అంబేద్కరిజానికి పునర్జన్మ : ఢిల్లీ వసంత్

అంబేద్కరిజానికి పునర్జన్మ నేడు డాక్టర్.బీ.ఆర్​అంబేద్కర్ జయంతి

ఆయన ఒక విరాట్​పురుషుడు. ఇంద్రధనస్సుకు ఎన్నిరంగులో అంబేద్కర్ మేధస్సుకు అన్ని తత్వాలు. ఆయన్ను చదవడం ఒక ప్రపంచ విహార యాత్రగా కనబడుతుంది. మెజారిటీ ప్రజలకు అంబేద్కర్ ఒక న్యాయకోవిదుడుగా, బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా, రాజ్యాంగ పితగా మాత్రమే తెలుసు కానీ ఆయన జీవితకాల అధ్యయనంలో ఆర్థిక శాస్త్ర అంశాలే ప్రధానమైనవి. విదేశాల్లో భారతదేశం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. ఏషియన్ టైగర్ గా చలామణి అవుతున్న కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల ఆధునిక అభివృద్ధికి అంబేద్కర్ ఆర్థిక ప్రణాళికలు ఉపయోగపడ్డాయంటే అతిశయోక్తి కాదు. విద్య, హ్యూమన్ క్యాపిటల్, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక ప్రణాళిక, అంతర్జాతీయ వ్యాపారం, సహకార వ్యవస్థ ఇలాంటి అంశాలపై ఈ దేశాలు అంబేద్కర్ చూపిన బాటలో నడవడం వల్లే అది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతారు. అందుకే ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్థ్యసేన్ అంబేద్కర్ ను తన గురువుగా, తండ్రిగా భావిస్తాడు. స్థూల, సూక్ష్మ ఆర్థిక అంశాలపై విశ్లేషణలో మానవ సంక్షేమానికి దోహదపడ్డ అమర్త్యసేన్ రచనల వెనకాల అంబేద్కర్ భావాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన ఒక విశ్వ మానవుడు. ప్రపంచ మేధావి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చర్చించాలి. ఆయన మేధస్సు వెనకాల ఎంతో కృషి దాగి ఉంది. తాను అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. డబ్బు ఆదా చేసుకోవడంలో భాగంగా తన ఆకలిని చంపుకున్నాడు. ఒక్కపూట మాత్రమే భోజనం చేసి మిగిలిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కునే వాడు. ఇలా తాను అమెరికాలో ఉన్న కాలంలో రెండు వేల పుస్తకాలు సేకరించాడంటే ఆయన మనో సంకల్పానికి, చిత్తశుద్ధికి, అకుంఠిత దీక్షకు మనం తలవంచాలి. తన విద్యాభ్యాసంలో భాగంగా కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధనా అంశాలు పరిశీలిస్తే ఆర్థికశాస్త్రంలో 29 అంశాలు, చరిత్రలో11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆంత్రోపాలజీలో 4, పొలిటికల్ సైన్స్ లో 3, జర్మనీ ఫ్రెంచ్ భాషలో ఒకటి చొప్పున ఏకధాటిగా అధ్యయనం చేసి ఉత్తీర్ణులైన మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఇప్పటికీ తన ఇరవై పేజీల ఆత్మకథ ‘వీసా కోసం ఎదురుచూపు’ కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులకు ఒక పాఠ్య గ్రంథంగా ఉన్నది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పబ్లిక్ ఫైనాన్స్, కరెన్సీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ద్రవ్య ఆర్థిక శాస్త్ర అంశాల్లో ఇప్పటికీ ఒక అంతర్జాతీయ నిపుణుడిగా భావిస్తారు. 2004వ సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీ 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ విశ్వవిద్యాలయంలో చదివి ప్రపంచ మానవాళికి విశిష్టమైన సేవలు అందించిన 64 మేధావుల్లో డాక్టర్ అంబేద్కర్ ను గుర్తించి అతని పేరు మీద తమ గ్రంథాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. న్యాయ విభాగంలో డాక్టర్ అంబేద్కర్ పేరుమీద ఒక అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలకు అవకాశం కల్పించింది.

జాతీయ సమైక్యతను రక్షించిన మేధావి

డాక్టర్ అంబేద్కర్ బహుభాషా కోవిదులు. వ్యాకరణ వేత్త. సాహితీకారుడు. మాతృభాష ప్రేమికుడు. మరాఠీ, హిందీ, గుజరాతి, సంస్కృతం, పాళీ, పర్షియన్, హిబ్రూ, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ వంటి15 భాషల్లో నిష్ణాతుడు. పాళీ భాష వ్యాకరణాన్ని, నిఘంటువును మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతి, హిందీలోకి అనువాదం చేసిన భాషా నిపుణుడు. పెట్టుబడిదారీ విధానంలో ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ‘కీన్స్’ సిద్ధాంతాలను అంబేద్కర్ వ్యతిరేకించాడు. ప్రభుత్వ నియంత్రణ లేని స్వేచ్ఛాయుత మార్కెట్ విధానంలో ప్రజలు నష్టపోతారని హెచ్చరించాడు. ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్టు 2030లో సాధించాల్సిన మానవాభివృద్ధి లక్ష్యాలు వంద సంవత్సరాల క్రితం అంబేద్కర్1930లలో విశ్లేషించాడంటే ఆయన ఎంతటి మేధావో అర్థమవుతుంది. భారతదేశ ఆర్థికాభివృద్ధి కోసం వ్యవసాయ సమస్యలు విశ్లేషిస్తూ సమసమాజ స్థాపన కోసం భూమిని జాతీయం చేయాలని హితవు పలికాడు. భూమి కోల్పోయిన రైతులకు డిబెంచర్ల ప్రతిపాదన చూపాడు. భూస్వామ్య వ్యవస్థ నిర్మూలన కోసం ‘కో వర్కర్ కో ఓనర్’ అనే సహకార భాగస్వామ్య పద్ధతిని ప్రతిపాదించాడు. పెరుగుతున్న జనాభా కోసం1940లోనే జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టాడు. అశోకుడి ధర్మ చక్రాన్ని జాతీయ జెండాలో భాగం చేయడం ద్వారా డాక్టర్ బీఆర్​అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని భారతదేశ ప్రతీకగా తీర్చిదిద్దాడు. భారతదేశంలో ఆర్బీఐ, పవర్​గ్రిడ్, నేషనల్​ఫైనాన్స్​కమిషన్, సెంట్రల్​ వాటర్ ​కమిషన్​ లాంటి జాతీయ సంస్థల ఏర్పాటులో అంబేద్కర్ పాత్ర మరువలేనిది. మహిళా హక్కులు, ఇతర వెనుకబడిన కులాలు, పాకిస్తాన్ ఏర్పాటు, జాతీయవాదం, మైనారిటీల అంశాలపై ఇప్పటికీ ఆయన ఆలోచనలు శిరోధార్యం. అందుకే ఆయన అందరివాడు. నిజమైన దేశభక్తుడు. జాతీయ సమైక్యతను రక్షించిన మేధావి. 

- ఢిల్లీ వసంత్​, రైతు నాయకుడు, ఎండీ, జీకాట్​