మహిళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిబాయి పూలే

స్త్రీ విద్యా విప్లవ కారిణి నేటి మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత వేల సంవత్సరాల స్త్రీల బానిసత్వానికి విముక్తి మార్గదర్శిణి విద్యా విజ్ఞానం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను స్త్రీ జాతికి ప్రసాదించి అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా కందారా తాలూకాలోని నయాగావ్ గ్రామంలో కండోజి సేవనే పాటిల్ లక్ష్మీబాయి దంపతులకు జన్మించింది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి నవయుగ వైతాళికులు మహాత్మా జ్యోతిరావు పూలే తో వివాహం జరిగింది. అప్పటివరకు అక్షరం జాడ తెలియని సావిత్రి బాయి పూలే భర్త ప్రోత్సాహంతో తన దగ్గరే చదవడం, రాయడం నేర్చుకుంది. భర్త ఆశయాల సాధన కోసం ఆయనతో కలిసి నడిచింది. 

అవమానాలనూ లెక్కచేయలేదు

అసలు ఆడపిల్లలకు చదువు అనే ఆలోచనే లేని కాలంలో చదువులను వాడవాడల్లోకి ప్రతి గడపలోకి తీసుకెళ్లారు. తను ఆడపిల్లలకు చదువు చెప్పడం ఇష్టం లేని ఆ ఊరిలో ఉన్న దొరలకు నచ్చేది కాదు. మహిళలు చదువు నేర్చుకోవడం మహా పాపమని ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. పాఠశాలకు వెళుతుంటే కోడిగుడ్ల తో, రాళ్లతోనూ కొట్టేవారు. మురుగు నీళ్లు పోసేవారు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేది ఎవరైనా ఎక్కువగా తిడితే నా పని నేను నిర్వర్తిస్తున్నాను అని ఓపికతో సమాధానం చెప్పేది. వారి వేధింపులు మరీ ఎక్కువైనప్పుడు తన ఆత్మ రక్షణ కోసం చెంప దెబ్బ కొట్టింది. దాంతో ఆ గ్రామ దొరలు ఊరి పెద్దలు సావిత్రిబాయి పూలే కుటుంబం పై దాడి చేయడం ప్రారంభించారు. పాఠశాలను నడిపితే ఊర్లో నుంచి వెలివేస్తామని తెగేసి చెప్పారు. దాంతో పూలే దంపతులు ఊరు విడిచి వెళ్లిపోయారు. సమాజం కోసం మంచి చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరూ నడిచేది ముళ్లబాటలోనే.  అవమానాలు భరించైనా అనుకున్నది సాధించాలనే ఆశయం అనువంతైన తగ్గక నరనరాల్లో ఎగిసిపడే ప్రతి రక్తపు బొట్టు స్త్రీ విద్యా ఉద్యమం వైపు నడిపించింది.   అన్ని కులాల వారు చదువుకోవడానికి ఒక పాఠశాలను స్థాపించారు. 
ఈ పాఠశాలలో బ్రాహ్మణుల బాలబాలికలు కూడా ఉండేవారు. 

