ప్రపంచ వ్యాప్తంగా సుమారు 740 కోట్ల జనాభాలో వంద మతాల వరకు ఉన్నట్లు చెబుతారు. కానీ మెజారిటీ ప్రజలు ఆచరిస్తున్నవి, మనకు తెలిసినవి 22 మతాలే. అందులో మన భారతదేశంలో ఉన్నవి హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ మతాలు. మనదేశంలో ముస్లిం మతస్తులు దాదాపు 30 కోట్లమంది ఉన్నట్లు అంచనా. మహా ప్రవక్త ఆజ్ఞలను ప్రతి ముస్లిం తప్పని సరిగా పాటిస్తాడు. అది వారి విధి. ఈ ఆజ్ఞలను పాటించడాన్నే ఇమాన్, ఇస్లాం అని అంటారు. ముస్లిం అయిన ప్రతి ఒక్కరూ ఈ అంశాలను పాటించాలని మహమ్మద్ ప్రవక్త ఇస్లాంకు సంబంధించిన అయిదు ముఖ్యాంశాలు తెలిపారు. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు కారు. ప్రతిరోజు ఐదు పూటలూ నమాజ్ చేయడం విధి. రమజాన్ మాసంలో ఉపవాస దీక్ష ‘రోజా’ పాటించాలి. జకాత్‌ని తప్పక చెల్లించాలి. శక్తి, స్తోమత ఉన్న వారు ‘మక్కా’ పవిత్ర యాత్ర చేయాలి.
ముస్లింల పవిత్ర గ్రంథం ‘ఖురాన్’. ఇందులో ‘సూరా’ అనే 114 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని ప్రార్థన (నమాజ్) సమయంలో చదువుతారు. మహమ్మద్ ప్రవక్త తన నలభై ఏండ్ల వయసులో మక్కా సమీపంలోని పర్వత గుహలలో ధ్యానంలో ఆయనకు కలిగిన
దివ్యానుభూతి ఫలితంగా రాత్రి సమయంలో ఆకాశవాణి ఆయన చేత ఆ సూరాలు పలికించిందని, అవి వాస్తవాలని, ‘అల్లా’ మాటలని ముస్లింల విశ్వాసం. ఇవి అరబ్ భాషలో తాళ యుక్తంగా ఉన్నాయి. ధార్మిక బుద్ధి, సర్వమానవ సమానత్వం ప్రబోధమే వీటి సారాంశం. ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల వినయ, విధేయతలు, అవసరమైనప్పుడు ధైర్య, సాహసాలతో జీవన యాత్ర సాగించాలని ఖురాన్ బోధిస్తోంది. ముస్లింల పవిత్ర స్థలం ‘మక్కా’.
సర్వ మానవ సహోదరత్వమే..
ముస్లింలు సంప్రదాయబద్దంగా ఆచరించి, జరుపుకునే అత్యంత విశిష్టమైన పండుగ రమజాన్. మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, క్రమ శిక్షణ, సహనం, దాతృత్వం, పవిత్ర జీవితం, న్యాయ మార్గానుసరణ, ఆర్థిక సమానత్వం, సర్వ మానవ సహోదరత్వం వంటి సుగుణాలు పెంపొందించడానికి సర్వశక్తి గల, సర్వ వ్యాప్తంగల, అల్లాహ్ రమజాన్ మాసాన్ని ప్రసాదించాడు. రమజాన్ నెలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1421 (హిజ్రి) సంవత్సరంలో రమజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. అరబిక్ భాషలో ‘రమ్జ్’ అంటె ‘కాలడం’ అని అర్థం. నెలరోజుల్లో ఉపవాస దీక్షలో శరీరాన్ని శుష్కింప చేయడంతో ఆత్మలోని మలినాలు ప్రక్షాళనమై, సర్వ పాపాలూ దహించుకు పోతాయని అర్థం. అందుకే ‘రమజాన్’ అని పిలుస్తారు. అరిషడ్వర్గాలైన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు కళ్లెం వేయడంతో మనో నిగ్రహం ఏర్పడుతుంది. దైవం పట్ల భక్తి, శ్రద్ధ, విశ్వాసం, పాపభీతి పెరిగి చెడ్డ పనులు తగ్గుతాయి. మహాప్రవక్త ఈ మాసాన్ని మూడు విభాగాలు చేశారు. మొదటి భాగంలోని పది రోజులు దైవ కృపా కటాక్షానికి, రెండో భాగంలోని పది రోజులు దైవ క్షమాపణకూ, మూడో భాగంలోని పది రోజులు నరకం నుంచి విముక్తి కలిగించి, సాఫల్యం కూర్చేందుకు అని తెలియజేశాడు.
