హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వ్యవహారాలు, క్వశ్చన్ అవర్, వాయిదా తీర్మానాలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుధ, గురువారాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ లోని ఎంసీ హెచ్ ఆర్డీలో ఈ ప్రోగ్రాం జరగనుంది. మంగళవారం ట్రైనింగ్ ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, ఎంసీహెచ్ ఆర్డీ డీజీ, స్పెషల్ సీఎస్ శశాంక్ గోయల్ పరిశీలించారు.
అసెంబ్లీ సమావేశాల్లో సమావేశాల విధివిధానాలు, సభ జరిగే తీరు, సభ మర్యాద, ప్రత్యేకత, వాయిదా తీర్మానాలు, షార్ట్ నోటీస్, స్టేట్మెంట్ టు ద సీఎం అండ్ మినిస్టర్స్, షార్ట్ డిస్కర్షన్, హఫెన్ అవర్ డిస్కర్షన్, అసెంబ్లీ 344 రూల్, (అత్యవసర చర్చ) తదితర పలు అంశాలపై ఢిల్లీకి చెందిన పార్లమెంట్ రీసెర్చ్ సొసైటీ ( పీఆర్ఎస్) నిపుణులు వివరించనున్నారు.
- ఎమ్మెల్యేల ఒరియెంటేషన్ను బహిష్కరిస్తున్నం: కేటీఆర్
ఎమ్మెల్యేల ఒరియెంటేషన్ ప్రోగ్రామ్‌ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందే తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, మొదటి రోజే సభ లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ తీరుకు నిరసనగా బుధవారం నుంచి నిర్వహించనున్న ఒరియెంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా స్పీకర్ నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.