రమాలు బయటకు వస్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతిపరుల దుమ్ము దులపడం, అలాగే న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, సమస్యలను హక్కుల పరిరక్షణ సంఘాల దృష్టికి తేవడం లాంటి మార్గాల ద్వారా అక్రమార్కుల ఆట కట్టించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి నిర్మూలనకు పటిష్ట విధానాలను అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి సూచీల ఏర్పాటు, ప్రజాప్రతినిధుల వార్షిక ఆదాయ వివరాలు వెల్లడించడం, పౌర సేవల చట్టం అమల్లోకి తేవడం, సమాచార హక్కు చట్టానికి స్వేచ్ఛ కల్పించడం, అవినీతిపరులైన ఉద్యోగుల ఆస్తులను స్తంభింపజేయడం లాంటి మార్గాల ద్వారా అవినీతిని నిర్మూలించవచ్చు. దేశం నుంచి రాత్రికి రాత్రి అవినీతిని తరిమికొట్ట లేకపోయినా, వ్యవస్థలను చక్కదిద్దుకుంటే చాలావరకు అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించవచ్చు.

రాష్ట్రంలో అంతులేని అవినీతి...

రాష్ట్రంలో కొన్ని శాఖల వారు ప్రభుత్వ ఖజానా గండికోడుతూ దళారుల అండతో అందినకాడికి దండుకొంటున్నారు. పారదర్శక పాలన కోసం సర్కారు తెచ్చిన సంస్కరణల అమల్లో నేరపూరిత నిర్లక్ష్యమే తాండవిస్తున్నది. నిరుడు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో అవినీతిపై చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. రాష్ట్రంలో అవినీతి ఉందని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. లంచాలు ఇస్తేనే పనులవుతున్నాయని 89 మంది శాతం చెప్పారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని 80 శాతం మంది పేర్కొన్నారు. మరోపక్క ప్రతి ఏడాది రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న కేసుల సంఖ్య తగ్గుతున్నది. ఫిర్యాదు చేస్తేనే అధికారులు దాడులు చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు దాదాపు 40 వరకు నమోదయ్యాయి. రెవెన్యూ, పోలీస్, అటవీ, విద్యుత్ శాఖలో అవినీతి ఎక్కువగా కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి పనులపై ప్రజావేగులు ఫిర్యాదులు చేస్తున్నా, ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా భూకబ్జాలు, ప్రభుత్వ పనులు సంక్షేమ పథకాలు, పౌర సేవల్లో అవినీతి ఎక్కువగా జరుగుతున్నది. 
-అంకం నరేష్, రాష్ట్ర కో కన్వీనర్,​ యూఎఫ్​ ఆర్టీఐ