రోజా దీక్ష..
రోజును సౌమ్ అని, సియామ్ అని పిలుస్తారు. ఉపవాసిని ‘సాయమ్’ అని అంటారు. రోజా అంటే ‘సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమయం వరకూ అన్న పానీయాలు త్యజించడం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవడం’ అని భావం. ఈ ఉపవాస దీక్ష హజ్రత్ అదమ్ ప్రవక్త నాటి నుంచి వచ్చింది. రోజాకు సంబంధించిన ఆదేశాలు దివ్య ఖురాన్ ఆల్ ఖబర 183 నుంచి 185 వరు ఉన్న ప్రవచనాల్లో పేర్కొన్నారు. ధర్మనిష్టత, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాన్ రోజులు పాటిస్తారో, వారు గతంలో చేసిన పాపాలను దేవుడు మన్నిస్తాడు. రమజాన్ నెలలో ఏ చిన్న పుణ్య కార్యానికైనా 70 రెట్లు పుణ్యం లభిస్తుందని దివ్యఖురాన్, హదీసుల్లో ఉంది. స్వర్గంలో ఉన్న ఎనిమిది ద్వారాల్లో ఒక ద్వారమైన ‘రయ్యాన్’ కేవలం ఉపవాసి కోసమే
కేటాయించి ఉంచుతారట.
నమాజ్ నిద్రకంటే మేలైంది..
నమాజ్ వేళ అయినప్పుడు దాన్ని సూచించేందుకు ‘ము అజ్జిన్’ ఇచ్చె పిలుపు లేక ప్రకటనకు అజాన్ అని పేరు. దీన్ని అరబీ భాషలో బిగ్గరగా చెప్తారు.మసీదులో చేసే ప్రార్థన ముందుగా ‘అల్లాహు అక్బర్’ అంటూ మొదలవుతుంది. అల్లా నుంచి వచ్చిన ఓ మంచి కబురుతో ఈ రోజు ప్రారంభం అవుతుందని తెలుగులో ఈ ప్రార్థన భావం. అంతేగాక అల్లాహ్ సందేశకర్త అని సాక్ష్యమిస్తున్నాడు. నమాజ్ కై తరలిరండి. సాఫల్యం, మోక్షం పొందండి. ఎందుకంటే ‘అల్లాహ్’ ఎంతో గొప్పవాడు. అందువల్ల నమాజ్ నిద్ర కంటే మేలైనది.
సహరిలోనే శుభం ఉంది
యుక్త వయస్కులు, ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రతి ముస్లిం, స్త్రీ, పురుషులకు రోజా తప్పని సరి విధి (ఫర్జ్) గా ఆదేశించడమైంది. వేళకు ముందే సహరి చేయాలి. సహరి అంటే రోజా ప్రారంభించే ముందు చేసే భోజనం. ‘సహరి భుజించండి, సహరిలోనే శుభం ఉంది’ అన్నారు మహా ప్రవక్త. ఇఫ్తార్ చేయడంలో త్వరపడాలి. ఇఫ్తార్ అనగా రోజా ముగించే సమయంలో చేసే భోజనం. ఉపవాసి చాడీలు, అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త వహించాలి. దాన ధర్మాలు విస్తృతంగా చేయాలి. దివ్య ఖురాన్‌ను వీలైనంత ఎక్కువ పారాయణం చేయాలి. రోజా దీక్షను చేపట్టడానికి ప్రతి రోజు తెల్లవారు జాము 3.30 నుంచి 5.20 నిమిషాల లోపు ‘సహర్’ పేరిట భోజనాలు చేయాలి. తెల్లవారు జాము 5.20 నుంచి ప్రారంభమయ్యే దీక్ష సాయంత్రం 5.45 నుంచి 6.00 వరకు కొనసాగుతుంది. రోజాను విరమించే విధానాన్ని ‘ఇఫ్తార్’గా పేర్కొంటారు. దీక్షను చేపట్టిన సమయంలో అన్ని ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుంది. నోట్లో వచ్చే లాలాజలాన్ని సైతం మింగితే దీక్ష పూర్తి కాదని మత గురువుల అభిప్రాయం. 30 రోజుల దీక్ష అనంతరం షవ్వాల్ నెల మొదటి రోజు ‘ఈద్–ఉల్–ఫితర్’ (రమజాన్ పండుగ) జరుపుకుంటారు.
- మునిగంటి శతృఘ్నచారి కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం, తెలంగాణ.