తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల సమ్మెది ప్రత్యేక స్థానం. నల్లసూర్యులు పలుగు, తట్ట కిందపడేశారు. ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాలేదు. ఒక దశలో సింగరేణి కార్మికుల సమ్మె తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన సకల జనుల సమ్మెకు స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి చారిత్రక సమ్మె జరిగి ఈనెల13తో పదేండ్లు. అంటే ఒక దశాబ్ద కాలం పూర్తయింది. 2013 సెప్టెంబర్13 నుంచి 35 రోజుల పాటు సకల జనుల సమ్మె సింగరేణి వ్యాప్తంగా జరిగింది.
సమ్మెను విరమించాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి ఉద్యమ నేత ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కు, జేఏసీ చైర్మన్ కోదండరాంకు, సింగరేణి జాక్ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే సింగరేణి కార్మికుల సమ్మె సెగ ఢిల్లీ సమీప నోయిడా నుంచి మొదలు సౌత్ ఇండియా వరకు తాకింది. ఢిల్లీలోని జంతర్- మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో మేమూ పాల్గొన్నాం. సింగరేణి సమ్మె వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. దాదాపు4 వేల చిన్న,పెద్ద పరిశ్రమల మీద ఆ ప్రభావం పడి మూత పడే పరిస్థితి నెలకొంది. స్వరాష్ట్ర సాధన కోసం చేసిన నిరసనల్లో సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కువ.
నిర్బంధాలు పెట్టినా వెనక్కి తగ్గలే..
తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాలా లోతుగా స్టడీ చేసిన దివంగత సుష్మాస్వరాజ్ కూడా ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైనది’ అని ప్రశంసించారు. ఉద్యమ నేతగా తెలంగాణ సాధించాలనే కేసీఆర్ అకుంఠిత దీక్ష, జేఏసీ చైర్మన్ప్రొఫెసర్ కోదండరాం తదితర ఉద్యమకారుల పోరాటం, దాదాపు అన్ని రాజకీయ పార్టీల కృషి, తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి తదితర చర్యల ఫలితంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ మద్దతుతో పార్లమెంట్లో బిల్లు పాస్ కావడంతో తెలంగాణ స్వరాష్ట్ర కల సాకరమైంది. కార్మిక సంఘాల నేతలు, సింగరేణి జాక్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యమాన్ని నడిపించారు. మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి, దివంగత సీపీఐ మాజీ ఎమ్మెల్యే సీపీఐ పక్ష నేత గుండా మల్లేషన్న, మాజీ ఎంపీ జి. వివేక్ వెంకట స్వామి తదితరులు, వేల మంది యూనియన్ల కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపినా ఉద్యమం ఆగలేదు. కోల్ బెల్ట్ లో ఎన్ని నిర్భందాలు అమలు చేసినా కార్మికులు వెనక్కి తగ్గలేదు.
కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలె..
అప్పుడు అధికారంలో ఉండి ఉద్యమకారులను ఇబ్బందుల పాలు చేసిన ఎందరో ఇయ్యాల ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండటం నిజమైన ఉద్యమ కారులు జీర్ణించుకోలేని విషయం. బొగ్గుకు ఎలాగైతే మండే గుణం ఉంటుందో.. భూగర్భాన్ని చీల్చుకుంటూ వెళ్లి బొగ్గును బయటకు తెస్తున్న కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా మండుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు వాటిపై దృష్టి పెట్టాలి. కొత్త గనుల ప్రారంభానికి అందులో ఉపాధి అవకాశాలకు కృషి జరగాలి. డిపెండెంట్ ఉద్యోగం కార్మికుల ఇన్వ్యాలీడేషన్ ద్వారా ఇస్తున్నారు. మనిషికి బదులుగా మనిషికే ఉద్యోగం లభిస్తుంది. కొత్తగా రిక్రూట్మెంట్ చాలా స్వల్పంగానే ఉంది. సింగరేణి పై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి.
42 రోజులు నిరసనలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సింగరేణిలో కార్మికులు35 రోజులు సుదీర్ఘ సమ్మె చేయడం చరిత్రాత్మకం. కేసీఆర్ ఆమరణ దీక్ష సందర్భంగా ఆయన అరెస్ట్ కు నిరసనగా సింగరేణి బొగ్గు గనుల కార్మికులు స్వచ్ఛందంగా స్పందించి విధులు బహిష్కరించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. శ్రీకాంతాచారి ఆత్మహత్య సందర్భంగా నల్ల నేల తల్లడిల్లి పోయింది. కార్మికులు విధులు బహిష్కరించి తెలంగాణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ పర్యటన సందర్భంగా రెండు రోజులు సమ్మె చేసి తెలంగాణ డిమాండ్ ను దేశమంతా తెలిసేలా కార్మికులు సింగరేణి లో గర్జించారు. ఇలా మొత్తంగా సకల జనుల సమ్మెతో కలుపుకొని నల్ల సూర్యులు తెలంగాణ రాష్ట్రం కోసం 42 రోజులు సమ్మె చేశారు. కార్మికులతో పాటు అధికారులు కూడా పలుమార్లు కార్మికుల వెంట నడిచారు. సకల జనుల సమ్మె ముగించిన రోజు సింగరేణికి సీఎండీగా ప్రస్తుతం సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ఎస్ నర్సింగరావు, సింగరేణి జాక్, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు రూ.25 వేల రికవరబుల్ అడ్వాన్స్ ఇచ్చారు. - ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్