నేడు జాతీయ బాలికల దినోత్సవం

కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24ను ‘నేషనల్‌‌‌‌ గర్ల్‌‌‌‌ చైల్డ్ డే’(జాతీయ బాలికల దినోత్సవం)గా ప్రకటించింది. దీని ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంచి పీడన నుంచి విముక్తి కలిగించడం. అంతేగాక విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటం. ఇప్పటికే ఎన్నో రంగాల్లో మహిళలు విజయాలు సాధిస్తున్నా.. ఇంకా ఎక్కడో తాము వెనుకబడుతున్నాం అనే భావనలోనే ఉన్నారు. ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందించేవారు. కానీ ఆ తర్వాత మారిన సామాజిక పరిస్థితుల కారణంగా అమ్మాయి పుడితే అమ్మో ఆడపిల్లా! అనే స్థితికి దిగజారారు. ప్రస్తుత సమాజంలో కొంతమంది జండర్‌‌‌‌‌‌‌‌ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే కడతేర్చే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇంక ఆడపిల్లలకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. వీటన్నింటిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ బాలిక అభివృద్ధి మిషన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా సమాజంలో బాలికల సంరక్షణ పట్ల, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, పోషకాహారం, సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏటా జనవరి 24ను ‘జాతీయ బాలిక దినోత్సవం’గా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
 

నిర్భయ ఘటనే ఓ ఉదాహరణ
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందువల్ల ఆడ పిల్లలను రక్షించుకుందా.. అమ్మాయిలను ఆదరిద్దాం.. సృష్టిని కాపాడుకుందాం. అమ్మగా, సోదరిగా, భార్యగా, భవిష్యత్ తరాల కోసం.. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మనదేశంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అద్భుతమైన పరిపాలన చేశారు. మరెందరో మగువలు ముఖ్యమంత్రులుగా తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో బీద కుటుంబం నుంచి వచ్చిన గిరిజన బాలిక మాలవత్‌‌‌‌ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌‌‌‌ శిఖరాన్ని ఎక్కి తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటింది. క్రీడారంగంలో సానియామీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇలా ఎందరో మహిళలు వివిధ రంగాల్లో తమ ప్రతిభతో విజయపథంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుత గ్లోబలైజేషన్​ నేపథ్యంలో సమాజంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఆడపిల్లలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనే ఉదహరణ. ఆడపిల్లకు పుట్టుకతోనే వివక్ష, పెంపకంలో వివక్ష, చదువుల్లో, ఉద్యోగ అవకాశాల్లో వివక్ష.. అంతేగాక వివాహ సమయంలో వివక్ష అడుగడుగునా ఎదురవుతోంది. అసలు బాలికలంటేనే భారంగా భావిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. కొన్ని కార్పొరేటు ఆస్పత్రులు డబ్బులకు ఆశపడి జండర్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు చేసి ఆడపల్లలు పుట్టకుండా పరోక్షంగా సహాయపడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం, అమానవీయం. ముఖ్యంగా విద్యారంగంలో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో బాలికల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వారిని అబ్బాయిలతో సమానంగా చదివించడం లేదు.
 

తగినంత స్వేచ్ఛను ఇవ్వాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వివక్షలను నిర్మూలించడానికి, ఆడపిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సంవృద్ధి యోజన(ఎస్ఎస్‌‌‌‌వై), బాలిక సంవృద్ధి యోజన(బీఎస్‌‌‌‌వై) ద్వారా ఆర్థికంగా చేయూత నివ్వడం, ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం ద్వారా బాలికలను రక్షించడం – బాలికలను విద్యావంతులను చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ‘బాలికా సంరక్షణ యోజన’ ద్వారా బీద కుటుంబంలో పుట్టిన బాలికలను ఉచితంగా ఇంటర్మీడియెట్‌‌‌‌ వరకు చదివిస్తోంది. కర్నాటకలో ‘భాగ్యలక్ష్మి’, మధ్యప్రదేశ్​లో ‘లాడ్లీ లక్ష్మీ యోజన్‌‌‌‌’, రాజస్థాన్‌‌‌‌లో ‘రాజ్యలక్ష్మీ’, గుజరాత్‌‌‌‌లో ‘బాలిక సంవృద్ధి యోజన’, పంజాబ్‌‌‌‌లో ‘రక్షకి యోజన’ మొదలైన పథకాలు బాలికల రక్షణ కోసం రూపొందించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆయా రంగాల్లో వారికి తగినంత స్వేచ్ఛను ఇస్తూ, ఆడపిల్ల అనగానే భారంగా భావించే సంకుచిత ధోరణి నుంచి మారాలి. మాకు ఆడపిల్లే కావాలి అనే స్థాయికి సమాజం ఎదగాలి.

ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలి
2011 జనాభా లెక్కల ప్రకారం 0–6 ఏండ్లలోపు బాలబాలికల వివరాలను పరిశీలిస్తే ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేరళలో 964 మంది అమ్మాయిలు ఉంటే, తమిళనాడులో 943, ఛత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌లో 969, మణిపూర్‌‌‌‌‌‌‌‌లో 930, హిమాచల్‌‌‌‌ ప్రదేశ్​లో 909, త్రిపురలో 972, పశ్చిమ బెంగాల్​లో 956 మంది బాలికల నిష్పత్తి ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ బాలురతో పోల్చుకుంటే బాలికల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. దీనిని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న అన్ని సంఘాలు జనవరి 24న ‘జాతీయ బాలిక దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించాలి. దాని ద్వారా ఆడపిల్లల పాముఖ్యత, అవకాశాల కల్పన, అసమానతల నిర్మూలన, ఆడపిల్లల హక్కులు, గౌరవం మొదలైన అంశాలపై అందరికీ అవగాహన కల్పించాలి. ‘‘ఆడపిల్లలను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించినప్పుడే జాతీయ బాలిక దినోత్సవాన్ని సార్థకం చేసుకున్నవాళ్లమవుతాం. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.

పుట్టకముందే జండర్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తేలిస్తే కడుపులోనే కడతేర్చే వాళ్లు, ఆడపిల్ల పుట్టిన తర్వాత పీకనొక్కి చంపేసే వాళ్లు ఉన్న సమాజం మనది. ఇప్పటికే ఎన్నో రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నా.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల స్వేచ్ఛగా బతకాలి.. ఎదగాలి.. అన్న కాన్సెప్ట్‌‌‌‌కి ప్రతి ఒక్కరూ విలువ ఇచ్చే వరకూ ఆడబిడ్డల బతుకులు ఆగం అవుతూనే ఉంటాయి. ఇప్పటివరకూ వచ్చిన మార్పు సరిపోదు! ఆడవారికి మరింత స్వేచ్ఛ, ధైర్యం, సపోర్ట్‌‌‌‌ ఇవ్వాల్సి ఉంది. సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వాలు, ఇటు తల్లిదండ్రులే కాదు సొసైటీ కూడా వారికి అండగా నిలవాలి. ప్రతి ఆడబిడ్డనీ తమ ఇంటి బిడ్డలా చూసుకున్నప్పుడే వారు అన్ని రంగాల్లోనూ మరింతగా రాణించగలుగుతారు. భయం లేకుండా బతకగలుగుతారు. సమాజంలో వాళ్లు కోరుకున్న స్థాయికి ఎదగ గలుగుతారు.