- 298 పోలింగ్ కేంద్రాలు.. అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్
- పోలీసులతో పాటు కేంద్ర బలగాల మోహరింపు
- పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ... ఈ నెల 6న కౌంటింగ్
- పలివెల ఘటనపై కేసు నమోదు: సీఈవో వికాస్ రాజ్
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నిక జరగనుంది. పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ బుధవారం తెలిపారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లోని సీఈవో ఆఫీసుతో పాటు ఈసీ నుంచి మానిటరింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీస్ సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు కలిపి దాదాపు 5వేల మందిని మోహరించినట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుందని, ఏజెంట్లు 5:30 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈవీఎంలను తిరిగి అప్పగించే వరకూ పోలింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈవీఎంలను వదిలి వెళ్లొద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
48 సింబల్స్
ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేసేందుకు బీహెచ్ఈఎల్ నుంచి 28 మంది ఇంజినీర్లు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని, పోలింగ్ స్టాఫ్‌ను కూడా రిజర్వ్‌లో పెట్టామని తెలిపారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, నోటాతో కలిపి 48 సింబల్స్ ఈవీఎంలలో ఉంటాయన్నారు.
కౌంటింగ్ కు వెయ్యి మంది ఏజెంట్లు..
పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్ల చేతిపై పార్టీల గుర్తులు ఉండొద్దని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గుర్తులు ప్రదర్శించొద్దని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ నెల6న కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్న వారినే పంపిస్తామని తెలిపారు. ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు రూ.8.2 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పలివెల ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. బైపోల్ కు సంబంధించి దాదాపు 500 వరకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
ఉప ఎన్నిక వివరాలు..
ఓటర్లు: 2,41,855
పోలింగ్ కేంద్రాలు: 298
మైక్రో అబ్జర్వర్లు: 199 మంది
పోలింగ్ సిబ్బంది: 1,492 మంది
పోలీస్ సిబ్బంది: 5 వేల మంది
ఫ్లయింగ్ స్క్వాడ్స్: 50 టీమ్స్