సామాజిక రుగ్మతలపై దృష్టి

1852లో ఒక మహిళా మండలిని కూడా స్థాపించి ఈ మండలి ద్వారా కులమత వివక్షతను పోగొట్టడానికి చాలా కృషి చేశారు. సంప్రదాయక పండగలన్నింటినీ గౌరవించి మూఢాచారాలను రూపుమాపగలిగారు. వితంతువుల కోసం 1863లో ఒక శరణాలయాన్ని స్థాపించారు. పూలే దంపతులకు సంతానం లేకపోవడంతో కాశీబాయి అనే వితంతువు కుమారుడిని దత్తత  తీసుకొని యశ్వంత్ అని పేరు పెట్టి కన్న కొడుకు లాగే పెంచి ప్రయోజకుడిని చేసింది.  బాల వితంతువులందరినీ దగ్గరకు చేర్చి ఆశ్రయం కల్పించి విద్యను నేర్పిస్తూ జీవనోపాధిని కూడా కల్పించారు. 1856 జూలై 26న ప్రభుత్వం స్పందించి వితంతు పునర్వివాహ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. సావిత్రి బాయి పూలేను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తించింది. మహాత్మ జ్యోతిరావు పూలే మరణాంతరం కూడా ఆత్మస్థైర్యంతో బాధ్యతగా సమాజ సేవకు అంకితమయింది. పుణే నగరాన్ని ప్లేగు వ్యాధి కబళించినప్పుడు ప్రజలంతా ప్రాణభయంతో అడవుల్లోకి వెళ్లిపోయారు. సావిత్రిబాయి  తన కొడుకు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించారు. తన 66వ ఏట 1897 మార్చి 10న ప్రజా సేవలోనే సామాజిక వైద్యురాలు తుది శ్వాస విడిచారు. సావిత్రిబాయి పూలే సేవలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది. సమాజ సేవలో పాటుపడే వారికి ప్రతి సంవత్సరము ఈ పురస్కారాన్ని అందిస్తుంది. వీరి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను కూడా విడుదల చేశారు. పూలే దంపతులు తమ వ్యక్తిత్వంతో సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేశారు. సామాజిక కార్యకర్తగా రచయితగా మహిళా హక్కుల ఉద్యమకారిణిగా అంతకుమించిన మానవతావాదిగా సేవలందించినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదనిపిస్తుంది. ఎటువంటి ప్రతిఫలం ఆశించక నిజాయితీ నిస్వార్థ సేవలతో అసమానతలు లేని సమాజ నిర్మాణం 
కోసం అలుపెరగని పోరాటం చేసిన సాహస వీర నారీమణి. ఆమె జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం.

మహిళా సంస్కర్త

సమాజంలో రుగ్మతలను నిర్మూలించాలని భర్త పడుతున్న తపనను అర్థం చేసుకొని తనకు తోడుగా నిలిచింది. ‌సావిత్రిబాయి విద్య నేర్చుకోవడం ఆ కుటుంబంలో ఎవరికి నచ్చేది కాదు, అందరూ వ్యతిరేకించేవారు ఆ వ్యతిరేకతను చూసి సావిత్రిలో చదువు పైన పట్టుదల మరింత పెరిగింది. ఆ కాలంలో ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేసేవారు.ఎన్నో రకాల సాంఘిక దురాచారాలు అమల్లో ఉండేవి. చదువు నేర్చుకుంటే వారి చెవిలో సీసం పోసేవారు. అవన్నీ చూసి చలించిన సావిత్రిబాయి పూలే మహిళలకు చదువుతోనే సాధికారత సాధ్యమని భావించింది. అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మహిళలకు  ముఖ్యంగా వెనకబడిన క్రింది కులాల బాలికలకు విద్యను అందించడం కోసం తను కూడా పట్టుదల గా చదివి, మహిళల కోసం బుధవార పేటలో ఒక పాఠశాలను ప్రారంభించింది. ఇది బాలికల కోసం స్థాపించిన మొట్టమొదటి పాఠశాల కావడం విశేషం.

అందరికీ విద్య అందించింది

పాఠశాల నడిపించడంలో సుగుణబాయి, ఫాతిమా షేక్ అనే ఉపాధ్యాయులు తనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. వ్యవసాయదారులు కార్మికులందరి కోసం రాత్రి బడులను నెలకొల్పారు. అందరికీ చదువు చెప్పడమే కాకుండా ఎంతోమంది పేదలకు తిండి, బట్టలు ఇచ్చేవారు. పనికి వెళ్లే బాలబాలికలకు డబ్బులు ఇచ్చి మరీ పాఠశాలకు తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పేవారు. సావిత్రిబాయి పూలే కేవలం మహిళా విద్యావ్యాప్తికే పరిమితం కాలేదు ఇతర సాంఘిక రుగ్మతలను నిర్మూలించడానికి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఒక ఉపాధ్యాయిని మాత్రమే కాక మంచి రచయిత్రి కూడా. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడం కోసం ప్రజలను ప్రేరేపించి చైతన్యం కలిగించే విధంగా ఎన్నో రచనలు చేశారు. అనతి కాలంలోనే 1876 – 77 మధ్యకాలంలో సుమారుగా 50 పాఠశాలలు స్థాపించారు.

- కొమ్మాల సంధ్య, తెలుగు అధ్యాపకురాలు,ములుగు జిల్లా