అంతరిస్తున్న ఆదిమ భాష.. నేడు అంతర్జాతీయ ఆదివాసీ భాషా దినోత్సవం

ప్రపంచీకరణ, సరళీకరణ, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో మగ్గుతున్న  అనేక ఆదివాసీ తెగలు అంతరిస్తున్న సందర్భాలు దర్శనమిస్తున్నాయి. అదే కోవలో ఆదివాసీలు మాట్లాడే భాషలు కూడా భిన్న మతాల సంస్కృతిలో సంకరీకరణం చెందుతూ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర వలసలు పెరగడం వంటి కారణాల వల్ల ఆదిమ భాషలు అంతరించే స్థాయికి చేరుకున్నాయి. తెలుగు గడ్డపై కోయరాజ్యాలు ఉన్నప్పుడు నాటి కోయభాషకు బదులుగా ఆదివాసీ భాషలపై తెలుగు ఆధిపత్యం కొనసాగిస్తూ.. అధికార భాషగా రూపాంతరం చెందింది. మహరాష్ట్రలో మరాఠీ భాష 
 

అక్కడ స్థానిక ఆదివాసీల

(గోండి భాష )పై మౌఖిక, భౌగోళిక దాడి చేసి అధికార భాషగా చెలామణిలో ఉంది. చత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, అసోమ్ తదితర రాష్ట్రాల్లో ఆదివాసీ భాషలపై ఇండో ఆర్యన్ భాషల ఆధిపత్యం మూలంగా చాలా ఆదివాసీల భాషలు, సంస్కృతి ధ్వంసం అయి ఆదివాసీ అస్థిత్వం దెబ్బతిన్నది. ఈ సమాజ పరిణామ క్రమంలోనే ఆదివాసీల మాతృభాషలు అంతరించిపోతున్నాయి.

ప్రమాదంలో పడిన సంస్కృతి

తెలుగు రాష్ట్రాల్లో 30 ఆదివాసీ తెగలు ఉంటే వాటిలో 8 తెగలకు ప్రత్యేకమైన భాష ఉంది. వాటిలో కోయ భాష పెద్దది. ఆదివాసీ భాషలకు మూలం కోయత్తోర్. కొలామ్ తెగవారు మాట్లాడే భాష కొలామి. గోండురాజులు మరాఠీల చేతిలో చాలా సార్లు ఓడిపోయిన తరువాత  గోండు రాజుల పాలనే సాగింది. మొఘల్ సామ్రాజ్యం తర్వాత గోండులు నిజాం ఏలిక కిందకు వచ్చారు. దాంతో అక్కడ గోండుల సంస్కృతి భాష కొంత పరాయీకరణకు గురైంది. కాకతీయ సామంతరాజులు మేడారం వంటి కోయరాజ్యాలపై దాడిచేసి ఆదివాసీల అస్థిత్వాన్ని అంతం చేసి తెలుగుభాషను బలవంతంగా ఆచరించమని ఆదేశాలు జారీ చేసినట్టు చరిత్ర చెబుతుంది. భాష అంతరిస్తే సంస్కృతి ప్రమాదంలో పడుతుంది. సామాజిక బంధాలు బలహీనపడుతాయి. అంతిమంగా ఆదిమతెగలు అంతరించి పోతాయి.

