ఆడబిడ్డను బతకనిద్దం.. బతుకునిద్దాం

“పది రోజులు నాకు స్పృహ లేదు. అమ్మా వాళ్లు వచ్చినాక ధైర్యం వచ్చింది. అందుకని నిజం చెప్పా’’ ఖమ్మంకి చెందిన అమ్మాయి అన్న మాటలివి. 20 రోజుల క్రితం ఖమ్మంలో ఒక దివ్యాంగునికి అటెండెంట్​గా పని చేస్తున్న అమ్మాయిపై అతని కొడుకు అత్యాచారం చేయబోతే ఆమె ప్రతిఘటించిందని పెట్రోల్​ పోసి తగలబెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్​లోని హత్రాస్​ ఘటన, హైదరాబాద్ లోని మొయినా బాద్​ ఘటనలపై కేంద్ర, రాష్ట్రాలు స్పందించే పరిస్థితిలో లేవు. కానీ అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు, మహిళలు ఎందుకీ పరిస్థితుల్లోకి నెట్టేయబడుతున్నారని సభ్య సమాజం ఇకనైనా ఆలోచించాలి. అంతర్జాతీయ బాలికా దినోత్సవం’’గా అక్టోబర్​ 11ను యునైటెడ్​ నేషన్స్​ జరుపుతోంది. స్త్రీ, పురుష సమానత్వం ముఖ్య ఎజెండాతో 1995లో చైనాలోని బీజింగ్ లో నాల్గో ప్రపంచ సదస్సు జరిగింది. దాదాపు 30 వేల మంది మహిళలు 200 దేశాల నుండి హాజరయ్యారు. ఈ సదస్సులో బీజింగ్ డిక్లరేషన్ ద్వారా వచ్చిన నిర్ణయాలు తర్వాతి కాలంలో అనేక ఉద్యమ  రూపాలుగా మారడానికి తోడ్పడ్డాయి. లైంగికత, పునరుత్పత్తి హక్కుల నుండి సమాన వేతనం వరకు, లింగవివక్షత, బాలల హింస , విద్యావకాశాలు మొదలైన సమస్యలపై నిరంతర పోరాటాలు, ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో చేయడం జరుగుతోంది. ‘‘My voice, Our Equal Future–Let’s seize the opportunity to reimagine a better world inspired by adolescent girls -energized and recognised, counted and invested in’’ అనే థీమ్​తో ఈ సంవత్సరానికి కార్యక్రమాలను యూనిసెఫ్ ప్రారంభించింది.

రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు

మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్/ సస్టెనబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్ లో కూడా ‘‘జెండర్ సమానత్వం, మహిళా సాధికారత’’ ఒక ప్రధానాంశం. కానీ ఈ రోజు దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మహిళల, బాలికల జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో, ఆయా రాష్ట్రాల్లో మహిళలు, బాలికలు, ముఖ్యంగా దళిత బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నేషనల్​ క్రైం రికార్డ్స్​ బ్యూరో డేటా ప్రకారం 2018తో పోలిస్తే 2019లో 7.3 శాతం మహిళలపై హింస పెరిగింది. ఇక తెలంగాణ విషయంలో ఈ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే, 18,394 మంది మహిళలపై హింసకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇది 2018తో పోలిస్తే 14.76 శాతం పెరిగింది. ఈ సంఖ్య గత మూడు సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువ.

చట్టాలు చేసింది కాంగ్రెస్సే

ఈ రాష్ట్రంలో, దేశంలో మహిళలకు సంబంధించి ఏవైనా చట్టాలు ఉన్నాయంటే అవి కాంగ్రెస్ హయాంలో వచ్చినవే. బాలికలకు ఉచిత విద్య అయినా, బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడానికి వచ్చిన చట్టం అయినా, బాలబాలికలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి వచ్చిన చట్టం అయినా, లింగనిర్థారణా నిషేధ చట్టం, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ చట్టాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు తీసుకువచ్చినవే. ఇవే కాకుండా బాలికలకు కస్తూర్బా విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, మధ్యాహ్న భోజన పథకాలు తీసుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పంచవర్ష ప్రణాళికల ద్వారా సోషల్ వెల్ఫేర్ బోర్డులు, మహిళా మండలుల ద్వారా మహిళా సమస్యల పరిష్కారం, మహిళ, శిశు ఆరోగ్య రక్షణ, విద్య, పౌష్టికాహారం, మహిళా సంక్షేమం, అభివృద్ధి పథకాలు, లింగ నిష్పత్తి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబనలాంటి అనేక అంశాలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు రాజ్యాంగ రక్షణ కల్పించి ‘మహిళా పక్షపాత’ వైఖరితో వారి హక్కులను పరిరక్షించేందుకు దోహదపడింది.

బతికే హక్కును ఇవ్వాలి

ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉపయోగపడే ఆలోచనలు చేయకపోవడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసమే ప్రెస్ మీట్లు పెట్టి కాలం గడుపుతోంది. సమస్యలు వచ్చినపుడు వాటిని పక్కదారి పట్టించడానికి అధికారాన్ని ఉపయోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించడం ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించే పరిస్థితి కానీ, దోషులను శిక్షించే ఆలోచనలు కానీ చేయడం లేదు. బాధితుల వైపు మాట్లాడే, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి బాధితుల ధైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. ‘‘అర్ధరాత్రి బాలికలు/మహిళలు ఒంటరిగా తిరిగే రోజే దేశానికి నిజమైన స్వేచ్ఛ’’ అన్న గాంధీజీ మాటలకు ఇంకా కాలం చెల్లలేదు. కానీ ఇండ్లలోనే భద్రతలేని రోజులు వచ్చాయి. నిర్లక్ష్యపు ప్రభుత్వాలు, మనువాద సంస్కృతి, పితృస్వామ్య వ్యవస్థ రోజురోజుకు మహిళల మనోధైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతర్జాతీయ బాలికల దినోత్సవాలు జరుపుకునే ముందు బాలికలకు జన్మించే హక్కును, బతికే హక్కును మనమందరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసమానతలు రూపుమాపడానికి ప్రభుత్వాలు, సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉంది.

బంగారు తెలంగాణలోనూ భరోసా లేదు

తెలంగాణలో బతుకమ్మలుగా కొలిచే మహిళలకు, పిల్లలకు బతికే అవకాశాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు బాలికలు, మహిళలపై జరిగిన దారుణ ఘటనలే వీటికి ఉదాహరణలు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చెప్పకనే చెపుతున్నాయి. వరంగల్ లో 8 నెలల పసిపాపపై అత్యాచారం చేసి , హత్య చేసిన ఘటన అయినా, బొమ్మల – రామారాంలో బాలికలు చంపబడ్డ ఘటన, అమీన్ పూర్ సంఘటన, మెదక్ లో తల్లీ కూతుళ్లపై అత్యాచార ఘటన, మొయినాబాద్, ఖమ్మం ఘటనలు జరిగినా మంత్రులు, ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. కానీ ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడానికి గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుంటారు.