ధిక్కారానికే స్వరం కన్నాభిరాన్

ధిక్కారానికే స్వరం కన్నాభిరాన్
నేడు పౌర హక్కుల నేత కన్నాభిరాన్​ వర్ధంతి రాజ్యహింసపై ధిక్కార స్వరం ప్రముఖ లాయర్, పౌరహక్కుల సంఘం నేత కేజీ కన్నాభిరాన్. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం ప్రజల వైపు పోరాడుతున్న ఉద్యమకారుల ఇండ్లపై దాడులు చేసి రాత్రికి రాత్రే ఎన్ కౌంటర్ల పేరిట కాల్చి చంపినప్పుడు, ఎమర్జెన్సీ కాలంలోనూ వారి వైపు వాదించడానికి ముందుకొచ్చి గొంతెత్తినది కన్నాభిరాన్ ఒక్కరే. బొగ్గు గని కార్మికులకు మెరుగైన జీవితాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం జరిగిన పోరాటాలకు మద్దతు తెలిపిందీ ఆయనే. సింగరేణి కార్మికులు నిర్భందానికి గురైనప్పుడు వారివైపు నిలబడి కోర్టుల్లో వాదించిన గొంతు కన్నాభిరాన్‌దే. 1987లో తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు ఐఏఎస్‌లను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఘటనలో కన్నాభిరాన్ వారితో చర్చలు జరిపి విడుదల చేయించారు. కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడు సుధీర్‌‌ను 1991లో, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలరాజు, ఐఏఎస్ డి.శ్రీనివాసులు, మరో ఆరుగురిని 1993లో నక్సల్స్ తీసుకెళ్లినప్పుడు వారిని విడిపించడంలో ఆయనే కీలకపాత్ర పోషించారు. తమిళనాడులో పుట్టి.. తమిళనాడులోని మధురైలో 1929 నవంబర్ 9న కందడై గోపాలస్వామి అయ్యంగార్, పంకజం దంపతులకు కన్నాభిరాన్ పుట్టారు. గోపాలస్వామి డాక్టర్. కన్నాభిరాన్ పూర్వీకులు తమిళులైనా తరతరాలుగా వారి కుటుంబం నెల్లూరులో జీవనం సాగించేది. ఆయన చదువు మొత్తం నెల్లూరులోనే పూర్తయింది. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక, న్యాయ శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. 1953లో మద్రాస్ బార్ కౌన్సిల్ లో చేరారు. ప్రముఖ లాయరైన తన మామ రాజప్ప వద్ద ఉంటూ లా ప్రాక్టీస్ చేశారు. ప్రారంభంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న కన్నాభిరాన్.. హైదరాబాదులో లాయర్‌‌గా నిలదొక్కుకున్నారు. 1970లో రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడుతున్న వారిపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో లాయర్లందరూ కలిసి నక్సలైట్ డిఫెన్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి దానికి కన్నాభిరాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్వతీపురం, హైదరాబాద్ కుట్ర కేసుల్లో కన్నాభిరాన్ డిఫెన్స్  లాయర్‌‌గా ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో డిటెన్యూలుగా ఉన్న వారి తరుఫున వాదించే ఏకైక లాయర్‌‌గా ఉన్నది ఆయనే. ఎమర్జెన్సీ తర్వాత ఏపీ పౌరహక్కుల సంఘానికి 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగారు. పోలీసులు ఎవరిపైనైనా తప్పుడు కేసులు పెట్టినప్పుడు వారి వైపు లాయర్‌‌గా ఉంటూ లొసుగులను బైట పెట్టి న్యాయంగా వారిని విడిపించేవారు. మడమ తిప్పని మనస్తత్వం 1960లో ఏపీ హైకోర్టులో చేరిన కన్నాభిరాన్ రాజకీయ ఖైదీల కేసులను, మానవహక్కులకు సంబంధించిన కేసులను, అనేక బూటకపు ఎన్‌కౌంటర్ కేసులను వాదించారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనది న్యాయం కోసం మడమ తిప్పని ధిక్కార స్వరం. హింసాత్మక చర్యలను, ప్రధానంగా రాజ్యహింసను ఆయన సహించేవారు కాదు. కన్నాభిరాన్ అడుగుపడని ప్రాంతం ఏపీ, తెలంగాణలో లేదని చెప్పవచ్చు. సింగరేణితో, కార్మికుల కుటుంబాలతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. బొగ్గుగని కార్మికుల సమ్మెలు, పోరాటాలకు సంబంధించి కన్నాభిరాన్ బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాక ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లే వారు. నిర్మొహమాటంగా మాట్లాడేవారు 1980లో నాతో పాటు మొత్తం కమ్యూనిస్టు పార్టీకి చెందిన కార్యకర్తలపై ఓ భూస్వామి హత్యకు సంబంధించిన కేసు వరంగల్ కోర్టులో నడుస్తున్నప్పుడు మాకు కన్నాభిరాన్ డిఫెన్స్ లాయర్ గా ఉన్నారు. ఆ కేసులో శిక్షలు పడ్డ కారణంగా కేసు హైకోర్టులో నడిచినప్పుడు కన్నాభిరాన్ తో పాటు ప్రముఖ లాయర్ పద్మనాభరెడ్డి మాకు ప్రధాన డిఫెన్స్ లాయర్ గా ఉన్నారు. కన్నాభిరాన్ ఏ మాటైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారు. మానవ హక్కుల వేదిక మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీసీఎల్‌సీ మాజీ నేత, లాయర్ బాలగోపాల్ మరణించినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కన్నాభిరాన్ తన అభిమాన శిష్యుడిని కడసారి చూడడానికి వచ్చారు. ఆయన కంట తడి పెడుతూ బాలగోపాల్ లాంటి వాడు మళ్లీ దొరకడని అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. పౌరహక్కుల ఉద్యమ నేతగా, ఉమ్మడి ఏపీ హైకోర్టు లాయర్‌‌గా, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థకు సహ వ్యవస్థాపకునిగా, అధ్యక్షునిగా కన్నాభిరాన్ పనిచేశారు. 2010 డిసెంబర్30న తీవ్ర అనారోగ్యంతో ఆయన మరణించారు. తను చనిపోతే ఎవరికీ చెప్పొద్దని, తనను అభిమానించే, ప్రేమించేవారు తనను ఆ స్థితిలో చూడలేరని చెప్పడంతో ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలను కుటుంబ సభ్యులు గోప్యంగా జరిపే ప్రయత్నం చేశారు. అయినా ఎలాగోలా అందరికి తెలియడంతో ఎందరో అభిమానులు శ్మశానవాటికకు చేరుకున్నారు. కన్నాభిరాన్ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన మాటలు, ఆయన నడిచిన బాట చిరస్థాయిగా ఉండిపోతాయి. ప్రపంచ భవిష్యత్తును ఎప్పటికప్పుడు సునాయాసంగా చెప్పేసే మేధస్సు కలిగిన కన్నాభిరాన్.. అన్ని వర్గాల ప్రజల వైపు నిలబడి పౌరహక్కుల కోసం, జీవించే హక్కు కోసం తాను కన్నుమూసే వరకు పోరాడారు. మద్రాస్లో కన్నాభిరాన్ పై దాడి జరిగిన సందర్భంలో గాయాలతో కూడా తన క్లయింట్ కోసం కోర్టుకు వచ్చిన రోజులున్నాయి. పౌర హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయంటే అతిశయోక్తి కాదు. అందరికీ న్యాయం చేయాలని.. రూల్ ఆఫ్ లాను నిష్పాక్షికంగా అమలు చేయాలని జీవితాంతం కన్నాభిరాన్ కృషిచేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు. దేశంలోని పౌరహక్కుల సంస్థలన్నింటిపై రాజకీయ భావజాలాలకు భిన్నంగా పీపుల్ యూనియన్స్ ఫర్ సివిల్ లిబర్టీస్ ను ప్రారంభించి దానికి 1995 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. పౌరుల స్వేచ్ఛ, మానవహక్కుల కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  సీఎంగా ఉన్న టైమ్‌లో మావోయిస్టులతో శాంతి చర్చల కోసం కృషి చేశారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి ఇంట్లో కన్నాభిరాన్ తోపాటు పలువురు పౌరహక్కుల నాయకులతో చర్చలు జరిగాయి. ఐతే ఎన్ కౌంటర్ల విరమణ లాంటి హామీలనిచ్చి, ప్రభుత్వం  నిలబెట్టుకోకపోవడంతో ఈ చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వాస్తవానికి ఇందు కోసం కాకా వెంకటస్వామి చాలా పట్టుదలగా ప్రయత్నం చేశారు. ఎన్ కౌంటర్లను కేంద్రమంత్రిగా ఉండి కూడా ఆయన బాహాటంగా వ్యతిరేకించేవారు. రాత్రికి రాత్రి నక్సలైట్ల పేరిట యువకులను పట్టుకెళ్లినప్పుడు కూడా ఎంతో ఆందోళన చెందేవారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కూడా కన్నాభిరాన్ సపోర్ట్ చేశారు. ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్