రిజర్వేషన్ ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్​

(ఇయ్యాల ఛత్రపతి సాహూ మహరాజ్​ శత వర్ధంతి ) 

మన దేశ చరిత్రలో వందేండ్లుగా గుర్తింపు ఉన్నవాడు ఛత్రపతి సాహు మహరాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. అంటరాని వారికీ, దళితులకు ఆయన చేసిన సేవ అలాంటిది. భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్థంభం ఛత్రపతి సాహు మహారాజ్ దేశ చరిత్రలో దళిత , బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనాపరంగా  మహాత్మ జ్యో తిబాపూలే , ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ సామాజిక న్యాయ , ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు ఆయన. వెనుకబడిన కులంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టిన సాహూ మహరాజ్​సామాజిక ఉద్యమ కారుడు అయ్యాడు.  కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టిస్​ పార్టీ ఉద్యమంతో పాటు  దేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్​ మరణించి నేటికి వందేండ్లు అయ్యింది.

సాహు 1874 జూన్ 26 న రాధాబాయి , జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గేలకు జన్మించాడు.  ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి ( ఓబీసీ ) చెందిన  కున్భీ  వ్యవసాయం కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి , 17 న  తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంత్ రావు ఘాట్గే కి ముద్దుగా  ‘సాహు’ అని  పేరుతో పిలుచుకునేది. అయితే సాహు 11 ఏండ్లకే తల్లిదండ్రులు లేని అనాధ అయ్యాడు. సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు. 

దత్తత అయితే వచ్చాడు కానీ ఆయన శూద్రుడేనని, క్షత్రియ వంశానికి చెందిన వాడు కాడని సమకాలీనీ కాలంలో ఎన్నో అసమానతలు ఎదుర్కొన్నాడు సాహు.  ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు తనని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమం వైపు నడిపేలా చేశాయి. ఆ తర్వాత సత్యశోధక్ సమాజ్ నడిపే బాధ్యతలు తీసుకొని, ‘మరాఠ దీనబంధు’ పేరుతో పత్రికని నడుపుతూ... బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చే బడులు స్థాపించాడు.  కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు జరిపించాడు. తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలతో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ రంగాల్లో బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించి.. బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదని గ్రహించాడు. దాంతో  సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్, హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమం చేసిండు. ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే  కులపరమైన విద్యాసంస్థలను రద్దు చేస్తూ  అన్ని కులాల, మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా, విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం. వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి బడులు ఏర్పాటు చేసిండు. జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం.. ‘ ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో   ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత   ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్​లు కల్పిస్తూ’’ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది.

మహిళల ఉన్నతి కోసం మొదటి అడుగు..
సాహు మహారాజ్ అంటరానివారికి ఆపద్భాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబా సాహేబ్ అంబేద్కర్ సాహు మహారాజ్‌‌‌‌ల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు. కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా బడులు ప్రారంభించడమే కాదు, వారికి ఉపకారవేతనాలు,  ఉచిత భోజన , వసతి సదుపాయాలు కల్పించిండు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టాన్ని, 1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను  చట్టం,  విడాకులు మంజూరు చేయడం లో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2 న విడాకుల చట్టం.. ఇవన్నీ కూడా ఆయన మహిళలకు చేసిన ఎనలేని సేవలే. 1920 జనవరి 17న జోగిని , దేవదాసీ వ్యవస్థను రద్దు చేసిండు. 

కులాల ప్రాతినిధ్యం కోసం కృషి చేసిండు..
స్వరాజ్యం పేరిట నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా , ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి అంటూ.. వెనుకబడిన కులాలను , అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించే ఎప్పుడూ ప్రస్తావించేవాడు. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాంగంలో కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా అప్పటి ప్రభుత్వాన్ని కోరాడు. మహారాష్ట్రకే పరిమితం కాకుండా జస్టిస్​ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపించేలా చేసిన సాహు ప్రాతః స్మరణీయుడు. 

- వెంకట్ కిషన్, సోషల్ ఎనలిస్ట్