విశ్లేషణ: శ్రీకాంతాచారి చావుకు నేటితో 12 ఏండ్లు

తెలంగాణ ఉద్యమం అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఆత్మబలిదానాలే. 1969 ఉద్యమంలో 369 మంది రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులు అయ్యారు. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి. ఆయన రగిలించిన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సమాజం నిప్పు కణికలా మారింది. యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి స్వరాష్ట్రాన్ని సాధించుకునేందుకు నడుం బిగించారు. నేడు శ్రీకాంతాచారి భౌతికంగా లేకున్నా ఆయన త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. శ్రీకాంతాచారి తాను చనిపోతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది నేటి (డిసెంబర్​3)తో 12 ఏండ్లు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారిని స్మరించుకుందాం. 

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కొడుకు శ్రీకాంతాచారి. వీరిది సాధారణ కుటుంబం. తండ్రి వెంకటాచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేస్తాడు. శ్రీకాంతాచారి1986వ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు15 రోజున జన్మించాడు. అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు పుట్టడంతో సహజంగానే ఆ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకునేవాడు. అంబేద్కర్, చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ, నెహ్రూల చరిత్ర చదివాడు. సమాజసేవలో ముందుంటూ.. ఎవరు సాయం కోరినా కాదనేవాడు కాదు. తాను దాచుకున్న డబ్బును పేదలు, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు. శ్రీకాంతాచారి ప్రాథమిక విద్యను  మోత్కూరు, నకిరేకల్ గ్రామాల్లో పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన శ్రీకాంతాచారి విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లినా.. తెలంగాణ ధ్యాసే! తెలంగాణ పాటలు పాడటంతోపాటు కవితలు రాస్తూ ఉండేవాడు. 

ఉద్యమం మొదలైంది..
అప్పుడప్పుడే స్వరాష్ట్ర ఉద్యమం క్రమంగా ప్రజల్లోకి వెళ్తోంది. నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మీడియా సమక్షంలో చెప్పారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షకు వెళ్తుండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో ఆందోళనలు, నిరసన ఉద్యమాలు ఉధృతమయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం అణచివేత కొనసాగించడం ప్రారంభించింది. ఉద్యమకారుల అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలనుకున్నాడు. ఇదే గట్టి కోరికను మనసులో తలుచుకుంటూ.. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఉద్యమ జ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ.. “జై తెలంగాణ’’ అంటూ నినదించాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ కాలిన గాయాలతో వేడుకున్నాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది, తోటి ఉద్యమకారులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే కామినేని హాస్పిటల్ కు తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స తర్వాత యశోదకు, రెండు రోజుల తర్వాత ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చివరగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. ఒకవేళ నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి ప్రాణత్యాగం చేస్తా అని చివరి మాటలు చెబుతూ కన్నుమూశాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో కాలుతుంటే టీవీల్లో చూసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం తెలంగాణ ప్రజలను కదిలించింది. యావత్ తెలంగాణ  విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, ఆడవాళ్లు, ముసలివాళ్లు, వికలాంగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా సకల జనులు కదం తొక్కారు. 

శ్రీకాంతాచారి బాటలో..
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి స్ఫూర్తితో పోలీస్ కిట్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డిలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఈ అమరుల త్యాగాలకు తెలంగాణ ప్రజలు చలించారు. తీవ్రస్థాయిలో స్పందించి ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేసీఆర్ పండ్ల రసం తాగి దీక్ష విరమించారనే ప్రచారం సాగిన సందర్భంలోనూ తెలంగాణ రైతులు, ఉద్యమకారులు నిరసనలు ఆపలేదు. ప్రతి సంవత్సరం నవంబర్​29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురించి మాట్లాడి ఆ రోజును తెలంగాణ దీక్షాదివస్ గా జరుపుతున్నారు. కానీ ఆ ఆమరణ దీక్షలో ఎందరో ప్రాణాలు అర్పించారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారి త్యాగాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేటి తెలంగాణ అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9న అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రత్యేక తెలంగాణ ప్రకటన వరకు జరిగిన ఉద్యమంలో వందలాది బిడ్డలు ప్రాణాలు అర్పించారు. వారి ఆత్మబలిదానాలే కోట్లాది తెలంగాణ ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేశాయి. ప్రత్యేక తెలంగాణ వస్తే  ఉద్యోగాలు వస్తాయి.. పిల్లల భవిష్యత్ బాగుంటుందని భావించి సకల జనులు రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 

అమరులకేది గుర్తింపు?
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మంది అమరులు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా జరపాలి. ఆయన పేరు మీద లైబ్రరీ కట్టిస్తాం అని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. శ్రీకాంతాచారి చరిత్రతో పాటు పోలీస్ కిట్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డిల జీవిత విశేషాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. 1200 మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలి.

- పీలి కృష్ణ, జర్నలిస్టు