- మిడ్‌మానేరు కోసం అన్నీ కోల్పోయాం
- సమస్యలు వెంటనే పరిష్కరించండి
- సంకెపల్లి వద్ద నిర్వాసితుల రాస్తారోకో
వేములవాడ, వెలుగు: మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లు, త్యాగం చేశామని, సీఎం కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించడంలేదని వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి వద్ద నిర్వాసితులు రాస్తారోకో చేశారు. కలెక్టర్, ఆర్డీఓ వచ్చి ఎన్నో సార్లు హామీ ఇచ్చారు తప్ప అమలు చేయడం లేదన్నారు. 206 ఇండ్లకు పరిహారం రావాలని, 90 మందికి పట్టాలు, యువకులు ప్యాకేజీలు రావాలని, మౌలిక వసతులు కల్పిచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రూ.5 లక్షల 4 వేలు డబూల్ బెడ్ రూం కోసం మంజూరు చేస్తామని మాట తప్పరన్నారు. సుమారు 2 గంటల పాటు వెహికల్స్నిలిచిపోవడంతో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్ నిర్వాసితులతో మాట్లాడి ధర్నా విరవింపచేశారు.
హరీశ్‌రావ్.. ఏడ దాక్కున్నవ్?
పాదయాత్రలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
హుజూరాబాద్ వెలుగు: ‘మిస్టర్ హరీశ్‌రావు.. హుజూరాబాద్ బై ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానాలు ఏమైనయ్.. ఏడ దాక్కున్నవ్.. ఎంతో అభివృద్ధి చేస్తానన్నవ్. దత్తత తీసుకుంటానని చెప్పినవ్.. ఎన్నికలైనంక ఒక్కసారన్న ఇక్కడికి వచ్చినావా?’ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ప్రశ్నించారు. పొన్నం చేస్తున్న పాదయాత్ర బుధవారం హుజూరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రానైట్ బిజినెస్ వ్యవహారంలో ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా హుజూరాబాద్ చౌరస్తాలో జరిగిన సభలో వీహెచ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
- నేడు కోరుట్లలో బీజేపీ బహిరంగ సభ
- పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికకు రంగం సిద్ధం
- సభకు రానున్న బీజేపీ నేషనల్లీడర్ తరుణ్ చుగ్, ఎంపీ అరవింద్
మెట్ పల్లి, వెలుగు : కోరుట్ల పట్టణంలో ఆగస్టు 18న నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు లీడర్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు తరున్ చుగ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ తదితర లీడర్లు మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ లీడర్ సురభి భూంరావు తనయుడు నవీన్ కుమార్ తన అనుచరులతో బీజేపీలో చే
రనున్నారు. చేరికలకు సంబంధించి ఆ పార్టీ లీడర్లు నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల కిందట మల్లాపూర్ లో ఎంపీ అరవింద్సమక్షంలో గోపిడి శ్రీనివాస్ రెడ్డి, బద్దం సోమరెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. ఒక వైపు చేరికలు, మరో వైపు పార్టీ కార్యక్రమాల జోరుతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.
ఎంపీ అరవింద్ ప్రత్యేక దృష్టి..
గతంలో రాష్ట్రంలోనే కమలానికి కంచుకోటగా ఉన్న కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతంలో పూర్వవైభవం కోసం బీజేపీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ 1985, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలతో పాటు మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్ పల్లి మండలాల్లోని గ్రామాల్లో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండేది. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంపై మెట్ పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను కలుస్తూ అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలి
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింబాద్రి
మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకు లాయర్లపై భౌతిక దాడులు, హత్యలు పెరుగుతున్నాయని సర్కారు వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి డిమాండ్ చేశారు. బుధవారం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో లాయర్లు స్థానిక ఆర్డీఓ ఆఫీస్ లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ లాయర్లపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 41 ఏ సీఆర్పీసీ ద్వారా నిందితులకు పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇవ్వడం వల్ల క్లయింట్లకు అన్యాయం జరుగుతోందని అవేదన వ్యక్తం చేశారు. సెక్షన్ 41 ఏ సీఆర్పీసీని సవరించాలని కోరారు. న్యాయవాదులు రాంబాబు, వెంకట నర్సయ్య, రాజ్ మహమ్మద్, లక్ష్మణ్, భూమేశ్వర్, రాజారాం, సత్యం, నర్సయ్య, శెట్టి, సుధాకర్, మహేష్ పాల్గొన్నారు.
వ్యాసరచనలో శ్రీచైతన్య స్టూడెంట్ ప్రతిభ
తిమ్మాపూర్, వెలుగు : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో శ్రీచైతన్య కాలేజీ స్టూడెంట్సాయివర్ష ఉత్తమ బహుమతి గెలుచుకుని గవర్నర్ తమిళిసై నుంచి మీదుగా బహుమతి అందుకున్నట్లు కాలేజీ చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్కమ్యూనికేషన్ ఫస్టీయర్స్టూడెంట్సాయివర్ష రాసిన వ్యాసానికి బహుమతి రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, హెచ్ఓ డీ మీడియా ఇన్చార్జి రమేశ్, లెక్చరర్లు పాల్గొన్నారు.