గిరిజనేతరులతో ముప్పు

కోయ తెగ ఆదివాసీలు అనగానే తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క- సారక్క జాతర గుర్తుకు వస్తుంది. క్రీస్తు పూర్వం నాటి అవశేషాలు ఖమ్మం జిల్లాలో 2007–08 మధ్య లభించిన ఆధారం బట్టి కోయతెగను నిర్ధారించారు. కోయగిరిజనుల మాతృభాష కోయభాష. దీనికి లిపి లేదు. ఇప్పుడు కొంతమంది ఆదివాసి మేధావుల కృషి ఫలితంగా లిపి, డిక్షనరీలు తయారవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం కోయగిరిజనులు 20,43,481మంది. కోయజాతి సాంస్కృతిక నృత్యం రేలా, కొమ్ము కోయనృత్యం. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ దండకారణ్యంలో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ ఆదివాసీ భాషలకు లిపికాని, ముద్రణ కాని లేకపోవడం మూలంగా కోయభాష అంతరిస్తుందని భాషా ప్రేమికులు భావిస్తున్నారు. నేటి పాలకులు కూడా కోయ భాష పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలు చేపట్టక పోగా గిరిజనేతరుల సంస్కృతి ప్రభావంతో ఆదివాసీ సంస్కృతి సన్నగిల్లుతున్నది.

ఆదిమ జాతులకు ప్రత్యేక విద్యా విధానం..

విశ్వ భాషలకు మూలం ఆదివాసీ పదజాలం. ఆదివాసీ భాష అంతరిస్తే విశ్వజ్ఞాన మూలాలను కోల్పోతాం. అందుకే ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో 2019 సంవత్సరాన్ని ‘ఆదివాసీ భాషా సంవత్సరం’ గా, జులై 21ను ఆదివాసీ భాషా దినోత్సవంగదా ప్రకటించింది. ఆదివాసీ భాషల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిందిగా యునెస్కో పిలుపునిచ్చింది. కోయ గోండి భాష గుర్తింపు కోసం ఆ భాషను ప్రమాణీకరించాలని ఆదివాసులు జాతీయ స్థాయిలో  2014, జులై 21న ఢిల్లీ నుంచి ఉద్యమం ప్రారంభించారు. ఆదిమ జాతిని బతికించే భాషలు మనుగడ సాగించాలంటే కోయభాష సాహిత్యాన్ని ఎలిగెత్తి చాటాలి. జాతీయ స్థాయిలో బహు భాషా విద్యా విధానం అమలు చేస్తూనే ఆదిమ జాతులవారికి మాతృ భాషలో ప్రాథమిక విద్యను అందించాలి. ఆదిమ జాతులకు ప్రత్యేకంగా విద్యావిధానం రూపొందించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసల నిరోధానికి చట్టం రూపొందించాలి. 

నిజాం కాలంలో ప్రాధాన్యం

ఇంగ్లీష్, హిందీ భాషలకు సొంత లిపి లేకున్నా అవి అమలవుతున్నట్లుగానే ఆదివాసీ భాషలను అభివృద్ధి చేసే ప్రయత్నం జరగాలి. ఆదివాసీలపై ఆంగ్లేయులకు ఉన్న చిత్తశుద్ధి మన పాలకులలో కన్పించక పోవడమే పెద్దలోపం. ఆనాటి పాలకులు ఆదివాసీ సంక్షేమం, ఆదివాసీ భాషలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిజాం రాజుల్లో చివరి రాజైన ఉస్మాన్ అలీఖాన్ ఆదివాసీ భాషల ప్రత్యేకతను గుర్తించి గోండు, కోయ భాషల్లోనే రాయించిన చరిత్ర మన కళ్ల ముందు ఉన్నది. ఆదివాసీ  టీచర్లనే నియమించి వారికి ప్రత్యేక శిక్షణ కోసం ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పారు. ఈ విధానం 1958లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంలో విలీనం అయ్యేవరకు కొనసాగింది. ఏపీ ఏర్పడిన తర్వాత కోయభాషపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల దాని వాడుక తగ్గిపోతున్నది. ప్రభుత్వం ఆదివాసీ భాషలను రక్షించకపోతే ఆదిమ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగు అవుతాయి. ఆదివాసీ సంస్కృతిలో అద్భుతమైన చారిత్రక పాటలు, కథలు, జానపదాలు, సాహిత్యం, మానవజాతి పరిణామక్రమం ఇమిడి ఉంటుంది.

 

గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక