తిరువనంతపురం/హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ ముంగిట తన అస్త్రాలు, బలాబలాలనూ చివరిసారి సరిచూసుకునేందుకు టీమిండియా బరిలోకి దిగనుంది. మంగళవారం జరిగే తమ రెండో వార్మప్ మ్యాచ్‌లో క్వాలిఫయర్ టీమ్ నెదర్లాండ్స్‌తో పోటీ పడనుంది. గువాహతిలో ఇంగ్లండ్‌తో తొలి వార్మప్ ఒక్క బాల్ కూడా పడకుండా రద్దయింది. ఈ మ్యాచ్‌కు కూడా వాన ముప్పు పొంచి ఉంది. ఎంత ఆట సాగినా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే తుది జట్టుపై అంచనాకు రావాలని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ భావిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం రెండ్రోజుల ముందే టీమ్ తిరువనంతపురం చేరుకోగా... విరాట్ కోహ్లీ ఇంకా రాలేదు.
వ్యక్తిగత కారణాలతో తను గువాహతి నుంచి నేరుగా ముంబై వెళ్లాడు. మ్యాచ్ రోజు తను జట్టులో చేరి అవసరం అయితే వార్మప్ ఆడతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్, అయ్యర్, షమీ కూడా దూరంగా ఉండగా.. గిల్, సూర్యకుమార్, బుమ్రా, అశ్విన్, జడేజా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పోటీ పడనుంది. తమ తొలి వార్మప్‌లో పాక్.. కివీస్ చేతిలో ఓడింది. భద్రతా కారణాలతో ఆ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగ్గా.. ఇప్పుడు ఆసీస్–పాక్ పోరుకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. వార్మప్ అయినా రెండు పెద్ద జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఈ పోరుపై ఆసక్తి నెలకొంది.