మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ (రాజుపేట)లో వెలిసిన నాగులమ్మ అమ్మవారికి ఆదివాసీ సంప్రదాయాలతో “సుంకు పండగ” ను నేటి నుంచి ఈ నెల 29 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు, ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ తెలిపారు.
పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున మహా జాతర ( సుంకు పండగ )ను రెండేండ్లకోసారి జరుపుతారు. మంగళవారం మండే మెలుగుదు పూజలతో ప్రారంభమై, బుధవారం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. గురువారం గోదావరి పుణ్యస్నానాల అనంతరం రాత్రి 11.45 గంటలకు సుంకు పండగ నిర్వహించి, అమ్మవారి ఏల్పుల డాలు గుడ్డ ( చరిత్ర ) ప్రదర్శన ఉంటుంది. శుక్రవారం అమ్మవారి ఊరేగింపుతో నాగులమ్మ ఉత్సవం ముగుస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.