- సమ్మక్క సారలమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
- ముస్తాబు కానున్న పగిడిద్దరాజు, గోవిందరాజులు దేవాలయాలు
మేడారం మహాజాతరలో కీలకమైన మండమెలిగె పండుగ బుధవారం నిర్వహించనున్నారు. జాతరకొచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లక్నవరం నుంచి వదిలిన నీరు రెండు రోజుల్లో జంపన్న వాగులోకి చేరతాయి. మరోవైపు మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం సైతం జాతరకొచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. ఈసారి జాతరలో ప్రయాణికులకు కాలినడక బాధ తప్పించడానికి ఆటోలు నడిచేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతరలో రెండో ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సమ్మక్క, సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు దేవాలయాల్లో పూజారులు బుధవారం మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వనదేవతలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. మేడారంలో చిన్నజాతర సమయంలో గతేడాది ఈ పండుగ నిర్వహించారు. మళ్లీ ఏడాది తర్వాత మహాజాతర సమయంలో కూడా ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగ నేపథ్యంలో విధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మేడారం రానున్నారు. బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు శుద్ధి చేస్తారు. నీటితో ఆలయాలను శుభ్రంగా కడిగి, పుట్ట మట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. తల్లులు ధరించిన ఆయుధాలు, పూజా సామగ్రిని, దేవతామూర్తులు ధరించిన మువ్వలు, గజ్జెలు, ఆడేడాలు, కత్తులను, కుంకుమ భరిణేలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు, కొండాయి గ్రామంలోని గోవిందరాజు ఆలయాలలో కూడా ఇదేవిధమైన పూజలు జరుగుతాయి. వచ్చే బుధవారం ఫిబ్రవరి 5న మాఘ శుద్ధ పౌర్ణమి రోజు సారలమ్మ గద్దెకు చేరడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది.
జాతరలో ఆటో సవారీ
ఏటూరునాగారం, వెలుగు: మేడారం జాతరలో ఆటో సవారీ అందుబాటులోకి వచ్చింది. గతంలో పోలీసులు ఎక్కడ వాహనం ఆపేస్తే అక్కడి నుంచి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా బాధలు అవసరం లేదు. హాయిగా ఆటో ఎక్కి అనుకున్న చోటకు వెళ్లొచ్చు. మేడారంలో ప్రధానంగా ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటే జాతర సక్సెస్ అయినట్టే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. మహా జాతర ప్రారంభానికి మరో వారం మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే 15 రోజులుగా నిత్యం లక్షలాది మంది భక్తులు తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించి వెళ్తున్నారు. వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు పస్రా మీదుగా వచ్చే వాహనాలను కన్నెపల్లి క్రాస్స్తూపం వద్ద చెక్పోస్ట్పెట్టి ఆపేస్తున్నారు. తాడ్వాయి మీదుగా వచ్చే వాహనాలను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆపేస్తున్నారు. తాడ్వాయి రోడ్‌లోని ఆర్టీసీ బస్టాండ్, పస్రా నుంచి వచ్చే వారికి కన్నెపల్లి స్తూపం నుంచి గద్దెలు, జంపన్న వాగు వద్దకు వెళ్లేందుకు సుమారు 60కి పైగా ఆటోలు అందుబాటులో ఉంచారు. ఒక్కొక్కరికి కనీస చార్జీగా రూ. 15, గరిష్ఠ చార్జీగా రూ. 20 వసూలు చేస్తున్నారు. మొత్తం ఆటో మాట్లాడుకుంటే రూ. 100 తీసుకుంటున్నారు.
మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ
ములుగు, వెలుగు: మొదటి మొక్కుల తల్లిగా పేరుగాంచిన ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. మహాజాతరకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఇక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి పసుపు, కుంకుమలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ ఆధ్వర్యంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు వాటర్ ట్యాంకుల ద్వారా నిత్యం తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ములుగు జిల్లాలో ప్లాస్టిక్ నిషేధించిన గత కలెక్టర్ సి.నారాయణరెడ్డి మేడారం మహాజాతరను కూడా ప్లాస్టిక్ రహితంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ సందర్భంలో ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులతో కాలకేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. మేడారం వచ్చిపోయే భక్తులు ఈ విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీటి విడుదల
99 శాతం పనులు పూర్తయినయ్: మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు, వెలుగు: రెండేళ్లకోసారి నిర్వహించుకునే మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఇంట్లో శుభకార్యంలో భావించి విధులు నిర్వర్తించి సక్సెస్చేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కోరారు. జాతరకు వచ్చే ప్రతి భక్తునితో మర్యాదగా నడుచుకుంటూ అమ్మవారికి మొక్కులు అందజేసి క్షేమంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మలను మంగళవారం కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి వీపీ గౌతమ్‌తో కలిసి మంత్రి దర్శించుకున్నారు. అనంతరం చిలుకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా హరిత హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాజాతరకు వారం రోజులు గడువు ఉందని, ఇప్పటికే లక్షలాది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లక్నవరం సరస్సు నుంచి నీటిని వదిలిపెట్టారని, రెండు రోజుల్లో జంపన్నవాగులో సమృద్ధిగా నీరు చేరుతుందన్నారు. ఈ సందర్భంగా మహాజాతరకు సంబంధించిన సీడీలను, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాధుల నియంత్రణ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.