గద్దర్ చైతన్య కెరటం..సమసమాజ పిపాసి

గద్దర్ చైతన్య కెరటం..సమసమాజ పిపాసి

గద్దర్ ఒక సామాజిక ప్రళయం. ఆయన ఆట, పాట, మాట సమాజ చైతన్యంలో మరో ప్రళయం. సమ సమాజ నిర్మాణం కోసం అణగారిన వర్గాలను వివక్ష, అసమానతల నుంచి ఆత్మగౌరవ దిశగా మళ్లించేలా పాటుపడిన మహానుభావుడు, ప్రజాయుద్ధనౌక, ప్రజావాగ్గేయకారుడు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్​. ప్రైమరీ స్థాయి నుంచి ఎన్ని అష్టకష్టాలు ఎదురైనా చదువుతోపాటు తన పాటలను కూడా మోసుకుని వచ్చిన గద్దర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్​లో చేరినప్పటి నుంచి అప్పుడే ప్రారంభమైన నక్సల్ బరి ఉద్యమాలు , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.

చిన్న నాటి నుంచి గ్రామీణ ప్రాంతంలోని యాస, భాషతో బుర్రకథలు, పాటలు, పద్యాలతో పల్లె జనాన్ని మెప్పించి వారి అభిమానాన్ని సాధించాడు.   పోలీస్ నిర్బంధ క్రమంలో సొంతపేరు మీద పాటను ప్రచురిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గదర్ పేరుమీద పాట రాశారు.1971 దశకంలో ఆ పాట ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొందింది. కానీ, ఆ పాట గదర్ పేరు మీద పాట రాస్తే ప్రింటింగ్ సమయంలో గద్దర్​గా మారిపోయిందని ఆయన స్వయంగా అనేకమార్లు చెప్పారు.  

1969 నుంచి  ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం 1972లో  జన నాట్య మండలి ఏర్పాటుకు దారితీసింది. అప్పటికే చెరబండరాజు, వేంపల్లి సత్యం లాంటి రచయితలతో పరిచయం కావడంతో విప్లవ పోరాటాల వైపు వెళ్లారు.

మా భూమి సినిమాతో..

 1979లో వచ్చిన మా భూమి సినిమాలో బండెనుక బండి గట్టీ 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా.. గోల్కొండ కోట కింద నిన్ను గోరి కడతం కొడుకో.. అనే పాట ఒక సంచలనం. సికింద్రాబాద్​లో వైఎంసీఏ  వినాయక మండపం నవరాత్రులలో చివరి రోజున ఆయన  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి శివతాండవం చేసి అక్కడి భక్తులను
 ఆకర్షించేవాడు.

గద్దర్​పై కాల్పులు.. ఉలిక్కిపడ్డ ప్రజానీకం  

1997 ఏప్రిల్ 6న సాయంత్రం సమయంలో..తమకు వరంగల్ ప్రాంతంలో ఉన్న భూ వివాదాన్ని పరిష్కారం చేయాలని భూదేవినగర్ వెంకటాపురంలోని గద్దర్ నివాసానికి నలుగురు దుండగులు వచ్చారు. ఒకవైపు మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడి మరోవైపు ఆయనపై కాల్పులు జరిపారు . ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కుటుంబ సభ్యులు భార్య విమల , కూతురు వెన్నెల తిరగబడటంతో దుండగులు పారిపోయారు. ఒక్కసారిగా గద్దర్ కుప్పకూలిపోయి రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే స్థానికంగా ఆటోను పిలిచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్​కి తరలించారు. ఆయనకు తగిలిన ఐదు బుల్లెట్లలో ఒక బుల్లెట్ వెన్నుపూసలో తుదిశ్వాస వరకు ఉంది.

1985లో ఆంధ్రపదేశ్​లోని ప్రకాశం జిల్లా చుండూరులో జరిగిన దళితుల ఊచకోత మారణ
హోమం ఆయనను తీవ్రంగా కలచివేసింది. కత్తి పద్మారావు,  బొజ్జాతారకం లాంటి వారితో కలిసి కారంచెడు  బాధితులకు అండగా నిలిచాడు.  పోలీసుల నిర్భందం రావడంతో ఆయన అండర్​గ్రౌండ్​కు వెళ్లిపోయి ఇతర రాష్ట్రాలలో పనిచేశారు. భారతదేశంలో  నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అన్ని జాతులు కులాలవాళ్లు సమానత్వం సాధించాలని  ఆయన అనేక సమావేశాల్లో తన కళారూపమైన పాటల ద్వారా చెప్పారు. అణగారిన బహుజన వర్గాలు చదువు, రాజ్యాధికారంపైన శ్రద్ధ చూపాలని,  జ్ఞానం ఒక్కటే మార్గదర్శిగా నిలుస్తుందని తన ప్రతి సమావేశంలో బోధించారు.