సొసైటీ అవినీతిపై విచారణ చేపట్టాలి
ఆఫీస్ ముందు బీజేపీ నేతల ఆందోళన
కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతిపై విచారణ చేపట్టాలని బుధవారం సొసైటీ ముందు బీజేపీ లీడర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ దుర్షేడ్ సొసైటీలో గతంలో రూ.8 లక్షల విలువైన మందు బస్తాలు, పెట్రోల్, డీజిల్ కు సంబంధించి రూ.17 లక్షల అవినీతి లెక్క తేలక ముందే రూ.33 లక్షల విలువైన మందు బస్తాలు మాయమయ్యాయని ఆరోపించారు. అధికారులు, పాలకవర్గం కలిసి సొసైటీ సభ్యులు, రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గంపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు రమణారెడ్డి, యువ మోర్చా మండలాధ్యక్షులు రమేశ్ పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
పెద్దపల్లి, కరీంనగర్ సిటీ, జగిత్యాల, వెలుగు: రక్తం దానం అంటే ప్రాణ దానం చేయడంతో సమానమని పెద్దపల్లి కలెక్టర్ సంగీత అన్నారు. బుధవారం పెద్దపల్లి ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 84 మంది, గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో 71 మంది, మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 60 మంది రక్తదానం చేశారన్నారు. కరీంనగర్లో నిర్వహించిన రక్తదాన శిబిరాని జిల్లా పరిషత్ చైర్పర్సన్విజయ, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ ప్రారంభించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కోరుట్ల ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన లయన్స్ క్లబ్ రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసినవారికి ప్రశంస పత్రం ప్రదానం చేశారు.
పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి
కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు : ధరణికి సంబంధించి పెండింగ్ అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అదనపు టీఎంసీకి సంబంధించిన సర్వే పనుల రిపోర్ట్ అందించాలన్నారు. ఆర్అండ్ఆర్ లో రెవెన్యూ పరంగా చేయాల్సిన పనులు, ప్యాకేజీ 9కి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
25న జాబ్ మేళా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్
హుజూరాబాద్ వెలుగు: నిరుద్యోగ యువత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అడిషనల్డీసీపీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి తో కలిసి జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. 70 కంపెనీలకు చెందిన ప్రముఖులతో మాట్లాడి వారి సంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి నుంచి ఎంటెక్ చదివిన వారందరికీ అవకాశాలను కల్పిస్తారని వివరించారు. 25న పట్టణంలోని మధువని గార్డెన్ లో జరిగే మేళాకు నిరుద్యోగులు హాజరుకావాలని కోరారు.
భార్యను పొడిచిన నిందితుడి రిమాండ్
చిగురుమామిడి, వెలుగు: భార్యను హత్య చేసిన నిందితుడిని బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీషను ఆమె భర్త ప్రవీణ్ఆగస్టు 15న కత్తితో మెడ కోసి చంపాడు. మృతురాలి తండ్రి రవి ఫిర్యాదు మేరకు ప్రవీణ్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. భార్య తనకు దూరంగా ఉండడంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్నాడని, అదును చూసి కూరగాయలు కోసే కత్తితో భార్య మెడ కోసి హత్య చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
వేములవాడరూరల్, వెలుగు : మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన బైరి లచ్చవ్వ(40) అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. లచ్చవ్వ బుధళవారం తన ఇంటి ధాబాపైకి వెళ్లి అక్కడే మృతి చెంది పడి ఉన్నట్లు తెలిపారు. సాయంత్రం మృతురాలి భర్త హన్మయ్య, కొడుకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కరెంట్ షాక్ తో చనిపోయిందా లేక ఏదైనా అనారోగ్య కారణంతోనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
లారీ ఢీ కొని యువకుడు మృతి
వెల్గటూర్, వెలుగు : ప్రమాదవశాత్తు లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ బస్ స్టేషన్ ముందు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం మోదల గ్రామానికి చెందిన అల్లం మహేశ్(25) బుధవారం తన అమ్మమ్మ ను చూడటానికి జగిత్యాల జిల్లా మొక్కట్రావ్ పేటకు వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వెల్గటూర్ బస్టాండ్ వద్ద అతివేగంగా వస్తున్న లారీ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలై మహేశ్అక్కడిక్కడే చనిపోయాడు.
విద్యతోపాటు ఆటల్లో రాణించాలి : కలెక్టర్ కర్ణన్
కరీంనగర్ సిటీ, వెలుగు: స్టూడెంట్లు విద్యతోపాటు ఆటల్లో రాణించాలని కలెక్టర్ కర్ణన్ అన్నారు. బుధవారం అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటలను ఆయన ప్రారంభించారు. పిల్లలు మెబైల్ గేమ్ లను కాకుండా శారీరక శ్రమను కలిగించే క్రీడలు ఆడాలన్నారు.
మంచి ఆహారం తీసుకోవాలి..
ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. నగరంలోని శ్వేత హోటల్ లో కోవే, హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్ అసోసియేషన్ సంయుక్తంగా ‘మేరా స్వాద్ మేరా స్వస్త్’ అనే అంశంపై మహిళలకు నిర్వహించిన వంటల పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం విజేతలకు శ్రీదేవి (మొదటి) జి.శైలజ(ద్వితీయ( బి.స్వప్న(తృతీయ) బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీర్, వ్యవసాయశాఖాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బహ్రెయిన్‌లో యువకుడు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం,వెలుగు: మండలంలోని వేములకుర్తికి చెందిన దొనికెన రాజ్‌కుమార్(22) ఉపాధి నిమిత్తం బహ్రెయిన్వెళ్లి ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇంటర్ పూర్తి చేసిన రాజ్కుమార్ఉపాధి కోసం ఆరు నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లాడు. చాలా రోజుల వరకు అతడిని అక్కడ పని దొరకలేదు. కొద్దిరోజుల తర్వాత ఇళ్లలో లేబర్పని చేశాడు. ఈక్రమంలో ఆగస్టు 15వ తేదీ రాత్రి రూంలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఓ వైపు ఇంటి వద్ద అప్పులు పెరగడం.. మరోవైపు చాలీచాలని జీతంతో ఆందోళనకు గురై చనిపోయాడని కుటుంబీకులు రోదించారు. మృతదేహన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.