తెలంగాణ చరిత్రలో ఆయనను ఎప్పటికీ మరువలేం

తెలంగాణ చరిత్రలో ఆయనను ఎప్పటికీ మరువలేం

తెలంగాణే ఆశ, శ్వాసగా జీవించి, ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్​ కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ చరిత్రలో ఆయనను ఎప్పటికీ యాది మరువలేం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొట్లాడి, మలిదశ పోరుకు మార్గదర్శకం చేశారు. అందరు ‘జయశంకర్​సార్’ అని ముద్దుగా పిలుచుకునే తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని అన్ని వేదికలపై బలంగా వినిపించిన వ్యక్తి ఆయన. తెలంగాణ ఏర్పడాలనే బలమైన కాంక్ష మలిదశ పోరాటానికి పునాదులు వేసేలా చేసింది. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసి తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడిపేందుకు కృషి చేసిన ఉద్యమ నాయకుడు జయశంకర్ సార్.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ బీజాలు నాటి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో అడుగడుగునా ఉద్యమ బీజాలు నాటిన జయశంకర్ సార్1934 ఆగస్టు 6న హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలంగాణ సంస్కృతి, భాష, ఆచారాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడం వల్ల, ఆంధ్రాపాలకుల వివక్షను పసిగట్టి గళమెత్తగలిగారు. ఎక్కడ ఏ విషయంలో తెలంగాణను చిన్న చూపు చూసినా ఊరుకునేవారు కాదు. సరైన రీతిలో సమాధానం చెప్పేవారు. ఆయనకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది.

1952 లో నాన్ ముల్కీ ఉద్యమం, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టి మొదటి ఎస్ఆర్ సీ  కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. బెనారస్ అలీగడ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్​డీ పూర్తి చేశారు. సీఫెఎల్ రిజిస్ట్రార్ గా, సీకేఎం కాలేజీ ప్రిన్సిపల్ గా, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘‘నాకు ఒకే ఒక కోరిక మిగిలి ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూసిన తర్వాత మరణించాలి’’అని చాలా సందర్భాల్లో తెలిపిన జయశంకర్ సార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం కాకముందే 2011 జూన్ 21న మృతిచెందారు.

ఉద్యమ నేతలో మరో పార్శ్వం..

ఆచార్య జయశంకర్ ఉద్యమ నేతనే గాక గొప్ప విద్యావేత్త, దార్శనికుడు. భాష విషయంలో నిబద్ధత కలిగిన ఆలోచనా శీలి. తార్కిక భావ యుక్తంగా ప్రతి విషయాన్ని విశ్లేషించగలిగే మనస్తత్వం ఆయన సొంతం. విద్వాన్ టీవీ సుబ్బారావు రచించిన ఉర్దూ సాహిత్య చరిత్రకు ఆచార్య జయశంకర్ విపులమైన పీఠిక రాశారు. ఆ పీఠికలో తెలంగాణీయులు, తెలంగాణేతరులు మాట్లాడే తెలుగులో ఎన్నెన్ని ఉర్దూ పదాలు ఇమిడిపోయాయో వివరించి అర్థవంతమైన చర్చ చేశారు. భాష పట్ల వారికున్న పట్టుకు ఈ పీఠికే నిదర్శనం. తెలుగు భాషలో అనేక విశేషాల్ని గురించి పలు సమావేశాల్లో ప్రస్తావించారు.

తెలంగాణేతరులు తెలంగాణ భాష, యాసను హేళనగా మాట్లాడిన సందర్భాల్లో వారు ఉన్నప్పుడు సరైన తర్కంతో తెలంగాణ భాష ఎంతటి గొప్పదో కూడా నిరూపిస్తూ ఉండేవారు. సామాన్య కుటుంబంలో పుట్టి యావత్తు తెలంగాణ సమాజం గుర్తుంచుకోదగ్గ వ్యక్తిగా ఎదిగిన జయశంకర్​సార్​ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడిచాయి. వేటి కోసమైతే జయశంకర్​సార్​సహా తెలంగాణ సబ్బండ వర్గాలు రోడ్డెక్కి కొట్లాడారో.. స్వరాష్ట్రంలో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందాలి. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించడమే జయ శంకర్​ సార్​కు మనమిచ్చే గొప్ప నివాళి!. 

- అంకం నరేష్, రాష్ట్ర కోకన్వీనర్,  యూఎఫ్​ఆర్టీఐ