- ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు
జగిత్యాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. స్థానిక గీతా గ్రౌండ్ లో ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏపీ పర్యటన ముగించుకొని, ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. 8.10 గంటలకు రాజ్ భవన్చేరుకొని, అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయలుదేరి 10.10 గంటలకు బేగంపేట్ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.20 గంటలకు జగిత్యాల చేరుకొని, బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత 12.35 గంటలకు జగిత్యాలలో బయలుదేరి.. 1.35 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. కాగా, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్ పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని సభకు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో దాదాపు 8 జిల్లాలకు చెందిన 1600 మంది ఆఫీసర్లు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.