శాంతిచర్చల ప్రతినిధి 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకూ ఎన్​కౌంటర్లు పెరిగిపోవడంతో ప్రజల నుంచి, పౌర సమాజం నుంచి ప్రభుత్వంపై  వ్యతిరేకత వచ్చింది.  పీపుల్స్ వార్,  జనశక్తి వామపక్ష గ్రూపులతో చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలని ఓ కమిటీ ఏర్పడింది. ప్రతినిధులుగా ఎస్ఆర్ శంకరన్ , హైకోర్టు న్యాయవాది ​ బొజ్జా తారకం, ఆచార్య హరగోపాల్, వరవరరావు, గద్దర్ ఉన్నారు. 

తెలంగాణ మలి దశ ఉద్యమం 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తీవ్ర నిర్బంధం జరుగుతున్న క్రమంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్​పై  ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల్లో చర్చలు ప్రారంభమైనాయి. 1997 జనవరి ప్రాంతంలో భువనగిరిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనసభ పేరు మీద భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పటికి అధికారంలో ఉన్న  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,  సీఎం 
చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎలాగైనా దీన్ని నిర్వీర్యం చేయాలని గ్రీన్ టైగర్స్ పేరు మీద సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇదే అంశమై తనకు బెదిరింపు కాల్పులు వస్తున్నాయని గద్దర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వామపక్ష భావాలు కలిగిన వారందరూ పునరేకీకరణగా గద్దర్ సారథ్యంలో ప్రజా ఫ్రంట్​ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్రజాభవన్ ముందు పడిగాపులు 

రాష్ట్రంలో పెరుగుతున్న అసమానతలు, రోజురోజుకూ దిగజారుతున్న తన ఆరోగ్యంపైన ముఖ్యమంత్రి కేసీఆర్​తో చర్చించాలని ఆయన 2023 ఫిబ్రవరిలో  బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార క్యాంపు కార్యాలయం ప్రజా భవన్​కు వెళ్లి తాను ముఖ్యమంత్రిని కలవాలని సందేశం పంపారు . రెండు గంటలపాటు వేచి చూసినా ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతి లభించలేదు. ఇది గద్దర్​ను వ్యక్తిగతంగా చాలా కుంగదీసింది.

నంది అవార్డును తిరస్కరించిన గద్దర్ 

 గద్దర్​కు  సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. మాభూమి సినిమాలో బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావురో నైజాం సర్కరోడా.. పాట 1980వ దశకంలో సామాజిక విప్లవంగా ఆలోచింపజేసింది.  తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న క్రమంలో  జై బోలో తెలంగాణ సినిమాలో.. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా! పోరు తెలంగాణ! అంటూ గర్జించారు. ఒరేయ్​ రిక్షా సినిమాకు, జై బోలో తెలంగాణ సినిమాకు రెండు పర్యాయాలు నంది అవార్డులు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అంతిమయాత్ర  

74 సంవత్సరాలు వయసులో  తుది శ్వాస వదిలారు.  ప్రభుత్వ లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం మహాబోధి విద్యాలయంలో సమాధి చేశారు. ఈ పోలీసు తూటాలకు ప్రజల కోసం ఎదురొడ్డి నిలబడ్డ గద్దర్​కు అదే  పోలీసులు సెల్యూట్ చేసి గౌరవించారు.

గద్దర్ పేరు మీద సినీ కళా అవార్డు  

రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారుల కోసం ప్రతి సంవత్సరం నంది అవార్డులు ప్రకటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే,  31 జనవరి 2024న రవీంద్రభారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని సినిమా కళాకారులకు ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డుల స్థానంలో  సినిమా కళాకారులకు గద్దర్ పేరు మీద అవార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు నెక్లెస్ రోడ్​లో గద్దర్ కళాక్షేత్రం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

‘భారతదేశం భాగ్యసీమరా! పాడిపంటలకు కొదవలేదు! ఎప్పుడూ ఎండని జీవనదులు ఉండి సకల సంపదలు కలిగిన దేశంలో కరువెట్లుంది నాయన’ అంటూ    రైతు కూలీలు,  రైతుల సమస్యలపైన వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయం మార్కెట్ వద్ద 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ చారిత్రాత్మకం. వామపక్ష నక్సలైట్ ఉద్యమాల్లో భారీ సభగా చరిత్రకారులు చెబుతారు.  చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని ఇచ్చిన పిలుపు మేరకు గద్దర్ 1992లో ప్రధాన స్రవంతిలోకి వచ్చా రు. ఈ సందర్భంగా బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో సమావేశం ఏర్పాటు చేసి అజ్ఞాత వాసం వదిలి జన స్రవంతిలోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. 

- అస శ్రీరాములు,
 సీనియర్ జర్నలిస్ట్