- చండీ, సుదర్శనయాగాల నిర్వహణ
- పాల్గొననున్న చినజీయర్‌స్వామి
- ప్రజాప్రతినిధులతో సీఎం ప్రత్యేక భేటీ
- 1120 మంది పోలీసులతో బందోబస్తు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి నీళ్లు రానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎత్తయిన ఈ రిజర్వాయర్ ఎత్తిపోతలను శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బైలాన్పూర్ వద్ద ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. మొదట ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించాలని భావించినా తర్వాత దాన్ని 15 టీఎంసీలకు పెంచారు. కొండ పొచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి నీటి పంపింగ్ సందర్భంగా రెండు చోట్ల యాగాలు నిర్వహించనున్నారు. కొండపోచమ్మ దేవాలయం వద్ద చండీ యాగం, రిజర్వాయర్ సమీపంలోని పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు చండీయాగంలో పాల్గొంటారు. అటు తర్వాత ఉదయం 10 గంటలకు చినజీయర్ స్వామి తో కలిసి సుదర్శనయాగంలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు పంప్ హౌస్ లో మోటార్లను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత గోదావరి నీళ్లను స్వాగతిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజు పూర్లోని వరద రాజేశ్వర స్వామి దేవాలయాన్ని సీఎం సందర్శిస్తారు. అదేవిధంగా ఎర్రవల్లి, మర్కుక్‌లో రైతు వేదికల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక భేటీ
మర్కుక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు ముఖ్య నేతలు దాదాపు 500 మంది పాల్గొనే అవకాశం ఉంది. సమావేశంలో పాల్గొనే వారందరికీ పాసులు జారీ చేశారు. వారికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నందున పోలీసులు ఆ ప్రాంతాన్ని 17 సెక్టార్లుగా విభజించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు విధుల్లో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 14 మంది ఏసీపీలు, 48 మంది సీసిఐలు, 112 మంది ఎస్ఐలు, 158 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 702 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 46 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళ హోంగార్డులతోపాటు స్పెషల్ పార్టీస్, రోప్ పార్టీ ఇలా అందరూ కలిపి1120 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట కమిషనర్ జోయల్ డెవిస్ చెప్పారు.