తల్లి గర్భం నుంచి ఒకే సమయంలో లేదా కొన్ని సెకన్ల వ్యవధిలో జన్మిస్తే వారిని కవల పిల్లలు అంటారు. ఇద్దరూ మగ పిల్లలు, లేదా ఆడ పిల్లలు కావచ్చు, అరుదుగా ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ కావచ్చు. కవలలుగా జన్మించే పిల్లల్లో చాలా వరకు ఒకేలా ఉంటారు. శరీర నిర్మాణం, రంగు, జట్టు, ఎత్తు వంటివన్నీ దాదాపు 99 శాతం ఒకేలా ఉంటాయి. ఒకే పోలికతో ఉండే కవలలను వైద్య పరిభాషలో ‘ఐడెంటికల్ ట్విన్స్’ అని వేర్వేరు పోలికలతో జన్మించిన కవల పిల్లలను ‘నాన్ ఐడెంటికల్ ట్విన్స్’ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారని 2006లో ఓ సర్వే ద్వారా బయటపడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 22 న అంతర్జాతీయ కవలల దినోత్సవంగా నిర్వహించడం ప్రాచుర్యం లోకి వచ్చింది.
‘మోజస్, ఆరన్ విల్‌కాక్స’ కవల సోదరులు
పోలెండులో జన్మించిన ‘మోజస్, ఆరన్ విల్‌కాక్స’ అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవంగా తొలిసారి 1976లో నిర్వహించారు. దీనికి ఒక కథనం కూడా ప్రచారంలో వుంది. మోజస్, ఆరస్ విల్‌కాక్స తాము నివసిస్తున్న ఇంటి (ఊరు)కి 'ట్విన్స్ బర్గ్' అని పేరు పెట్టుకుని ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. వివాహం తరువాత తమ అనుబంధం విడిపోవద్దన్న ఆలోచనతో అక్కచెల్లెళ్ళను వివాహం చేసుకుని, రెండు కుటుంబాలు ఎంతో అనురాగంలో ఉండేవి. విచిత్రంగా ఇద్దరూ ఒకే వ్యాధితో భాధపడుతూ ఒకే రోజున (ఫిబ్రవరి 22న) మరణించారు. బింబప్రతిబింబాల మాదిరిగా ఉన్న ఈ కవల సోదరుల గౌరవార్థం ఆ నాటినుంచి ఆ కవలలు మరణించిన రోజునే కవలల దినోత్సవంగా జరుపుతున్నారు.
కవళికలు ఒకేలా ఉన్నా, అలవాట్లు ఒకేలా ఉండవు
కవలలు రూపంలో ఒకేలా ఉన్నా.... వారి ఫింగర్ ప్రింట్స్, కళ్లు మాత్రమే వేరేలా ఉంటాయి. కొంతమంది ట్విన్స్ ముఖ కవళికలు ఒకేలా ఉన్నా శారీరక బరువు వేర్వేరుగా ఉంటుంది. కవలల ఆకృతి మాత్రమే ఒకేలా ఉన్నా.. వారి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొందరు ట్విన్స్‌లో ఒకరు ఆరోగ్యంగా ఉంటే మరొకరు బలహీనంగా ఉండవచ్చు. అలాగే.. ఇద్దరిలో రోగ నిరోధక శక్తుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతరులు కవల పిల్లలను ఎలాగైతే గుర్తించలేకపోతారో, వారి తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు తికమక పడుతుంటారు. ఎందుకంటే ప్రతి ఆరునెలల కొకసారి శరీర రూపం మారుతుంది. చదువు విషయంలోనూ ఏడాదికి ఒక్కొక్కరు ఒకసారి ముందుండటం చూసి ఆశ్చర్యానికి గురౌతుంటారు. ఇద్దరు కవలలు జన్మించడం సాధారణమే. కానీ.. ముగ్గురు నుంచి ఏడుగురి వరకు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుంది. కవల పిల్లలకు జన్మనిచ్చే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని ఓ అధ్యయనం ద్వారా తేలింది. ఒకసారి కవలలకు జన్మనిచ్చిన మహిళకు మరో కాన్పులో కూడా కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు వైద్యనిపుణులు. ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరికి ఈ అవకాశం ఉండవచ్చు.
కవలల పుట్టుకకు కారణం..
పురుషుల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే శుక్ర కణం మహిళల్లోని అండంతో ఫలదీకరణం చెందడం వల్లే పునరుత్పత్తి జరుగుతుందని తెలుసు. అయితే.. ఒక్కోసారి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. మహిళల్లో కొన్నిసార్లు రెండు అండాశయాల నుంచి రెండు అండాలు విడుదలైనప్పుడు వాటికి రెండు శుక్ర కణాలు జతకలిస్తే ఫలదీకరణ విభిన్నంగా ఉంటుంది. లేదా ఒకే అండం రెండు సార్లు విదళనం చెందిన క్రమంలో కవల పిల్లలు జన్మిస్తారు. కవలలకు జన్మనివ్వడంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే.. ఒక వంశంలో పూర్వం ఎవరైనా కవలలకు జన్మనిచ్చి ఉంటే.. ఆ వంశంలోని వారికి ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరి వంశాల్లో ‘ట్విన్స్ హిస్టరీ’ ఉంటే కవలలకు జన్మనిచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. ‘ట్విన్స్ జీన్స్’ ఉన్న మహిళలు.. 30 ఏండ్ల వయసు దాటాక గర్భం ధరిస్తే కవలలు జన్మించే అవకాశం ఎక్కువ.
- గుమ్మడి లక్ష్మీనారాయణ,సామాజిక రచయిత