- నాన్ లోకల్స్ సిటీ విడిచి వెళ్లాలని ఎస్‌ఈసీ ఆదేశం
- పోలింగ్ ముగిసేదాకా వైన్ షాపులు మూసివేత
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల ప్రచారానికి ఆదివారంతో తెరపడనుంది. సాయంత్రం ఆరు గంటలకు పార్టీలు, క్యాండిడేట్లు తమ క్యాంపెయిన్‌ను ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. జీహెచ్‌ఎంసీలో ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. స్థానికేతరులు ఇక్కడే ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తడంతోపాటు ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పేర్కొంది.
క్యాండిడేట్లకు ఒకటే వెహికల్
పోటీలో ఉన్న క్యాండిడేట్లు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఒక్క వెహికల్‌కు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఎస్‌ఈసీ తెలిపింది. క్యాండిడేట్‌తోపాటు ఎలక్షన్ ఏజెంట్ కూడా ఆ వాహనంలో తిరగొచ్చని తెలిపింది.
నేటితో ప్రచారం బంద్
ఆ వెహికల్ కు జారీ చేసిన పర్మిషన్ లెటర్‌ను ముందటి అద్దంపై అతికించుకోవాలని సూచించింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఒకటో తేదీన పోలింగ్ ముగిసే వరకు వైన్స్ షాపులు మూసి ఉంచాలని ఆదేశించింది. పోలింగ్ రోజున క్యాండిడేట్లు తమ వెహికల్స్‌లో ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు తరలించడం నేరమని హెచ్చరించింది.
డివిజన్లోని ఓటర్లకే ఏజెంట్లుగా చాన్స్
క్యాండిడేట్లు తమ తరఫున సంబంధిత డివిజన్లోని ఓటర్లను మాత్రమే పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. గతంలో సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లను మాత్రమే ఏజెంట్లుగా నియమించుకునే అవకాశం ఉండేదని.. హైకోర్టు ఆదేశాలతో సవరించామని తెలిపింది. ఏజెంట్లు సంబంధిత పోలింగ్ స్టేషన్‌కు చెందిన వారు కాకున్నా.. ఆ వార్డులోని ఓటర్లయితే చాలని పేర్కొంది.