నిరక్షరాస్యుడు అందెశ్రీ ఆసువుగా ఆలపించిన ‘జయ జయహే తెలంగాణ..., జననీ జయకేతనం...!’ అంటూ సాగిన ఉద్యమ పాట, నేడు రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ప్రకటించడం హర్షణీయం. దశాబ్దాల తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నాయకుల చేతుల్లో నుంచి బంధ విముక్తం చేసే ప్రయత్నంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర గీతంగా ప్రజలందరి మదిలో నిలిచిపోయిన గీతాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్ ‘రాష్ట్ర గీతం’ హోదాను ఇవ్వడం సముచితం.
ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబడితే - రాష్ట్ర గీతాన్ని కేసీఆర్ ఈ పదేళ్లపాటు చీకటిలో ఉంచాడు. రేవంత్ రెడ్డి అన్నట్లు ‘కేసీఆర్ తెలంగాణకు దశాబ్ద కాలం పాటు చేసిన ద్రోహం ఆంధ్ర పాలకులు కూడా చేయలేదు’. ఏది చేసినా తనకు, తన కుటుంబానికి, తన వర్గానికి మాత్రమే లాభం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ దిట్ట. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంలో తనకు ఎంత మాత్రం ప్రయోజనం లేదు, లాభం లేదు... కనుకనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు.
ఏదేమైనా ఎట్టకేలకు అందెశ్రీ మానస పుత్రిక రాష్ట్ర గీతంగా ఘనతికెక్కడం చారిత్రాత్మకం. ఉద్యమ పాటను గౌరవించడం అంటే తెలంగాణ ప్రజలు తమను తామే గౌరవించుకోవడంగా చెప్పవచ్చు. అదే ఆత్మగౌరవం. ఉద్యమకాలమంతా గ్రామ గ్రామాన, ప్రతి బడిలో పెద్దల నుంచి పిల్లల దాకా తెలంగాణ జాతి గానమైన జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం అనే పాటను పదేండ్ల పాటు అధికారికంగా ప్రకటించకుండా ఉండేందుకు కేసీఆర్కు మనసు ఎలా ఒప్పిందో అర్థంకాదు. కొత్త సీఎం అయినా ఆ గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటించినందుకు అందరమూ సంతోషిద్దాం. ఈ సందర్భంగా మిత్రులు అందెశ్రీకి నేను ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతున్నాను. జయహో అందెశ్రీ. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇక చిరంజీవులు.
కె శ్రీనివాసాచారి, తూప్రాన్