ఆటలు ఆరోగ్యంతోపాటు శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయి. జీవితంలో గెలుపోటములను నేర్పిస్తాయి. వాటిని తట్టుకొని విజయం వైపు పరుగులు తీయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవేకాక, ఓర్పు, సహనం, ఏకాగ్రత, ఏదైనా సాధించాలనే తపన, మానసిక స్థైర్యం.. ఇవన్నీ ఆటల వల్లనే అలవడతాయి. ఆటలు ఆడే పిల్లలు చదువులోనే కాక జీవితంలో వచ్చే అన్ని సమస్యలను చాకచక్యంతో ఎదుర్కోగలరని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి.
జాతీయ క్రీడ అనగానే గుర్తుకొచ్చేది హాకీ. ఈ ఆటతో భారత్ పేరును ప్రపంచ పటంలో మార్మోగించిన వ్యక్తి ధ్యాన్‌చంద్. హాకీలో మన దేశానికి చారిత్రక విజయాలందించి, క్రీడా రంగంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఈ హాకీ మాంత్రికుని జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా నిర్వహిస్తోంది. ఈ రోజు క్రీడల ప్రాముఖ్యత, ప్రయోజనాల పట్ల నేటి తరానికి అవగాహన కల్పించడం జరుగుతోంది. అంతేకాకుండా దేశ, అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతంగా రాణిస్తున్న క్రీడాకారులకు క్రీడా అవార్డులను ఇచ్చి గౌరవించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. రోజులో కనీసం ఒక గంట ఆరుబయట ఆడుకోవడం ఎంతో ముఖ్యం అని నిపుణులు పేర్కొంటున్నారు. అనాదిగా కబడ్డీ, ఖో-ఖో లాంటి సంప్రదాయ ఆటలకు దేశమంతటా బహుళ
ప్రాచుర్యం ఉండేది. కాలక్రమేణా క్రీడల సమయం, సంస్కృతి మారిపోవడం వలన ఆటలంటే నేడు క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, చెస్ లాంటివి చలామణీ అవడంతో సంప్రదాయ అటల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
పారిస్ ఒలింపిక్స్ లో 71వ స్థానంలో భారత్
పారిస్ ఒలింపిక్స్ 2024 పతకాల పట్టికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో 48వ స్థానంలో ఉండగా ఇప్పుడు మరింత దిగజారింది. ఒక్క స్వర్ణ పతకం కూడా లేకుండా ఒక రజతం, ఐదు కాంస్యాలతో సహా ఆరు పతకాలను గెలుచుకొని నిరుత్సాహకరమైన ఫలితాలతో వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో భారత్ క్రీడల భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. నేటి విద్యావ్యవస్థలో మార్కులే జ్ఞానంగా, ర్యాంకులే విజయంగా భావించడంతో ఆటల సంస్కృతి విస్మరించబడుతోంది. పిల్లలు ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఎటువంటి శారీరక వ్యాయామం లేకుండా జీవిస్తున్నారు. ఉదయమే పాఠశాలలకు వాహనంలో బయలుదేరడం, సాయంకాలం మళ్లీ వాహనంలోనే ఇంటికి రావడం.. వచ్చీరాగానే టీవీ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఆటలతో బిజీ. ఇదీ నేటి పిల్లల దైనందిన జీవితంగా మారిపోయింది. ఈ జీవనశైలి పిల్లలను ఆటలకు దూరం చేయడంతో పాటు వారిలో ఒంటరితనం, ఒత్తిడిని పెంచుతోంది. అందుకే పిల్లలు జీవితంలో చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడి భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ALSO READ : యూపీఎస్ స్కీమ్ పై ఉద్యోగుల్లో నిరాశ
భారత్‌లో పోషకాహార సమస్య
ఆటలకు శారీరక దృఢత్వం ముఖ్యం. కానీ, భారత్‌లో పోషకాహార సమస్య వేధిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 ప్రకారం ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో వయస్సుకు తగిన బరువులేనివారు 32.1శాతం ఉండగా, ఎత్తులేనివారు 35.5 శాతం ఉన్నారు. పిల్లల్లో ఊబకాయం సైతం పెరుగుతోంది. ఫలితంగా సృజన, చురుకుదనం లేని బలహీన బాలభారతం తయారవుతున్నది. సమాజంలో వేళ్లూనుకున్న సామాజిక, ఆర్థిక అంతరాలు క్రీడాకారుల పాలిట పెనుశాపంగా మారాయి. ముఖ్యంగా ఆటలకు బీజం పడాల్సిన పాఠశాల స్థాయిలో సరైన ఆటస్థలం, తగిన ప్రోత్సాహం లేకపోవడం, శరీర దారుఢ్యానికి కావాల్సిన పౌష్టికాహారం, శిక్షణ సదుపాయాల కొరత, ఎంపికలో పారదర్శకత లోపించడం లాంటి ఇతర సమస్యలు క్రీడలకు ఆమోదయోగ్యమైన కౌమారదశలో క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు ఒలింపిక్ క్రీడలులాంటి అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీలలో భారత్ పెద్దగా రాణించలేక పోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
స్పోర్ట్స్ యూనివర్సిటీకు శ్రీకారం హర్షణీయం
భారత్‌లో క్రికెట్ వంటి ఆటలతో పోలిస్తే జాతీయ క్రీడ హాకీకి కూడా చెప్పుకోదగిన ప్రోత్సాహం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకోవాలి. క్రీడా వ్యవస్థాపకతకు మనదేశం గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటీవల మహిళా క్రీడాకారులు అంతర్జాతీయం క్రీడా వేదికలపై సత్తా చాటి పతకాల వేటలో ముందుండడం సానూకూలాంశం. ఇప్పటికే భారతదేశంలో శారీరక ఆరోగ్యం, క్రీడలను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన 'ఫిట్ ఇండియా', 'టార్గెట్ ఒలింపిక్స్ పోడియం', 'ఖేలో ఇండియా' లాంటి కార్యక్రమాలను క్రీడలను ప్రోత్సహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విరివిగా స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయాలి. వీటిలో మౌలిక వసతులను కల్పించి, ప్రపంచస్థాయి శిక్షకులతో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి మండలానికి ఒక క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీకు శ్రీకారం చుట్టడం హర్షణీయం.
చదువుతోపాటు ఆటలకు సమ ప్రాధాన్యతివ్వాలి
ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేలా హైదరాబాద్‌ను మార్చాలి. రాష్ట్రంలో యంగ్ ఇండియా పేరుతో ఏర్పాటు చేయనున్న సమీకృత గురుకుల సముదాయాలు సైతం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామీణ క్రీడలకు పునర్వైభవం తీసుకురావాలి. ఆటల స్ఫూర్తిని చాటడానికి గ్రామ, మండల స్థాయిలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలి. యువతలో ఆటల పట్ల ఆసక్తి రేకెత్తించడానికి తరచూ టోర్నమెంట్లు నిర్వహించి విజేతలకు మంచి ప్రోత్సాహం అందించాలి. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతను తీసుకురావాలి. జాతీయ క్రీడా అభివృద్ధి నిధులను కార్పొరేట్ సంస్థల సాయంతో సమీకరించాలి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కు పునాది ఇప్పుడే పడాలి. ఆటలకు పునాది బాల్యమే కావున అందుకు పాఠశాలలు వేదిక కావాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను తప్పక నియమించాలి. విద్య మూల్యాంకనంలో క్రీడలను కూడా భాగం చేయాలి.
- సంపతి రమేష్ మహారాజ్,సోషల్ ఎనలిస్ట్