నాగర్ కర్నూల్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ అధికారుల బృందం పర్యవేక్షణలో జిల్లా పోలీస్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మూడు వేదికలు ఏర్పాటు చేశారు. సభకు లక్ష మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. సభకు పోలీస్ భద్రత కల్పిస్తుండగా, నాగర్‌కర్నూల్‌కు రహదారులపై పోలీసు నిఘా పెంచారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు డీకే అరుణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎంపీ పోతుగంటి రాములు, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, దిలీపాచారి మాట్లాడుతూ వెనకబడిన నాగర్ కర్నూల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు మోదీ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
35 ఏండ్ల తర్వాత..
ప్రధాని హోదాలో దివంగత రాజీవ్‌గాందీ 1989లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభల్లో పాల్గొన్నారు. 35 ఏండ్ల తర్వాత నాగర్ కర్నూల్‌కు ప్రధాని హోదాలో ఎన్నికల సభలో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్‌లో నాగర్ కర్నూల్‌కు బయలుదేరుతారని అధికారులు తెలిపారు. బహిరంగసభలో పాల్గొని12.45కు తిరిగి వెళ్తారు.