ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రూపశిల్పి

కొత్తపల్లి జయశంకర్.. ఈ పేరు చెపితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ప్రొఫెసర్ జయశంకర్​సార్ అంటే మాత్రం తెలంగాణలో​ప్రతి ఒక్కరి మనసు పులకరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా బతికిన వ్యక్తి జయశంకర్. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన కన్నుమూశారు. ఇవాళ(సోమవారం) సార్​ వర్ధంతి. జయశంకర్​ ఆశించిన దిశగా రాష్ట్రాన్ని నడిపించడమే ఆ మహానుభావునికి మనం ఇచ్చే నిజమైన నివాళి.

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉద్యమాన్ని చేర్చారు

1952లో ముల్కి విధానాలను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి స్టూడెంట్​ లీడర్​గా నడుంబిగించారు. లెక్చరర్​గా సీకేఎం కాలేజీలో చేరిన ఆయన తన రచనలు, బోధనల ద్వారా తెలంగాణ ఏర్పడితే వచ్చే ప్రయోజనాల గురించి స్టూడెంట్లకు నూరిపోసి వారిలో చైతన్య దీపం వెలిగించారు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్నారు. 1954లోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఫజిల్ ఆలీ కమిషన్ కు ఓ నివేదిక సమర్పించారు. 1969లో ఆర్.సత్యనారాయణ, శ్రీధరస్వామి మొదలైన పది మంది మేధావులతో ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ సాధనకు వ్యూహాలు రచింపచేశారు. ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ జనసభను అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ‌‌తెలంగాణ ఆవశ్యకత గురించి ఎన్నో రచనలు చేశారు. ఎన్నో డాక్యుమెంట్లను రూపొందించారు. తెలంగాణ వచ్చిన వెంటనే చెరువులను పునరుద్ధరించి గ్రామీణ వ్యవస్థను సస్యశ్యామలం చేయాలని తహతహలాడారు. అప్పటి నీటి కేటాయింపుల అసంబద్ధతను ఎన్నోసార్లు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి అమెరికాకు పరుగులు పెట్టించారు.‌‌

కలలుగన్న రాష్ట్రాన్ని చూడకుండానే..

1975 నుంచి 1979 వరకూ సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్ గా, 1979 నుంచి 1981వరకూ కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్ గా, 1982 నుంచి 1991వరకూ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్ గా, 1991 నుంచి 1994 వరకూ కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ గా పనిచేశారు. 1999-–2000 మధ్య అమెరికాలో పర్యటించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమం గురించి అవగాహన కల్పించారు. అప్పట్లోనే తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం(టీడీఎఫ్)ను ఏర్పాటు చేశారు.‌‌ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటులో జయశంకర్​ను కేసీఆర్ సలహాదారుగా చేసుకున్నారు.‌‌ ఆయన మార్గదర్శకత్వాన్ని గౌరవించారు. తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపకునిగా పనిచేశారు.‌‌ 2009లో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్​ చేసిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. కేసీఆర్​కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బతికున్నంత కాలం తెలంగాణ ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేసి, చివరి వరకూ బ్రహ్మచారిగా‌‌ జీవనాన్ని కొనసాగించి, తాను కలలు కన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే 2011 జూన్ 21న కనుమూశారు. జయశంకర్ మీద గౌరవంతో ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా పేరుపెట్టారు కేసీఆర్. అలాగే వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. అయితే పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాలు తీర్చేందుకు మరింత కృషి చేసి ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణను సాకారం చేయాలి.

తెలంగాణ కోసం చిన్ననాటి నుంచే గళమెత్తారు

ఉమ్మడి వరంగల్​ జిల్లా అక్కంపేటలో మహాలక్ష్మి, లక్షీకాంతరావు దంపతులకు 1934 ఆగస్టు 6న జయశంకర్​ పుట్టారు. హనుమకొండ, వరంగల్ లో ప్రాథమిక, ఉన్నత విద్య చదివారు. బెనారస్ యూనివర్సిటీ నుంచి ఒక ఎంఏ, అలీగఢ్​​ యూనివర్సిటీ నుంచి మరో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్​డీ చేశారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ఆయనకు మంచి పట్టుంది. ఆరో తరగతి చదివేటప్పుడే స్కూల్​లో నిజాంను పొగుడుతూ పాడిన పాటను బహిష్కరించి ‘వందేమాతరం’ అని నినదించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చిన్నతనం నుంచే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.‌‌ ‘మా తెలంగాణ మాగ్గావాలి. స్వయం పాలనలో శాసిస్తాం. కానీ ఇతరుల పాలనలో ప్రస్తుతం యాచిస్తున్నాం’ అని బాధపడే వారు. 

యివ్వల ప్రసాదరావు, టీచర్ యూనియన్ నాయకుడు